చర్చలు తప్ప మరో మార్గం లేదు..

భారత్‌, పాకిస్తాన్‌ జాతీయ సలహాదారు స్థాయీ (ఎన్‌ఎస్‌ఎ) చర్చలు చివరి నిమిషంలో రద్దు కావడం బాధాకరం. ఇరు దేశాల్లోనూ శాంతికి విఘాతం కలిగించాలని కోరుకునే ఛాందసవాద శక్తులకు ఇది ఊతమిస్తోంది. నవంబరు 26 ముంబయి దాడుల తరువాత ప్రతిష్టంభనలోపడిన ద్వైపాక్షిక చర్చలను పునరుద్ధరించేందుకు జరిగిన మరో ప్రయత్నం ఇలా ఆగిపోవడం శోచనీయం. ఈ పరిణామం ఇరుదేశాల్లోని చర్చల ప్రక్రియను వ్యతిరేకించే శక్తులకు సంతోషం కలిగించవచ్చు, కానీ, ఈ ఉపఖండంలో కమ్ముకున్న అనిశ్చితిని తొలగించాలని కోరుకునేవారికి ఇది ఒక విచారకరమైన అంశం. ఆరు వారాల క్రితం షాంఘై కూటమి సమావేశాల సందర్భంగా రష్యాలోని ఉఫాలో భారత్‌, పాకిస్తాన్‌ ప్రధానులిరువురూ కూర్చొని ఉపఖండంలో శాంతి, సామరస్యాలను నెలకొల్పేందుకు చర్చల ప్రక్రియ చేపట్టాలని, ఇందుకు సంబంధించి ఒక మార్గదర్శక ప్రణాళిక (రోడ్‌మ్యాప్‌ )ను రూపొందించాలని నిర్ణయించారు. మొదటగా జాతీయ సలహాదారు స్థాయీ చర్చలు, ఆ తరువాత ఇరు దేశాల సరిహద్దు భద్రతా దళాల డైరక్టర్‌ జనరల్స్‌ భేటీ, సైనిక కమాండర్ల భేటీ, అటుపిమ్మట సెప్టెంబరులో ఐరాస సమావేశాల సందర్భంగా ఇరువురు ప్రధానుల భేటీ కావాల్సి వుంది. ఆదిలోనే హంసపాదు ఎదురవడంతో మిగతా చర్చల ప్రక్రియపై అనిశ్చితి నెలకొంది. ఈ రెండు అణ్వస్త్ర దేశాలు దృఢ సంకల్పంతో చర్చల ప్రక్రియతో ముందుకు సాగితే సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడం అసాధ్యమేమీ కాదు. ఆ సంకల్పమే కొరవడింది. ఢిల్లీ చర్చలకు ముందుగానే హురియత్‌ నేతలను గృహ నిర్బంధంలో వుంచడం, పరస్పర ప్రకటనలు, పత్రికా గోష్టులతో వాతావరణాన్ని కలుషితం చేశారు. చాలా ఏళ్ల తరువాత ద్వైపాక్షిక చర్చలకు లభించిన ఒక చక్కటి అవకాశాన్ని చేతులారా జారవిడుచుకున్నారు.

తాము చెప్పిందే వినాలి అన్న మంకుపట్టు ధోరణితో చర్చల ప్రక్రియకు తూట్లు పొడిచారు. హురియత్‌, కాశ్మీర్‌ అంశాలను ముందుకు తీసుకొచ్చి చర్చలే జరగకుండా చేయడం ఎంతమాత్రమూ సమర్థనీయం కాదు. హురియత్‌ నేతలను పాకిస్తాన్‌ నేతలను కలవకూడదంటూ విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్‌ గట్టిగా పట్టుబట్టడం ద్వారా దౌత్యంలో చూపాల్సిన కనీస సంయమనాన్ని పాటించలేకపోయారు. పాకిస్తాన్‌ నేతలు హురియత్‌ నేతలను చర్చలకు ముందు కానీ, తరువాత కానీ కలుసుకోవడం ఇంతకుముందు జరిగింది. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకొచ్చింది. చర్చలకు ఆటంకంగా నిలిచిన మరో అంశం కాశ్మీర్‌ సమస్య. ఉగ్రవాదం తప్ప మరే అంశమూ చర్చల్లో ప్రస్తావించరాదని భారత్‌ వాదించగా, కాశ్మీర్‌ లేని చర్చలు వ్యర్థమని పాకిస్తాన్‌ వాదించింది. ద్వైపాక్షిక చర్చలు అన్నప్పుడు కాశ్మీర్‌తో సహా అన్ని అంశాలపైనా చర్చించాలి. భారత్‌, పాక్‌ ప్రధానులిరువురూ ఉఫాలోనే ఈ చర్చల అజెండా కూడా నిర్ణయిస్తే సరిపోయేది. అప్పుడు చర్చల అజెండాలో ఈ షరతు పెట్టకుండా ఇప్పుడీ అంశాన్ని ముందుకు తేవడంలో ఔచిత్యమేమిటి? ఈ కారణంగా చర్చలు ఆగిపోయే పరిస్థితిని రావడం మంచిదా? ఈ విషయంలో జాగరూకతతో వ్యవహరించడంలో ఇరు పక్షాలు విఫలమయ్యాయి.

తప్పుడు కారణాలపై చర్చల ప్రక్రియ ఆగిపోవడం ఎవరికీ మంచిది కాదు. ఇది ఇరువైపులా మత ఛాందసవాద శక్తులు బలపడడానికి తప్ప మరి దేనికీ ఉపయోగపడదు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల వల్ల ఎక్కువగా నష్టపోతున్నది కాశ్మీరీయులే. యుద్ధోన్మాదం పెరగడం వల్ల జరిగే నష్టం అంతా ఇంతాకాదు. ఈ విషయాన్ని రెండు దేశాలూ గుర్తించాలి. ద్వైపాక్షిక సమస్యల పరిష్కారానికి చర్చలు తప్ప మరో మార్గం లేదు. వచ్చే నెలలో న్యూయార్క్‌లో మోడీ, నవాజ్‌ షరీఫ్‌ల భేటీకి అవసరమైన ప్రాతిపదికను కల్పించేందుకు ఎన్‌ఎస్‌ఎ చర్చలను వెంటనే చేపట్టాలి. చర్చల ప్రక్రియ నిలకడగా, నిర్మాణాత్మకంగా సాగేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలి. మత ఛాందసవాద శక్తుల ఒత్తిళ్లకు ఎంతమాత్రమూ తలొగ్గకుండా ఈ ఉపఖండంలో శాంతి సామరస్యాలను నెలకొల్పడమే ధ్యేయంగా ముందుకు సాగాలి.