కేంద్రం రాష్ట్రానికి చేసిన సాయం ఏమిటో తెలుసు కునేందుకు దీనిపై ఒక శ్వేత పత్రాన్ని వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(ఎం) డిమాండ్ చేసింది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు సోమవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఇటీవలి బడ్జెట్‌లో రాష్ట్రానికి కేంద్రం మొండి చెయ్యి చూపించిందని, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను గాలికొదిలేసిందని విమర్శించారు. కేంద్రాన్ని రాష్ట్రం ఏం కోరింది, కేంద్రం ఏమిచ్చిందీ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించాలన్నారు. రాష్ట్ర ఏర్పాటు తరువాత రెండో పూర్తి స్థాయి బడ్జెట్, కనుక ఇవి చాలా ముఖ్యమైన సమావేశాలు. గత ఏడాది సర్ధుబాటుతోనే సరిపెట్టుకున్నా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనే అంశాలపై స్పష్టత రావల్సి ఉంద న్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగింది. విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదా, విద్యా సంస్థల ఏర్పాటు, రైల్వే జోన్, వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజిలను కేంద్రం పూర్తిగా విస్మరించిందన్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి కేంద్ర సాయంపై చర్చ జరగాల న్నారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిల పక్షం ఢిల్లీలో ఆందోళన చేయడానికి వెనకాడరాదన్నారు.