గ్రామ‌కంఠాల స‌ర్వే‌పై ఆగ్రహం

ప్రభుత్వం చేసే మోసకారి పనులు ఇప్పుడిప్పుడే నూతన రాజధానిగా ప్రకటించిన అమరావతి 29 గ్రామాల్లో ప్రజలకు అర్థమవుతున్నాయి. తమ ప్రభుత్వం అని నమ్మి భూములిచ్చిన రైతులకు ప్రస్తుతం గ్రామకంఠాల విషయమై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో వారిలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. గ్రామాల్లో మంత్రులను మేళతాళాలతో ఊరేగించిన ప్రజలే ఇళ్లల్లో పెట్టి కదలడానికి వీల్లేదని నిర్బంధిస్తున్నారు. గ్రామకంఠాల విషయమై ఎటూ తేల్చకపోతే ప్రభుత్వ వ్యవహారాన్ని తేలుస్తామని తెగేసి చెబుతున్నారు. మొదట్లో రాజధాని నిర్మాణానికి భూములు తీసుకుంటామని, గ్రామాలను కదపబోమని, 2014 డిసెంబరులో శాటిలైట్‌ సర్వే నిర్వహించామని, దాని ప్రకారం బ్రిటీష్‌ కాలం నాటి గ్రామకంఠాలతో కలుపుకొని ఇప్పుడు విస్తరించిన గ్రామకంఠాల జోలికి తాము వెళ్లబోమని ప్రభుత్వ పెద్దలు ఆనాడు హామీనిచ్చారు. ప్రస్తుతం బ్రిటీష్‌కాలం నాటి గ్రామకంఠాలను వదిలిపెట్టి ఈ కాలంలో విస్తరించిన గ్రామాలను (ఇళ్లు) పూలింగ్‌లో తీసుకుంటామని సిఆర్‌డిఎ కార్యాలయాల్లో నోటీసు బోర్డు అంటించారు. ఆ మేరకు నెట్‌లో కూడా ఏ ప్రాంతాలు పూలింగ్‌లో తీసుకోబోతున్నామో కూడా కంప్యూటరీకరణ చేశారు. ఇది చూసిన రైతులు, ప్రజలు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు ఉండవల్లి గ్రామం 20 సంవత్సరాలు వెనక్కు వెళితే ప్రస్తుత ఉండవల్లి సెంటర్‌ మొదలుకొని అన్నీ పొలాలే. ఇప్పుడు నిర్మాణాలతో దేదీప్యమానంగా ఉంది. అనేక మంది ఇళ్లు, వ్యాపార సంస్థలు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం వీటిల్లో కొన్ని గ్రామకంఠాలు కాదని పూలింగ్‌లో తీసుకుంటామని నోటీసు బోర్డులో పెట్టారు. అలాగే రాజధాని పరిధిలో ఉన్న మరో గ్రామం పెనుమాక. ప్రస్తుతం ఉండవల్లి గుహల నుండి పెనుమాక గ్రామ మొదట్లో డాబాల సెంటర్‌ వరకు గతంలో ఇళ్లు ఉండేవి. ప్రస్తుతం ఈ ప్రాంతమంతా వందలాది మంది ఇళ్లు వేసుకొని ఉంటున్నారు. వీటిల్లో కొన్నిటిని ప్రభుత్వం పూలింగ్‌లో పెట్టింది. ఎవరి ఇల్లు ఉంటుందో, ఎవరిది ఉండదో తెలియని పరిస్థితి నెలకొంది. వీటితో పాటు గ్రామాల్లో పాడి పరిశ్రమ వృద్ధి చేసుకోవడానికి పశువుల చావిళ్లు, గేదెల వ్యర్థాలను పోగేయడానికి ఖాళీస్థలాలు ఉంచుకున్నారు. ఇప్పుడు వీటితో పాటు తమ బిడ్డలకు పసుపు కుంకాల కింద ఇచ్చిన 5 నుండి 10 సెంట్లు భూమి గల ప్లాట్లు కూడా పూలింగ్‌ కింద వచ్చేశాయి. దీంతో రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతులతో పాటు భూములు ఇచ్చిన వారు కూడా ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం భూములు సేకరించిన 29 గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నిర్మాణాలు ఉన్న అనేక ప్రాంతాలను ఆన్‌లైన్‌లో ఇళ్ళు లేనట్లు చూపిస్తుంది. శాటిలైట్‌ సర్వేనే తప్పులతడకగా ఉందని గ్రామాల్లోని ప్రజలు విమర్శిస్తున్నారు. ఒక్క ఉండవల్లి గ్రామంలోనే 500 ప్లాట్ల వరకు పూలింగ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. పాఠశాలలను కూడా వదిలిపెట్టకుండా పూలింగ్‌లో పెట్టడం పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం 663 ఎకరాల్లో గ్రామకంఠాలు ఉన్నట్లు తెలుస్తుంది. 1906లో బ్రిటీష్‌ వారు రూపొందించిన గ్రామకంఠాలను నిర్థేశించి ముందుకెళ్ళాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే మరో స్వాతంత్య్ర పోరాటం లాంటి పెద్ద ఉద్యమం నవ్యాంధ్ర రాజధానిలో వచ్చేందుకు అవకాశం ఉంది.