జనం స్పందన చూసైనా స్పృహలోకి వస్తారా!

సెప్టెంబర్‌ 2న జరిగిన దేశవ్యాప్త సమ్మెకు ఉద్యోగ, కార్మిక వర్గాల నుంచి అపూర్వమైన మద్దతు లభించింది. అందరి అంచనాలకు మించి కార్మికులు సమ్మెలో పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు తమ వ్యతిరేకతను స్పష్టంగా చాటారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, పోస్టల్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌, ఇన్సూరెన్సు, బ్యాంకింగ్‌ ఉద్యోగులు, ఓడరేవులు, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోనూ, బొగ్గు గనుల్లోనూ, రక్షణరంగ పరిశ్రమల్లోనూ పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులు అత్యధిక శాతం సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ రవాణా కార్మికులతో పాటు ప్రయివేటు రంగ రవాణా కార్మికులు కూడా కలిసి దేశవ్యాప్తంగా సమ్మెచేయడంతో రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. సమ్మెకు రెండు రోజుల ముందు నుంచే ''బిఎంఎస్‌ సమ్మెను విరమించిందని, అనేక సంఘాలు సమ్మెకు దూరంగా ఉన్నాయని, సమ్మె నామమాత్రమేనని'' కేంద్ర ప్రభుత్వం అదేపనిగా గోబెల్స్‌ ప్రచారం చేసింది. అయినప్పటికీ 15 కోట్ల మందికి పైగా ఉద్యోగ, కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ ఐక్యంగా సమ్మె చేయడం కార్మికవర్గ చరిత్రలోనే ఒక అపూర్వ విషయం.

రాష్ట్రంలో కూడా సంఘటిత రంగ పరిశ్రమలలో పనిచేస్తున్నవారే కాకుండా భవన నిర్మాణం, ముఠా జట్లు, లారీ, ఆటో, మున్సిపల్‌, తదితర సేవా రంగాల కార్మికులు హాకర్లు, అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన, తదితర స్కీం వర్కర్లు పారిశ్రామిక సముదాయాల్లోని (క్లస్టర్స్‌) కార్మికులు పెద్ద సంఖ్యలో సమ్మె చేశారు. యూనియన్లు లేకున్నా అనేకచోట్ల కార్మికులే స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనడం ఈ సమ్మె ప్రత్యేకత. మన రాష్ట్రంలోనే సుమారు 15 లక్షలమంది కార్మికులు సమ్మె చేశారు. వీరికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అన్ని పట్టణాల్లో సామూహిక ధర్నాలు చేపట్టడం, ఉద్యోగ, కార్మిక ఐక్యతకు గొప్ప నిదర్శనం. యువకులు, విద్యార్థులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళా సంఘాలు అనేక చోట్ల ఈ సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా ఆందోళనలో పాల్గొనడం ''రాబోయే భారత దేశాన్ని తామందరం కలిసి నిర్మించుకుంటామనే'' సమిష్టి భావనకు గొప్ప సందేశంగా మనం భావించవచ్చు. సమ్మె చేయడం వరకే కాక మూడు లక్షలమంది కార్మికులు మన రాష్ట్రంలోని పట్టణాలు, మండల కేంద్రాలలో ప్రదర్శనలు జరపడం ఈ సమ్మెలో మరో ప్రత్యేకత.

ఇంత తక్కువ కాలంలో ఎందుకంత వ్యతిరేకత?

