నాటి ముఖ్యమంత్రి యన్‌టి రామారావు, ఎస్‌ఆర్ శంకరన్‌ల ఆధ్వర్యంలో 1983లో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతి కోసం ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేశారు. అవి సాధారణ హాస్టళ్ళ కంటే మెరుగైన విద్య, క్రమశిక్షణ వంటి విషయాల్లో మంచి ఫలితాలు సాధిస్తూ నడుస్తున్నాయి. 1987లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలను కలిపి ఎపిఎస్‌డబ్ల్యుఆర్‌ఇఐ సొసైటీ పేరుతో రాష్ట్ర సంస్థగా ఏర్పాటు చేశారు. కొన్ని సంవత్సరాలపాటు విద్యావేత్తల ఆధ్వర్యంలో ఇవి సజీవంగా నడిచాయి. ఆ తరువాత ఈ సంస్థ స్థాయి పెంచి ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను కార్యదర్శులుగా నియమించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, అధికారులు ఆలోచనలకు అనుగుణంగా ఈ సంస్థలను నడపడం వల్ల అవి దళిత విద్యార్థుల అభ్యున్నతికి ఉపయోగపడటంలేదు. ఉదాహరణకు డిఆర్ గార్గ్ ఆధ్వర్యంలో పాఠశాలలను కళాశాల స్థాయికి పెంచారు. కానీ అదనంగా ఒక్క టీచర్‌ను కూడా నియమించకుండా నడపటం విశేషం. కాంట్రాక్టు వ్యవస్థను ఈయనే ప్రవేశపెట్టారు. దీనివల్ల ఉద్యోగ భద్రత లేని కారణంగా డిఎస్‌సి పడినప్పుడల్లా కొంతమంది ఉపాధ్యాయులు వెళ్ళిపోయేవారు. సకాలంలో సిలబస్ పూర్తికాదు. అనుభవమున్నవారు మధ్యలో దొరకరు. పేద విద్యార్థులకు ఇది నష్టదాయకమైనది. ఇదే సమయంలో సెమిష్టర్ విధానం కూడా ప్రవేశపెట్టడం వల్ల కూడా నష్టం జరిగింది. దమయంతి కార్యదర్శిగా, రేమాన్ పీటర్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉన్న టైంటేబుల్‌ను ఉపాధ్యాయులకు అనుగుణంగా మార్చారు. రాష్ట్రంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఎపిఎస్‌టిబిసి, నవోదయ పాఠశాలలు అనుసరిస్తున్న ఈ టైంటేబుల్‌ను ఎందుకు మార్చారో ఎవరికీ అర్థంకాలేదు. దీనివల్ల స్టడీ సమయంలో ఎక్కువ మంది టీచర్లు అందుబాటులో లేకపోవడం వల్ల అనుమానాలు తీర్చేవారులేరు. ఉన్నవారికి వీరిని కాపలాకాసే పని సరిపోతుంది. దీనివల్ల నాణ్యమైన విద్య అందించడంలో వెనుకబడింది. తరువాత వచ్చిన ఐపిఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ చదువుల్ని వదిలేసి లెసన్‌ప్లాన్స్, యూనిట్‌ప్లాన్, డైరీ ప్లాన్, టీవీ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తే ఆ పాఠశాల బాగున్నట్లుగా పరిగణించారు. టీచర్స్ తరగతి గదిలో లేకపోయినా ఏదో ఒక పనిలో నిరంతరం బిజీగా ఉండేవారు. ఈ విధంగా ఎవరి ఆలోచనలు వారు బలహీనవర్గాల విద్యార్థులపై ప్రయోగించడం వల్ల పాఠశాలలను ఏర్పాటుచేసిన ఉద్దేశాలు దెబ్బతింటున్నాయి.
ఏ పాఠశాలలోనూ వసతులు లేవు. రక్షిత మంచినీరు లేదు. 400 మంది కోసం కట్టిన భవనంలో 700 మంది విద్యార్థులకు అనుమతిస్తున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి తగినంతమంది సిబ్బందిలేరు. టీచర్ల క నివాసగృహాలు శిధిలావ్యవస్థలో ఉన్నా మరమ్మతులతో సరిపెడుతున్నారు. దీనివల్ల ప్రిన్సిపాల్స్, కాంట్రాక్టర్లు బాగుపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, ఎస్‌సి సబ్‌ప్లాన్ నిధులు కేటాయిస్తున్నారు. ఆ నిధులు ఎటుపోతున్నాయో అర్థంకావడంలేదు. పాలకులకు దళితుల నిధుల మీద ఉన్న ప్రేమ దళితుల మీద లేదని అర్థమౌతోంది. ప్రతి పాఠశాలలో సుమారు 25 టీచర్ పోస్టులుంటాయి. కానీ ప్రతి స్కూల్‌లో సరాసరి 15 మంది టీచర్లు కూడా లేరు. మారుమూల ప్రాంతంలో అసలు లేరు. వీరి స్థానంలో పార్ట్‌టైమ్ వారిని తీసుకుంటారు. వీరితో మంచి ఫలితాలు ఎలా సాధించాలో అర్థంకాక ప్రిన్సిపాల్స్ చాలా ఇబ్బందులు పడుతుంటారు. అసలే ఉపాధ్యాయులు లేకపోతే వీటిలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన పూర్తి శిక్షణ లేదు. ఉపాధ్యాయులను నియమించకుండా, శిక్షణ లేకుండా, వసతులు లేకుండా ఎలా నడుపుతారు? రెండు సంవత్సరాలు పూర్తయినా ఉపాధ్యాయులు నియమించకుండా మంత్రి మాటలతో కాలయాపన చేస్తున్నారు. ప్రతి పాఠశాలలో రెగ్యులర్, కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. సొసైటీవారిచే రెగ్యులర్ ఉపాధ్యాయులకు మాత్రమే శిక్షణ అందుతుంది. కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులకు సిసిఇ విధానంపై ఎటువంటి అవగాహనాలేదు.
సుమారుగా ఐదు వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది రెగ్యులర్ ఉద్యోగులుగా ఈ సంస్థలో పనిచేస్తున్నారు. ప్రభుత్వ అధీనంలోని అన్ని శాఖలకూ ఉద్యోగ విరమణ వయస్సును 60 సంవత్సరాలుగా పెంచినా ఆ ఉత్తర్వులు వీరికి ఇంతవరకు అమలుకాలేదు. 2014 జూన్ 2 తరువాత విరమణ చేసిన 60 సంవత్సరాలు నిండని సిబ్బందిని సోదర సంస్థలైన ఎపిఆర్, ఎస్‌టి వెల్ఫేర్, బిసి వెల్ఫేర్ సంస్థలు ఉద్యోగులను తిరిగి నియిమించుకున్నాయి. కానీ ప్రభుత్వం 67 జీవో ద్వారా ఉత్తర్వులిచ్చినా రకరకాల అడ్డంకులు సృష్టించి పదవీవిరమణ చెందిన సిబ్బందిని తిరిగి సర్వీసులోకి తీసుకోలేదు. చివరకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా వాటిని కూడా పట్టించుకోలేదు. వారికి ఇటు పెన్షన్‌రాక, అటు సర్వీసులోకి తీసుకోక మానసికంగా నలిగిపోతున్నారు. సాంఘిక సంక్షేమానికి, గిరిజన సంక్షేమానికి ఒకే మంత్రి అయినా రెండు శాఖల మధ్య వివక్ష చూపుతున్నారు. 10వ షెడ్యూలు అనే బూచిని చూపి పిఆర్‌సి కూడా అమలుపరచలేదు. అదేమంటే ఈశాఖ 10వ షెడ్యూల్డ్‌లో ఉందని మంత్రి చెబుతున్నారు. కానీ ఇదే 10వ షెడ్యూల్‌లో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలు పిఆర్‌సిని తీసుకోవడం గమనార్హం. వారికి అడ్డురాని 10వ షెడ్యూలు మనకు ఎందుకు వచ్చిందో తెలియదు. సంస్థను స్థాపించిన నాటి నుంచి అంటే దాదాపు 25 సంవత్సరాలపాటు ఒకేచోట, ఒకే పదవిలో ఏ ఉద్యోగైనా పనిచేస్తే అతను ఎంత అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి, పెత్తందారీ వ్యవస్థకు అలవాటుపడతారో నిదర్శనం ఈ సిబ్బంది. ఎంత పెద్ద అధికారి అయినా వీరికి తలవంచవలసిందే. ఈ వ్యవస్థలో సెక్రటరీలది ఒక పాలనైతే వీళ్ళది సమాంతర పాలన. దీనికి ప్రత్యక్ష తార్కాణమే రిటైర్ అయిన వారిని తిరిగి సర్వీసులోకి తీసుకొనే విషయంలో నడుస్తున్న ఫైల్.
తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో తెలిసో తెలియకో మంత్రి గురుకుల సిబ్బంది సంఘాలకు ఒక సమావేశం నిర్వహించారు. అన్ని సంఘాల నుంచి ప్రతినిధులను ఎంపికచేసి సమస్యలపై ఒక నోట్ తయారు చేయమని, వాటిని క్షణాల్లో పరిష్కరిస్తానని చెప్పారు. అసలు విషయం తెలియని గురుకుల సంఘ బాధ్యులు 64 పేజీల నోట్ తయారు చేసుకొని మంత్రి కోసం ఇప్పటి వరకు ఎదురుచూస్తూనే ఉన్నారు. 175 గురుకులాల్లో ఉన్న సమస్యల గురించి తెలియని మంత్రి మరో 70 గురుకులాలను తెరచి ఏ విద్యార్థుల, సిబ్బంది జీవితాలతో ఆడుకుంటారో తెలియదు.
గురుకులాలు పురోగమించాలంటే తక్షణం కొన్ని చర్యలు చేపట్టాలి. పాఠశాలల్లో విద్యార్థులకు తగిన విధంగా సదుపాయాలు కల్పించాలి. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. సిసిఇ విధానంపై కాంట్రాక్ట్, పార్ట్‌టైం వారికి శిక్షణ ఇవ్వాలి. సోదర గురుకులాలలాగా స్థిరమైన వ్యవస్థ నడవాలి. పరీక్షల అధికారిగా అనుభవం కలిగినవారిని నియమించాలి. కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలి. 60 సంవత్సరాలు నిండని ఉద్యోగ విరమణ చెందిన సిబ్బందిని వెంటనే సర్వీసులోకి తీసుకోవాలి. సొసైటీ కేంద్ర కార్యాలయంలోని సిబ్బందిని పాఠశాలలకు, పాఠశాల సిబ్బందిని కార్యాలయానికి రొటేషన్ పద్ధతిలో మార్చాలి. గురుకులాల పాఠశాలలను, కాలేజీలను వేరువేరుగా నిర్వహించాలి. తెలంగాణలో మాదిరిగా సిబ్బందికి వెంటనే పిఆర్‌సి క్లారిటీ స్కేలును ఇవ్వాలి. ఇప్పటికైనా దళిత విద్యార్ధులు ఉన్నత స్థాయికి చేరేవిధంగా ప్రభుత్వం ఈ పాఠశాలలు, కాలేజీలలో వసతులను కల్పించి, మంచి వాతావరణం ఏర్పరచి వారు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తోడ్పడాలి.
- వి బాలకోటయ్య
(వ్యాసకర్త డివైఎఫ్‌ఐ ప్రకాశంజిల్లా కార్యదర్శి)
9490300346