కొన‌సాగుతున్నకార్మికులస‌మ్మె‌

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ కార్మికుల సమ్మె ఏడో రోజు కొన‌సాగుతుంది. కనీస వేతనాలు ఇవ్వాలని కార్మికులు ఆందోళన చేస్తుంటే.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చెత్త తరలించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఈ ప్రయత్నాలను అడ్డుకున్న కార్మికులు.. సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.
తమ డిమాండ్లు  సాధ‌న‌కై
తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఏపీలో మున్సిపల్‌ కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. అయితే.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమైన ప్రభుత్వం.. చెత్త తరలింపునకు చర్యలు చేపట్టింది. జేసీబీ వాహనాలతో చెత్త తరలించేందుకు సిద్ధమవగా.. ఆ ప్రయత్నాన్ని మున్సిపల్‌ కార్మికులు అడ్డుకున్నారు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించకుండా.. ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సరికాదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంపూర్ణ మద్దతు ప్ర‌క‌టించిన వామపక్షాలు
మరోవైపు మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు వామపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడలో భారీ మానవహారం నిర్వహించారు. సమ్మెపట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు వాటిని నెరవేర్చాలని కోరితే.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
సమ్మె విచ్చిన్నానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం...
సమ్మె విచ్చిన్నానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇకనైనా మానుకోవాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లెఫ్ట్‌ నేతలు డిమాండ్‌ చేశారు. లేకపోతే.. సమ్మె మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.