కాంగ్రెస్‌ అవలంబించిన ఆర్థిక విధానాలు ప్రజలకు మంచి చేయకపోగా అన్ని విధాలా నష్ట చేశాయి. అవినీతి కుంభకోణాలతో ప్రజలు విసిగి ఉన్న పరిస్థితుల్లో తమను గెలిపిస్తే ''మంచి రోజులు తెస్తామని, నల్లడబ్బును విదేశాల నుంచి రప్పించి ప్రజలకు పంచుతామని, సాలీనా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని'' బిజెపి చేసిన వాగ్దానాలు, కార్పొరేట్‌ మీడియా సాగించిన ప్రచారం ప్రజల్ని ప్రభావితం చేసి నరేంద్రమోడీని ప్రధానమంత్రిని చేశాయి. అయితే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి కేవలం 31 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయనే సంగతి మనం మరవరాదు. అంటే 69 శాతంమంది ప్రజలు నరేంద్రమోడీ ప్రధాని కావడానికి ప్రతికూలంగా ఉన్నారనే విషయం గమనించాలి. ఈ 18 మాసాల కాలంలో నరేంద్రమోడీ పాలన పట్ల ప్రజల్లోని భ్రమలు క్రమంగా తొలగిపోతున్నాయి. ఒక్కపైసా నల్లధనం రాలేదు. ఎక్కడా ఉద్యోగాల కల్పన జరగలేదు. ధరలు మండిపోవడం ఆరంభమైంది. ప్రజలపై పన్నుల భారం పెరిగింది. కార్పొరేట్‌ సంస్థలకు తప్ప దేశ ప్రజలకు మంచి రోజులు రావని తేలిపోయింది. కాంగ్రెస్‌ కంటే వేగంగా సంస్కరణలను అమలు చేస్తూ ప్రయివేటీకరణను ముందుకు తెచ్చి ప్రభుత్వరంగం విధ్వంసానికి అన్ని చర్యలూ తీసుకోవడం, విచ్చలవిడిగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అన్ని రంగాల్లో ఆహ్వానించడం, పెట్టుబడుల కొరకై స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులు, వారి సంస్థలు ఏం కోరితే అవి చేయడానికి ప్రభుత్వం సిద్ధపడడం నరేంద్రమోడీ పాలన ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఉద్యోగ, కార్మిక సంక్షేమం చూడడంగాక వారి హక్కులపై దాడిచేయడం, సంపదను సృష్టిస్తున్న కార్మికులను రెండవ తరగతి పౌరులుగా మార్చి బలవంతపు శ్రమదోపిడీ చేసేందుకు చట్టాల్లో మార్పులు తేవడం, అభివృద్ధి జపం చేస్తూ సమ్మెలను నిషేధించి కార్మిక సంఘాలను అణిచివేయాలనుకుంటున్న నరేంద్రమోడీ తీరు పట్ల ఉద్యోగ, కార్మికుల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతున్నది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కార్మిక చట్టాల్లో చేసిన సవరణలు బిజెపి అసలు రూపాన్ని బయట పెట్టాయి. సమ్మెలను నిరుత్సాహ పరుస్తామని, చట్టవిరుద్ధంగా సమ్మెచేస్తే వారిపై భారీ జరిమానా విధిస్తామని కార్మికశాఖ మంత్రి మాటిమాటికీ బహిరంగంగా ప్రకటిస్తూ ఉండడంతో సమ్మె హక్కును కాపాడుకోవడానికై సెప్టెంబర్‌ 2 సమ్మె చేయకతప్పదనే పట్టుదలను కార్మికుల్లో పెంచాయి.

చంద్రబాబూ అభివృద్ధిలో కార్మికులకు వాటా ఉన్నదా?

రాష్ట్రంలో చంద్రబాబు మార్క్‌ అభివృద్ధి తమకు ఒరగబెట్టేదేమీ లేదని కార్మికులకు స్పష్టమైంది. యానిమేటర్లు, అంగన్‌వాడీలు, విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులు, ఆర్టీసీ కార్మికుల సమ్మెలను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయోగించిన నిర్బంధకాండ కార్మికుల్లో చంద్రబాబు పట్ల ఉన్న భ్రమల్ని పటాపంచలు చేసింది. ప్రభుత్వం పూర్తిగా యజమానుల పక్షమే తప్ప కార్మికులకు ఏ సహాయం చేయదని అనుభవంలో కార్మికులు తెలుసుకున్నారు. చీమకుర్తి గ్రానైట్‌ కార్మికుల సమ్మె, అరబిందో లాబ్స్‌ కార్మికుల పోరాటం, హిందూపూర్‌ స్పిన్నింగ్‌ మిల్స్‌ కార్మికుల ఆందోళన, ల్యాంకో పరిశ్రమలో కార్మికుల అణిచివేత ఇలా ఏ విషయంలో చూసినా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు వ్యవహరించిన తీరు చంద్రబాబు ప్రభుత్వం తమకు పూర్తిగా వ్యతిరేకమనే భావనను కార్మికుల మనస్సుల్లో నాటుకునేలా చేసింది. ఇంటింటికీ ఉద్యోగం కాదు, ఇంట్లోనివారందరి ఉద్యోగాలకు ప్రమాదం వచ్చిందనిపించేలా రెండు వేల మంది ఫీల్డ్‌ అసిస్టెంట్ల సామూహిక తొలగింపు, వేలాది హౌసింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్ల అకారణ తొలగింపు, కార్మికుల్లో భయభ్రాంతులను కల్పించాయి. మార్చి నెలలో అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ప్రభుత్వం కార్మిక చట్టాలకు చేసిన సవరణలు బాబుగారి నిజస్వరూపాన్ని బట్టబయలు చేశాయి. చంద్రబాబు మారాను, మారాను అన్నారు కానీ ఏమాత్రం మారలేదు అని కార్మికులు బలంగా నమ్మేలా 18 మాసాల పాలన ఉన్నది. ''మారని జీతగాడు మరింత మోస గాడు'' అని కార్మికులు నినాదాలు చేస్తున్నారంటే కార్మికుల్లో ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను అర్థం చేసుకోవచ్చు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పృహలోకి వస్తాయా?

