కోస్టల్‌ కారిడార్‌ భూసేకరణ ఆపాలి

(visakha rural)

             పెట్రో కారిడార్‌ కోసం చేపడుతున్న భూసేకరణపై 'యథాతదస్థితి' (స్టేటస్‌కో)ని కొనసాగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడం పట్ల సిపిఎం, ఇండిస్టియల్‌ పార్కు నిర్వాసితుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేశాయి. ఈ మేరకు సిపిఎం, నిర్వాసితుల సంఘం నాయకులతో కలిసి విశాఖలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడారు. నక్కపల్లి పరిసర ప్రాంతాల్లో పిసిపిఐఆర్‌ పేరిట 2010లో ప్రభుత్వం భూసేకరణ చేపట్టిందని, దీనినే నేడు విశాఖ-చెన్నై కారిడార్‌గా మార్పు చేశారని తెలిపారు. 2,600 ఎకరాల జిరాయితీ భూముల సేకరణకు 4(1) నోటీసులు ఇచ్చిందని, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పరిసర ప్రాంతాల రైతులు సిపిఎం మద్దతుతో హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నారని చెప్పారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రెండు పంటలు పండే భూములను తీసుకోకూడదన్నారు. ప్రభుత్వం పరిశ్రమకు 70 శాతం, ప్రైవేటు పరిశ్రమకు 80శాతం మంది ప్రజల ఆమోదం కావాలని, ఇందుకు గ్రామ సభలు నిర్వహించాల్సి ఉందని, కాని టిడిపి ప్రభుత్వం ఈ చట్ట ఉల్లంఘనకు పాల్పడుతుందని విమర్శించారు. డి-ఫారం భూములకు నష్టపరహారం చెల్లించేది లేదని చెప్పడం దుర్మార్గమన్నారు. ప్రస్తుతం 70 శాతం పరిహారం చెల్లిస్తామని అధికారులు ప్రలోభాలకు గురి చేస్తున్నారని, జిరాయితీ భూములతో సమానంగా డి-పట్టా భూములకు పరిహారం ఇవ్వాలని ఆర్టికల్‌ 21లో చట్టం చెబుతుందని తెలిపారు. జిల్లా అధికారులు రకరకాలుగా సంబంధంలేని ప్రకటనలతో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. నష్టపరిహారం తీసుకోకపోతే కోర్టుకు కట్టేస్తారని, భూములను సర్వే చేయించుకోకపోతే ప్రభుత్వ భూములగా పరిగణిస్తారని గ్రామాల్లోని కొంతమంది పెద్దలు, అధికారులు కలిసి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని తెలిపారు. పరిశ్రమలు రాకపోతే ఎలా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఏ పరిశ్రమ వస్తుందో ముందు చెప్పాలని తరువాత భూసేకరణకు ఆలోచించాలని తెలిపారు. ప్రభుత్వ చర్యల వల్ల భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడుతుందని చెప్పారు. 
నిర్వాసితుల సంక్షేమ సంఘర నాయకులు వడగళ్లు చిన్నారావు మాట్లాడుతూ విష వాయువులు వెదజల్లే పరిశ్రమల ఏర్పాటుకు ఉత్తరాంధ్రను ఎంచుకోవడం దుర్మార్గమన్నారు. ఈ ప్రాంతాల్లో భూమి రిజిస్ట్రేషన్లను అడ్డుకుంటున్నారని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, నక్కపల్లి డివిజన్‌ కన్వీనర్‌ ఎం.అప్పలరాజు, నిర్వాసితుల సంఘం అధ్యక్షులు లొడగల చంద్రరావు, న్యాయవాది ఎస్‌.ప్రసాద్‌ పాల్గొన్నారు.