చాప కింద నీరులా నియంతృత్వం..

        పాలక పార్టీ బిజెపిని నడిపించేది, నియంత్రించేది ఆర్‌ఎస్‌ఎస్‌. దీనితో ప్రభుత్వ సంస్థలలోకి దాని కార్యక్రమం, దాని కార్యకర్తలు ప్రవేశించటానికి మార్గం సుగమం అయింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామిక నియమాలకు తూట్లుపొడిచే అర్ధ ఫాసిస్టు భావజాలం, లక్ష్యాలు గల ఒక సంస్థకు దీనితో ఒక అవకాశం వచ్చింది. ప్రభుత్వ ప్రాపకం గల హిందూత్వ సంస్థలు అల్పసంఖ్యాక వర్గ ప్రజల మౌలిక హక్కులకు భంగం కలిగిస్తూ తమ విలువల్ని వారిపై రుద్దే పనిని జంకూగొంకూ లేకుండా చేస్తున్నాయి. ఆ విధంగా సామాజిక, సాంస్కృతిక క్షేత్రాలలోకి నియంతృత్వ ప్రవేశం రోజురోజుకూ పెరుగుతూ ఉన్నది.

        ఈ రోజు జూన్‌ 25. 19 నెలలపాటు కొనసాగిన అంతర్గత అత్యవసర పరిస్థితి విధించబడి నేటికి 40 సంవత్సరాలు. అత్యవసర పరిస్థితిని విధించటం స్వతంత్ర భారతావని చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. 1971లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచిన ఇందిరాగాంధీ గుజరాత్‌లో వచ్చిన నవ నిర్మాణ్‌ ఉద్యమం, జయప్రకాశ్‌ నారాయణ నేతృత్వంలో సాగిన ఉద్యమం వంటి ఉద్యమాల రూపంలో ప్రజాగ్రహాన్ని చవిచూశారు. ఇదే కాలంలో 17 లక్షలమంది శ్రామికులు పాల్గొన్న చరిత్రలోనే అత్యంత పెద్ద రైల్వే సమ్మె 1974 మే నెలలో జరిగింది. అలా పెరుగుతున్న వ్యతిరేకతను ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణచివేసే ప్రయత్నం చేసింది. అప్పటికే పశ్చిమ బెంగాల్‌లో సిపిఎంపైనా, ఇతర వామపక్ష పార్టీలపైనా సాగించిన అర్ధ ఫాసిస్టు హింసాకాండ ఇందిరా గాంధీ 'ప్రగతిశీల పరదా'ను తొలగించి, దాని నిజస్వరూపాన్ని బట్టబయలు చేసింది.

       జెపి ఉద్యమం రూపంలో పెరుగుతున్న ప్రజా ప్రతిఘటన, లోక్‌సభకు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్‌ హైకోర్టు తీర్పు చెప్పటం వంటివి అత్యవసర పరిస్థితిని విధించటానికి తక్షణ కారణాలుగా చెప్పుకోవచ్చు. అన్ని వైపుల నుంచీ ముట్టడికి గురయ్యాననే భావనతో అత్యవసర పరిస్థితిని విధించటం ద్వారా ప్రతి దాడి చెయ్యాలని ఇందిరా గాంధీ నిర్ణయించారు. అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న కాలంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు వేలాదిగా నిర్బంధానికి గురయ్యారు. ముందస్తు నిర్బంధాలు, పౌర హక్కులు లేకుండాపోవటం, పత్రికలను సెన్సార్‌ చెయ్యటం, అన్ని రకాల ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను నిషేధించటం లాంటి అప్రజాస్వామిక చర్యలను ఆనాటి ప్రభుత్వం చేపట్టింది. వందలాది మంది సిపిఎం నాయకులు, కార్యకర్తలు అంతర్గత భద్రతా చట్టం (మీసా) కింద అరెస్టయ్యారు.

       ఇందిరాగాంధీ ప్రధానిగా కొనసాగటానికి ప్రమాదం ఏర్పడటం అత్యవసర పరిస్థితిని విధించటానికి తక్షణ కారణమయినప్పటికీ అదొక్కటే అసలు కారణమనుకుంటే పొరపాటవుతుంది. అంతకు ముందే ప్రస్ఫుటమయిన నియంతృత్వ పోకడలు అత్యవసర పరిస్థితిని విధించటంతో పరాకాష్టకు చేరుకున్నాయి. దాని మూలాలు రాజకీయ, ఆర్థిక వ్యవస్థల సంక్షోభంలోనూ, పాలక పార్టీ ఎదుర్కొన్న సవాళ్ళలోనూ ఉన్నాయి. 1967లో జరిగిన సాధారణ ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఏక పార్టీ ఆధిపత్యం క్షీణించటం ప్రారంభమవటంతో రాజకీయ అస్థిరత పెరగటం మొదలయింది. ఇవన్నీ బూర్జువా ప్రజాస్వామ్యంపై దాడికి దారితీశాయి. 1972లో జరిగిన 9వ పార్టీ అఖిల భారత మహాసభలో ఏక పార్టీ నియంతృత్వ ప్రమాదాన్ని గురించి హెచ్చరించిన మొట్టమొదటి పార్టీ సిపిఎం. అత్యవసర పరిస్థితిని విధించటం ద్వారా ఈ తీవ్రతరమౌతున్న సంక్షోభాన్ని పరిష్కరించదలచి మరింత నియంతృత్వ రాజ్యాంగ పాలనకు తెరతీయటం జరిగింది. అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న కాలంలో పార్లమెంటు 42వ రాజ్యాంగ సవరణను ఆమోదించి కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పార్లమెంటుల మధ్యగల సమతౌల్యాన్ని మార్చాలనుకున్నది. ఉదాహరణకు రాజ్యాంగంలో చొప్పించ బడిన ఒక ఏర్పాటు ప్రకారం పార్లమెంటుచే ఆమోదింపబడిన ఏ రాజ్యాంగ సవరణనైనా న్యాయవ్యవస్థ సమీక్షించజాలదు. ఆ విధంగా రాజకీయ వ్యవస్థలోకి నియంతృత్వ లక్షణాలను ప్రవేశ పెట్టే ప్రయత్నాలు విఫలమయ్యాయి. అత్యవసర పరిస్థితిని, ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిని ప్రజలు తిరస్కరించటమే దానికి కారణం. పౌరహక్కులు రద్దుకావటం, నిర్బంధ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, పేదల ఇళ్ళను పెద్ద సంఖ్యలో కూలగొట్టటం, లెక్కలేకుండా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటం వంటివి అత్యవసర పరిస్థితి కాలంలో జరిగాయి. గెలుస్తాననే నమ్మకంతో అత్యవసర పరిస్థితిని ఎత్తివేసి తన నియంతృత్వ పాలనను సమర్థించుకోవటానికి 1977 మార్చి నెలలో సాధారణ ఎన్నికలను ఇందిరాగాంధీ ప్రకటించారు. కానీ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని, ఆమెను చిత్తుగా ఓడించారు.

        అత్యవసర పరిస్థితి వార్షికం సందర్భంగా భారతదేశంలో అలాంటి పరిస్థితి తిరిగి వచ్చే అవకాశమున్నదా అనే విషయం గురించి ఒక చర్చ జరుగుతోంది. ఈ ప్రశ్నను అడుగుతున్న తీరు సరిగాలేదు. పరిశీలించవలసినదేమంటే రాజకీయ వ్యవస్థను నియంతృత్వం మరోసారి ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉన్నదా అనేది. అత్యవసర అధికారాలను ఉపయోగించి నియంతృత్వ పాలనను ప్రవేశపెట్టటం మరోసారి సాధ్యంకాక పోవచ్చు. అయితే ప్రజాస్వామిక వ్యవస్థకు ఇతర రూపాలలో ఉన్న నియంతృత్వంతో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నది. నాలుగు దశాబ్దాల క్రితం అత్యవసర పరిస్థితిని విధించటానికి కారణాలైన రాజకీయ వ్యవస్థలో సంక్షోభం, అస్థిరతకు సంబంధించిన సమస్యలు, ఆర్థిక అసంతృప్తి వంటివి నేడు కూడా ఉన్నాయి. నియంతృత్వ పాలన విధించటానికి కావలసినవన్నీ వీటి రూపంలో ఉన్నాయి. నయా ఉదారవాద విధానాల పర్యవసానాలు, పేట్రేగుతున్న హిందూ మతతత్వ శక్తులు, రాజకీయ పార్టీల దివాళాకోరుతనం, రాజ్య సంస్థల క్షీణత వంటివన్నీ కలిసి చాప కింద నీరులాగా ప్రవేశిస్తున్న నియంతృత్వానికి ముందు సూచనలుగా ఉన్నాయి. 1978 ఏప్రిల్‌ మాసంలో జరిగిన సిపిఎం జలంధర్‌ మహాసభ చేసిన హెచ్చరికను గుర్తుచేసుకోవటం సముచితంగా ఉంటుంది. బడా బూర్జువా, భూస్వామ్య వర్గాల ఆధిపత్యం ఆర్థిక వ్యవస్థపైన, రాజ్యతంత్రంపైన ఉన్నంత కాలం నియంతృత్వ ప్రమాదం పొంచి ఉంటుందని, తమ వర్గ పాలనను సుస్థిరం చేసుకోవటానికి ఏదో ఒక రాజకీయ కూటమి నియంతృత్వాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటుందని ఆ మహాసభలో సిపిఎం హెచ్చరించింది. ఉత్పత్తికి సంబంధించిన విస్తృత విభాగాలనే కాకుండా విద్య, ఆరోగ్యం వంటి మౌలిక సేవలను కూడా మార్కెట్‌ శక్తులకు, బడా వ్యాపారానికి నయా ఉదారవాదం స్వాధీనం చేసింది. దీనితో గతంలో ఎన్నడూలేని స్థాయిలో పౌరుల మౌలిక హక్కులను భంగపరచి, ప్రజాస్వామ్యాన్ని కుచింపజేసే అసమానత, అవినీతి పెరగటానికి దారితీసింది. ప్రజల కంటే, వారి హక్కుల కంటే మార్కెట్‌నే ప్రధానమైనదిగా భావిస్తూ ప్రజాస్వామ్యాన్ని నయా ఉదారవాదం పరిమితం చేస్తున్నది.

