చంద్రబాబు కీలక నిర్ణయం

మార్కెట్‌ కమిటీల ఆదాయానికి, ఉద్యోగుల రిటైర్మెంట్‌కు ముడిపెడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఆదాయం బాగా ఉన్న మార్కెట్‌ కమిటీల్లో పనిచేసే ఉద్యోగులకు 60 ఏళ్లకు, ఆదాయం లేని కమిటీల్లో పనిచేసే ఉద్యోగులకు 58 ఏళ్లకు రిటర్మెంట్‌ ఉండేలా ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై జీవో జారీ చేసే సమయానికి ఈ నిర్ణయంపై వివాదం నెలకొంది. ఉంటే 58 ఏళ్లు ఉండాలి లేదా 60 ఏళ్లు ఉండాలి తప్ప మార్కెట్‌ కమిటీల ఆదాయాన్ని బట్టి రిటైర్మెంట్‌ వయసు నిర్ణయించడం సాధ్యం కాదని న్యాయశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఫైలు పునఃపరిశీలన కోసం సీఎం వద్దకు వెళ్లనుంది. మార్కెట్‌ కమిటీ ఉద్యోగులు దేనికి దానికి విడివిడిగా నియమితులు కారు. ఒక కమిటీ నుంచి మరో కమిటీకి బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకుని రిటైర్మెంట్‌ వయోపరిమితిని నిర్ణయించడం సబబుకాదని న్యాయశాఖ తన అభిప్రాయం చెప్పినట్లు తెలిసింది.