కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కుచ్చుటోపీ..

పోలవరం ప్రాజెక్టు కథ-చారణా కోడికి బారణా మసాలా లాగా ఉంది. కేవలం నాబార్డు రుణంతో సరిపెట్టారు. కానీ, గమనార్హమైన అంశమేమంటే నాబార్డుకు పెట్టుబడి నిధి క్రింద రూ.9,020 కోట్లు కేటాయించారు. ఈ నిధుల నుంచే ఎఐబిపి జాతీయ హోదా ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి. ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నట్లు నాబార్డు నుంచి నిధులు ఎంత వరకు లభిస్తాయి. రూ.16 వేల కోట్లు అంచనా ప్రకారం ఇంకా రూ.3,829 కోట్లు రాష్ట్రానికి రావాలి. పైగా ప్రాజెక్టు అంచనాలు పెరిగితే నీతి ఆయోగ్‌ అమోదం పొందాలి. ఇదంతా ఒక విష వలయం. రాష్ట్ర ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న భ్రమ. అన్నిటికన్నా దుర్మార్గమేమంటే కేంద్ర ప్రభుత్వానికి చెందిన విద్యా సంస్థలు రాష్ట్రంలో తామరతంపరగా ఎన్నో నెలకొల్పామని, ఎపి విద్యా హబ్‌గా తయారౌతుందని కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ప్రారంభోత్సవ కార్యక్రమాలు సాగించారు. తీరా నిధుల అంశమొచ్చేసరికి పాతికేళ్లు గడిచినా ఈ విద్యా సంస్థల నిర్మాణం పూర్తి కావు. తిరుపతిలో నెలకొల్పిన ఐఐటికి రూ.700 కోట్లు వ్యయం చేస్తేనే పూర్తవుతుంది. ఈ బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించారు. ఈ పాటికే హైదరాబాదులో నిర్మాణం జరిగి పని చేస్తున్న ఐఐటికి రూ.75 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఐఐఎస్‌ఇఆర్‌ తిరుపతిలో నెలకొల్పారు. రూ.1,500 కోట్లు ఖర్చుపెడితేనే ఇది పూర్తవుతుంది. కానీ బడ్జెట్‌లో రూ.50 కోట్లు మాత్రం పెట్టారు. పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా మంగళగిరిలోని ఎయిమ్స్‌కు బడ్జెట్‌లో చిల్లిగవ్వ లేదు. అనంతపురంలో కేంద్రీయ యూనివర్సిటీకి ఇప్పటి వరకు రూ.11 కోట్లు ఇచ్చారు. ఈ బడ్జెట్‌లో పైసా చూపలేదు. వైజాగ్‌లోని ఐఐఎంకు ఇదే దుర్గతి పట్టింది. ఎపి ప్రజలను మాయ చేయడానికి వివిధ విద్యా సంస్థలకు ప్రారం భోత్సవాలైతే చేశారు గానీ అవి పూర్తిగా నిర్మాణం జరిగేందుకు అవసరమైన కనీస నిధులు కూడా కేటాయించలేదు. ఇంత జరిగినా కేంద్రం మంత్రి వెంకయ్యనాయుడు ఎపిని కేంద్రానికి ప్రత్యేక రాష్ట్రంగా అభివర్ణించారంటే, అందుకు ముఖ్యమంత్రి తాళం వేస్తున్నారంటే ఎపి ప్రజలు భ్రమపడటానికి పిచ్చివాళ్ళేమీ కాదు.