         బడా పెట్టుబడి రాజకీయ వ్యవస్థను ఆక్రమించింది. బడా పెట్టుబడి అందించే డబ్బు సంచులకు బూర్జువా రాజకీయ పార్టీలన్నీ దాసోహమంటున్నాయి. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని క్షీణింపజేస్తున్నది. పాలక పార్టీ బిజెపిని నడిపించేది, నియంత్రించేది ఆర్‌ఎస్‌ఎస్‌. దీనితో ప్రభుత్వ సంస్థలలోకి దాని కార్యక్రమం, దాని కార్యకర్తలు ప్రవేశించటానికి మార్గం సుగమం అయింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామిక నియమాలకు తూట్లుపొడిచే అర్ధ ఫాసిస్టు భావజాలం, లక్ష్యాలు గల ఒక సంస్థకు దీనితో ఒక అవకాశం వచ్చింది. ప్రభుత్వ ప్రాపకం గల హిందూత్వ సంస్థలు అల్పసంఖ్యాక వర్గ ప్రజల మౌలిక హక్కులకు భంగం కలిగిస్తూ తమ విలువల్ని వారిపై రుద్దే పనిని జంకూగొంకూ లేకుండా చేస్తున్నాయి. ఆ విధంగా సామాజిక, సాంస్కృతిక క్షేత్రాలలోకి నియంతృత్వ ప్రవేశం రోజురోజుకూ పెరుగుతూ ఉన్నది. నయా ఉదారవాద మార్కెట్‌ మౌఢ్యం, హిందూత్వల ఈ కలబోత నియంతృత్వాన్ని ప్రమాదకరంగా వండివార్చేవిగా ఉన్నాయి. ఒకవైపు శ్రామిక చట్టాలను మార్చి కార్మిక సంఘాలను బలహీనపరుస్తూ, మరోవైపు భూ సేకరణ చట్టంలో తెస్తున్న మార్పులవలె పార్లమెంటు ప్రమేయంలేకుండా ఆర్డినెన్స్‌లను జారీచేస్తూ ప్రభుత్వం మార్కెట్‌ అనుకూల చట్టాలను తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. బిజెపికి స్వంతంత్రంగా మెజారిటీ ఉండటంతో పార్లమెంటును మోడీ ప్రభుత్వం చులకన భావంతో చూస్తున్నది. అది రోజురోజుకూ పెరుగుతూ ఉన్నది. నయా ఉదారవాదంలో ప్రజాస్వామ్యం పరిమితమవటానికి, ప్రజలెన్నుకున్న సంస్థల పరిధిలో నుంచి ప్రధాన నిర్ణయాధికారాలను లాక్కునేందుకు నడుస్తున్న ప్రక్రియలో ఆర్డినెన్స్‌ల వెల్లువ, రాజ్యసభను కించపరిచే ప్రయత్నం, ప్రధాని చేతుల్లో అన్ని అధికారాలూ కేంద్రీకృతమవ్వటం వంటి విషయాలు భాగమే. కాబట్టి, ఒక నియంతృత్వ క్రమం చాపకింద నీరులా చేరుకునే పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం. నయా ఉదార వాదం, హిందూత్వ మతతత్వం, నియంతృత్వం-ఈ మూడింటి పైనా బహుముఖ పోరాటం చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. ఇవన్నీ మౌలికంగా జతయివున్నాయి. నాలుగు దశాబ్దాల క్రితం నాటి అత్యవసర పరిస్థితి అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు ఈ వర్తమాన పోరాటంలో మనకు ఉపయోగపడతాయి.

--- ప్రకాశ్‌ కరత్‌