గ్రామకంఠాల సమస్యకు పరిష్కారం ఎపుడో..

గ్రామకంఠాల సమస్యలను వారంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి, మంత్రులు భావించినా నెల దాటిపోయింది. గత నెల 20వ తేదీన భూ సేకరణ ప్రకటన విడుదల చేశారు. వెంటనే వరసుగా గ్రామాల్లో సిఆర్‌డిఏకు అవసరమైన భూముల తుది జాబితాలను 9.5 ఫారం రూపంలో అధికారులు ప్రకటించారు. దీంతో ఒక్క సారిగా గ్రామాల్లో కలకలం చెలరేగింది. రైతులు సిఆర్‌డిఏ కార్యాలయాలను ముట్టడించారు. కొన్ని చోట్ల తాళాలు వేశారు. దీంతో ప్రభుత్వ పెద్దలు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించేందుకు శిక్షణలో ఉన్న జాయింట్‌ కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ను ఆఘమేఘాలపై పిలిపించారు. గత నెల 24 నుంచి ఈ సమస్యపై ఆయన దృష్టి సారించారు. దాదాపుగా అన్ని గ్రామాలను పరిశీలించారు. రైతులతో చర్చించారు. కొన్ని గ్రామాల్లో వారిని ఒప్పించారు. అయినా ఇప్పటికీ వారు సమర్పించిన అభ్యంతరాల దరఖాస్తులను పరిష్కరించడం ఇప్పటి వరకూ పూర్తి కాలేదు.ఇప్పటికీ 1200 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది. 29 గ్రామాల్లో 300 ఎకరాలకు సంబంధించి వివాదాలు పరిష్కరించాల్సి ఉందని తెలుస్తోంది. తుళ్లూరు, నెక్కల్లు గ్రామాల్లో వివాదాలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు.