గ‌తి త‌ప్పిన ప్ర‌జారోగ్యం..

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాంటే ప్రజలు ఆరోగ్యంగా వుండాలి. ప్రజలు రోగాలు, అనారోగ్యంతో అల్లాడుతుంటే ఆ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందడం అసాధ్యం. మన దేశంలో కేరళలో ప్రజలు విద్యా, ఆరోగ్యంలో అగ్రభాగాన వున్నారు. అందరికీ ఆరోగ్యం అనే సూత్రాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వాదే. అయినా ప్రభుత్వాలు ఆరోగ్యం పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గురజాడ అప్పారావు గారు చెప్పినట్లు
    దేశమంటే మట్టికాదోయ్‌
    దేశమంటే మనుజులోయ్‌
    తిండికలిగితే కండ కల‌దోయ్‌
    కండ కల‌వాడేను మనుషోయ్‌
    ఈసురోమని మనుషుంటే
    దేశమేగతి బాగుపడునోయ్‌
సమాజంలో ఆరోగ్యంగా వుండడం అన్నిటికంటే ప్రధమం. ఆరోగ్యం తర్వాతే మిగిలినవన్నీ. రోగాలు వచ్చిన తరువాత ఖరీదైన వైద్యం ఎలా అందించగల‌రో గొప్ప ప్రచారం చేసుకుంటున్నారు. వాధ్యులు రాకుండా అరికట్టే మార్గాల‌ గురించి మాట్లాడడం లేదు. ఆరోగ్య ప్రాథమిక సూత్రాలైన మంచినీరు, మరుగుదొడ్లు, పౌష్టికాహారలోపా వల్ల‌ మరణించే వారు మన రాష్ట్రంలోను, దేశంలోను అధికంగా వున్నారు.