ఖాకీ కంచెలు

సోలార్‌ పార్కు భూ నిర్వాసితుల సమస్యలను తెలుసుకునేందుకు బుధ వారం అనంతపురం జిల్లా నంబూల పూలకుంట (ఎన్‌పి కుంట) మండలానికి వెళ్లిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ను పోలీసులు అడుగడుగునా అడ్డుకు న్నారు. భూముల వద్దకెళ్లి నిర్వాసిత రైతుల సమస్యలను తెలుసుకోకుండా సిపిఎం నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌లో పెట్టారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నడుమ మధు పర్యటన సాగింది. ఎన్‌పి కుంట మండలంలో 10,700 ఎకరాల్లో సోలార్క్‌ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా మొదటి విడతలో 7,500 ఎకరాల భూములను సేకర ణకు పూనుకున్నారు. ఈ భూములకు సంబంధించి కొందరు బినామీ వ్యక్తులకు పరిహారం
ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు వాస్తవ రైతులకు ఇస్తున్న పరిహారం కూడా నామమాత్రంగా ఉండటంతో వారిలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో.. మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌, కార్యదర్శి వర్గ సభ్యులు ఇంతియాజ్‌, ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు బుధవారం ఎన్‌పికుంట మండలంలోని సోలార్‌ పార్కు ప్రాంతానికి వెళ్తున్న సమయంలో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. కదిరి పట్టణం నుంచి బైకు ర్యాలీగా ఎన్‌పికుంటకు వెళ్తున్న సమయంలో రెక్కమాను వద్ద అడ్డుకునేందుకు పోలీసులు యత్నించి విఫలమయ్యారు. అటు తరువాత ఎన్‌పికుంట మండల కేంద్రానికి చేరుకునేలోపే పోలీసులను పెద్దఎత్తున మోహరించారు. నాయకులను బస్టాండ్‌ వద్దనే నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా నాయకులు నిర్వాసితులను కలిసేందుకు దూసుకెళ్లారు. ఈ సమయంలో పోలీసులు, సిపిఎం నాయకుల మధ్య తోపులాట జరిగింది. నిర్వాసిత రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన తమను అడ్డుకోవడం సరైంది కాదని నాయకులు పోలీసులకు ఎంత చెప్పినా వినలేదు. అనుమతి లేదని అడ్డుకున్నారు. పది నిమిషాలు సమయమిచ్చినా పోలీసులు అనుమతించకపోవడంతో నాయకులు, కార్యకర్తలు, రైతులందరూ ఒక్కసారిగా సోలార్‌ పార్కు వైపునకు దుసుకువెళ్లారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులకు సాధ్యపడలేదు. అందరూ ఒక్కరిసారిగా ముందుకెళుతున్న సమయంలో సిఐ రవికుమార్‌ ఆధ్వర్యంలో పోలీసు ప్రత్యేక దళాలు స్టేషన్‌ సమీపంలో భారీగా మోహరించి అడ్డుకున్నారు. అక్కడి నుంచి ముందుకెళ్లడం సాధ్యం కాకపోవడంతో సిపిఎం నాయకులు బస్టాండ్‌ వద్దకు వచ్చి కొంతసేపు రైతులతో మాట్లాడారు. అనంతరం మరోమారు సోలార్‌ పార్కు వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా పోలీసులు అడ్డుకోవడంతో మధు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. సోలార్‌ పార్కు నిర్వాసిత రైతులతో మాట్లాడే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అంతవరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని తెగేసి చెప్పారు. దీంతో మధుతోపాటు, రాంభూపాల్‌, ఇంతియాజ్‌ తదితరులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వరకు స్టేషన్‌లోనే నిర్బంధించిన పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
నిర్వాసితులను ఆదుకోవాలి
నకిలీలపై చర్యలు తీసుకోవాలి : పి.మధు
ఎన్‌పికుంటలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి రూ.12.50 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని పి.మధు డిమాండ్‌ చేశారు. పోలీసులు అరెస్టు చేసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీకి చెందిన కొంతమంది బినామీలు నష్ట పరిహారాన్ని కాజేసి అర్హులైన రైతులకు అన్యాయం చేసేందుకు సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి నకిలీలను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఎన్ని అడ్డంకులు, నిర్బంధాలు విధించినా వాస్తవ నిర్వాసిత రైతులకు న్యాయం జరిగేవరకూ పోరాటాన్ని కొనసాగించి తీరుతామని హెచ్చరించారు. రైతులకు జరిగిన నష్టం గురించి తెలుసుకునేందుకు వస్తే పోలీసులు అడ్డుకోవడం సరైంది కాదన్నారు. ఏ కారణం చేత అడ్డుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్‌పికుంట రైతులకు పరిహారం చెల్లించకుండా పనులు సాగనివ్వబోమని హెచ్చరించారు. పరిహారం అందించేవరకూ ఇక్కడికి వస్తునే ఉంటామనీ, ఉద్యమం చేస్తూనే ఉంటామనీ విశదీకరించారు.