కేంద్రంపై ఐక్యపోరాటాలు తప్పవు..

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలు తప్పవని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ 2న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌లోని రైల్వే ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పలువురు కార్మిక సంఘాల నేతలు మాట్లాడారు. కార్మిక, ఉద్యోగ సంఘాల పట్ల మోడీ ప్రభుత్వం చులకన భావంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ముందుంచిన 12 న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో మొండిగా వ్యవహరిస్తోందన్నారు. కార్మిక సంఘాలతో చర్చల సందర్భంగా ట్రేడ్‌ యూనియన్లన్నీ ఐక్యంగా వినిపించిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ధ్వజమెత్తారు. ఈ ఏడాది మార్చి 30న ఢిల్లీలో జరిగిన జాతీయ కార్మిక సదస్సులో సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్త సమ్మె నిర్వహించేందుకు పిలుపునిచ్చాయని చెప్పారు.