నరేంద్రమోడీ, చంద్రబాబు ప్రభుత్వాలు చాలా స్పష్టంగా స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు ఊడిగం చేసేలా వ్యవహరిస్తున్నాయి. ఓట్లేసిన ప్రజల కంటే నోట్లు పెట్టుబడిగా పెట్టి గెలిపించిన కార్పొరేట్‌ వర్గాల సేవే తమకు ముఖ్యమని భావిస్తున్నాయి. అందుకే కేంద్రంలో ఆర్డినెన్సులపై ఆర్డినెన్సులు జారీ చేస్తూ బలవంతపు భూ సేకరణ చేసేందుకు ప్రయత్నాలు చేయడం, రాష్ట్రంలో అభివృద్ధి పేరిట లక్షల ఎకరాలు రైతుల నుంచి బలవంతంగా లాక్కొని పెట్టుబడిదారుల సేవలో తరించాలని ప్రయత్నించడం చూస్తూనే ఉన్నాం. దేశంలో వనరులన్నింటినీ కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి. ప్రభుత్వ రంగ పారిశ్రామిక సంస్థలే కాక దేశానికి వెన్నెముకలాగా పనిచేస్తున్న ఆర్థిక సంస్థలను కూడా విధ్వంసం చేసేందుకు చర్యలు తీసుకోబడుతున్నాయి. ''ప్రభుత్వ రంగం పుట్టిందే చావడానికి'' అని స్వయంగా నరేంద్ర మోడీ ప్రకటించడం ఈ ప్రభుత్వ దారి ఎటువైపు సాగుతున్నదో స్పష్టమవుతున్నది.

రాష్ట్రంలో పెట్టుబడిదారులకు తప్ప సామాన్య ప్రజలకు ఏ హక్కులూ ఉండవనే విధంగా రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగుతున్నది. పారిశ్రామిక రంగమే కాక విద్య, వైద్య రంగాలను కూడా పెట్టుబడిదారులకు అప్పజెప్పేందుకు ప్రభుత్వం పావులు కదుపుతున్నది. రేషన్‌లైజేషన్‌ పేరిట రాష్ట్రంలో వందల స్కూళ్ళు మూతబడ్డాయి. టీచర్లు మిగులుగా ఉన్నారు కాబట్టి డిఎస్సీ అవసరం లేదని ప్రభుత్వ ప్రతినిధులు నిస్సిగ్గుగా చెబుతున్నారు. ఒక్క పోలీసు ఉద్యోగాలు తప్ప మిగతా ఉద్యోగాలన్నీ ప్రయివేటు రంగంలోనే ఉంటాయంటూ సుభాషితాలు చెబుతున్నారు. కార్మికవర్గం ఈ విధానాలకు తమ వ్యతిరేకతను చాలా స్పష్టంగా ప్రకటించింది. అపూర్వమైన ఐక్యతతో 15 కోట్ల మంది సమ్మెచేసి తమ మనోభావాలను నిర్ద్వంద్వంగా ప్రకటించారు. లక్షలమంది వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ విధానాల పట్ల తమ తీవ్ర వ్యతిరేకతను చాటారు. ఇప్పటికైనా కార్పొరేట్‌ శక్తుల భ్రమల్లో నుంచి మోడీ, బాబు బయటపడతారా, లేదా అన్నది కాలమే తేల్చాలి. ఏ సరళీకృత ఆర్థిక విధానాల వల్ల కాంగ్రెస్‌ ప్రజలకు దూరమైందో, ఏ ఆర్థిక విధానాలు సమాజంలో నిరుద్యోగాన్ని పెంచాయో, అవినీతి, అక్రమాలకు పునాదిగా ఉన్నాయో అవే ఆర్థిక విధానాలతో మోడీ, బాబు పాలన సాగితే ఉద్యోగులు, కార్మికులు, రైతాంగం, మిగతా ప్రజానీకం వీరి విధానాలను ఏమాత్రం అంగీకరించరు. ప్రతిఘటించి పోరాడతారు. ప్రజాపోరుకు జంకి వీరు విధానాలు మార్చుకుంటారో, లేదో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వీరు తమ విధానాలు మార్చుకోకపోతే అధికారం నుంచి వీరినే మార్చడానికి సిద్ధపడడం తప్ప వేరే మార్గం ప్రజలకు లేదు. అటువంటి లక్ష్యంతో ప్రజా పోరాటాలు మరింత సమరశీలంగా ముందుకు సాగేందుకు పరిస్థితులు దోహదం చేస్తున్నాయి. సెప్టెంబర్‌ 2 సమ్మె అటువంటి పోరాటాలకు మార్గదర్శిగా మనం భావించవచ్చు.

<span 'times="" new="" roman';="" font-size:="" medium;\"="">యంఎ గఫూర్‌
(వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)