
ఆర్థిక సంస్థల షరతులకు 'నో' చెప్పిన గ్రీస్ తాజా పరిస్థితిపై చర్చించేందుకు యూరో జోన్ దేశాల నేతలు మంగళవారం ఇక్కడ అత్యవసర భేటీ నిర్వహించారు. రిఫరెండం ఫలితాలతో బలం పుంజుకున్న గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ ఆర్థిక సంస్థలతో చర్చలకు కొత్త ప్రతిపాదనలు తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. గత సోమవారం నుండి కొనసాగుతున్న బ్యాంకుల మూసివేతను గ్రీస్ ప్రభుత్వం గురువారం వరకూ పొడిగించటం, ఎటిఎంలలో నగదు నిల్వలు అడుగంటటం వంటి పరిస్థితుల నేపథ్యంలో బెయిలవుట్ చర్చల పునరుద్ధరణకు సిప్రాస్ నుండి తాజా ప్రతి పాదనలను ఆహ్వానించేందుకు సిద్ధమ య్యారు. యూరోజోన్‌లో కొనసాగేందుకు విశ్వసనీయమైన గట్టి ప్రతిపాదనలతో ముందుకు రావాల్సిన బాధ్యత గ్రీస్ ప్రధానిదేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలెండే స్పష్టం చేస్తున్నారు. గ్రీస్‌కు ఆర్థిక సహాయం అందించేందుకు కొత్త ప్యాకేజిపై షరతులను ఇంకా నిర్ణయించలేదని జర్మనీ ఛాన్సెలర్ మెర్కెల్ చెప్పారు. గ్రీస్ ప్రధాని నుండి తాజా ప్రతిపాదనల కోసం ఎదురు చూస్తున్నామనీ, వాటిని పరిశీలించిన అనంతరం గ్రీస్ ప్రగతికి అనువైన కార్యక్రమాన్ని ప్రకటిస్తామనీ వివరించారు. యూరోజోన్‌లోని అన్ని దేశాలు గ్రీస్‌కు ఇప్పటికీ సంఘీభావం తెలుపుతున్న అంశాన్ని ఆమె గుర్తు చేశారు. తాజా ప్రతిపాదనలు లేకుండా చర్చల కొనసాగింపు అర్థరహితమని ఐరోపా డిజిటల్ కమిషనర్ గంతర్ ఒట్టింజర్ అభిప్రాయపడ్డారు. తాము యూరోజోన్‌తో చర్చల కొనసాగింపునే కోరుకుంటున్నట్లు గ్రీస్ కొత్త ఆర్థిక మంత్రి యూక్లిడ్ సకలోటస్ చెప్పారు. రిఫరెండం ఫలితాలు వెలువడిన తరువాత ఆర్థిక మంత్రి పదవికి వరొఫాకిస్ రాజీనామా చేయటంతో ఆయన వారసుడిగా సకలోటస్ బాధ్య తలను స్వీకరించారు. గ్రీస్ విషయంలో కొంత కఠినంగా ఉండాల్సిందేనని యూరోజోన్ సభ్యదేశా లయిన జర్మనీ, ఫిన్లండ్, స్లోవేకియా, బాల్టిక్ ప్రాంత దేశాలు పట్టుపడుతుండగా ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ తదితర దేశాలు మాత్రం తాజాగా సాయం అందించి గ్రీస్‌ను గడ్డు పరిస్థితినుంచి గట్టెక్కించాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి. గ్రీస్ విషయంలో అన్ని దేశాలూ ఆలోచించి యూరోజోన్‌లో కొనసాగేలా చూడాలని, రుణభారం నుంచి బయటపడి ఆర్థిక ప్రగతి సాధించేలా ఆ దేశానికి సాయం అందించాలని అమెరికా యూరోజోన్ దేశాలకు సూచిస్తోంది.