కేరళ అసెంబ్లీనుండి ఎల్‌డిఎఫ్‌ వాకౌట్‌

 తిరువనంతపురం: బార్‌ల లంచాలకు సంబంధించిన కేసులో ఆర్థిక మంత్రి కెఎం మణిని ప్రాసిక్యూట్‌ చేయరాదన్న విజిలెన్స్‌ నిర్ణయంపై ప్రతిపక్ష ఎల్‌డిఎఫ్‌ తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తాము ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని అనుమ తించనందుకు నిరసనగా ఎల్‌డిఎఫ్‌ సభ నుండి వాకౌట్‌చేసింది. ఈ నెల 27న జరిగిన అరువిక్కర ఉపఎన్నిక నేపథ్యంలో రిషెడ్యూల్‌ అయిన అసెంబ్లీ పూర్తి స్థాయి బడ్జెట్‌ సమావే శాలు సోమవారం ఇక్కడ ప్రారంభమయ్యా యి. సభ ప్రారంభమైన వెంటనే విజిలెన్స్‌ విభాగం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాయిదా తీర్మానం కోసం ఎల్‌డిఎఫ్‌ స్పీకర్‌కు నోటీసు అందచేసింది. దీనిపై హోం మంత్రి రమేష్‌ చెన్నితల బదులిస్తూ విజిలెన్స్‌ విభాగం ఇంకా తన దర్యాప్తు నివేదికను ప్రభుత్వానికి అంద చేయలేదని చెప్పారు. కేవలం మీడియా కథ నాల ఆధారంగా ప్రతిపక్షం దీనిపై చర్చ కోరుతోందని ఆయన విమర్శించారు. పుకా ర్లు, మీడియా కథనాల ఆధారంగా ప్రభుత్వం దర్యాప్తును కొనసాగించలేదని ఆయన స్పష్టం చేశారు. విజిలెన్స్‌ దర్యాప్తులో ప్రభుత్వం ఎన్నడూ జోక్యం చేసుకోలేదన్న ఆయన ఈ దర్యాప్తు పూర్తి స్వేచ్ఛగా పారదర్శకతతో కొనసాగుతున్నదని వివరించారు. ఈ కేసులో మాజీ సొలిసిటర్‌ జనరల్‌ ఎల్‌ నాగేశ్వరరావు నుండి న్యాయపరమైన అభిప్రాయం కోరా లన్న విజిలెన్స్‌ నిర్ణయాన్ని ఆయన సమర్ధిస్తూ గతంలో కూడా అనేక కేసుల్లో అవినీతి నిరోధక విభాగం (ఎసిబి) న్యాయసలహా తీసుకున్నదని గుర్తు చేశారు. అంతకు ముందు వాయిదా తీర్మానానికి సంబంధిం చిన నోటీసుకు అనుమతి కోరిన సిపిఎం సభ్యుడు ఎస్‌ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తులో జోక్యం చేసుకున్నదని, దర్యాప్తు అధికారులు నిష్పక్షపాతంగా తమ నివేదికను అందచేసే అవకాశాలను నిరాకరిం చిందని విమర్శించారు. ఇప్పటి వరకూ ఈ కేసు కోర్టుకు వెళ్లనందున దీనిపై సభలో చర్చ చేపట్టటం 'సబ్‌జుడిస్‌' కాదని ఆయన స్పష్టంచేశారు.ఈ సమయంలో జోక్యం చేసుకున్న సిపిఎం పక్ష ఉపనేత కొడియేరి బాలకృష్ణన్‌ మాట్లాడుతూ విజిలెన్స్‌ విభాగం నాగేశ్వర రావు నుండి న్యాయసలహా కోరటం ఏ మాత్రం సమర్ధనీయం కాదన్నారు. చివరికి స్పీకర్‌ ఎన్‌ శక్తన్‌ తీర్మానానికి అనుమతి నిరాకరించారు. దీనికి నిరసనగా ఎల్‌డిఎఫ్‌ సభ్యులు ప్రతిపక్ష నేత విఎస్‌ అచ్యుతానందన్‌ నేతృత్వంలో సభ నుండి వాకౌట్‌ చేశారు. అంతకు ముందు అచ్యుతానందన్‌ సభలో మాట్లాడుతూ ఈ కేసును ప్రభుత్వం మసి పూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తుం దన్న ప్రతిపక్ష భయాందోళనలు విజిలెన్స్‌ విభాగం నిర్ణయంతో రుజువయ్యాయన్నారు.