గొట్టిపాడు దళితులకు న్యాయం చేయాలి..

దళితులపై దాడులకు నిరసనగా ఈనెల 23న చలో గుంటూరు నిర్వహిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెదగొట్టిపాడును మధు ఆధ్వర్యంలో సిపిఎం బృందం శుక్రవారం సాయంత్రం సందర్శించింది. డిసెంబరు 31, జనవరి ఒకటిన దళితులపై పెత్తందార్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. దాడికి గురైన దళితులను మధు పరామర్శించిన అనంతరం గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం చేకూరే వరకూ అండగా పోరాటం చేస్తామని ప్రకటించారు. గొట్టిపాడు ఘటనపై ఈనెల 23న రాష్ట్రంలోని దళితులందర్నీ సమీకరించి 'చలో గుంటూరు' నిర్వహిస్తామని ప్రకటించారు. గ్రామంలో దళిత వాడలో కనీస సౌకర్యాలు లేవని, వారు తీవ్ర వివక్షతకు గురవుతున్నారన్నారు. గొట్టిపాడులో దళితులపై దాడి చేయడమే కాకుండా పెత్తందార్లు వారి పొలాల్లోకి పనులకు పిలవకపోవడం చట్ట రీత్యా నేరమన్నారు. ఇది సాంఘిక బహిష్కరణ కిందకు వస్తుందన్నారు. గ్రామంలో దళితులకు పక్కా ఇళ్లు నిర్మించాలని, పింఛన్లు అందని వారికి వెంటనే పింఛన్లు ఇవ్వాలని, దాడుల వల్ల ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని, దాడిలో గాయపడిన వారి కుటుంబాలకు చెందిన వారికి రోజుకు ఎంత కూలి ఇస్తారో అంతేకూలి సొమ్మును వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.