గందరగోళంలో ఏపీ సర్కారు..

రాష్ట్ర విభజన చట్టంలోని పదో షెడ్యూల్‌లో ఉన్న సంస్థల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అయోమయం, గందరగోళానికి గురవుతోంది. ఏడాదిపాటు ఏమీ పట్టించుకోకుండా... పుణ్యకాలం ముగిసిన తర్వాత కూడా ఎటూ తేల్చుకోలేక తికమకపడుతోంది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ ఏర్పాటైన సంస్థలను వాటి కార్యకలాపాలు, పని స్వభావాన్నిబట్టి 9, 10 షెడ్యూళ్లలో చేర్చారు. పదో షెడ్యూల్‌లో విద్యా, శిక్షణా సంబంధిత సంస్థలున్నాయి. ఏ ప్రాంతంలో ఉన్న సంస్థ ఆ రాష్ట్రానికే చెందుతుందని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే... విభజన చట్టం అమలులోకి వచ్చిన ఏడాదిపాటు ఈ సంస్థలు రెండు రాష్ట్రాలకు సేవలందించాల్సి ఉంటుంది. ఈలోపు రెండు రాష్ట్రాల్లో ఆయా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు.