
కోల్‌కతా:
మావోయిస్టు నాయకుడు కిషన్‌జీ అలియాస్ కోటేశ్వర్ రావును మమత ప్రభుత్వమే ఎన్కౌంటర్ చేసిందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ప్రకటించిన దరిమిలా ఈ అంశాన్ని తాము లోక్‌సభలో లేవనెత్తుతామని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, లోక్‌సభలో సిపిఐ(ఎం) పక్ష ఉపనాయకుడు మహ్మద్ సలీం చెప్పారు. ఆయన ఆదివారం కోల్‌కతాలోని ముఝఫర్ అహ్మద్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ తర్వాతి స్థానంలో వున్న ఆమె మేనల్లుడు ఎంపి అభిషేక్ బెనర్జీ చెప్పిన మాటలను కొట్టిపారేయడానికి వీల్లేదన్నారు. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టు నాయకుడు చనిపోయారని మమతా బెనర్జీ పేర్కొన్నదానికి, అభిషేక్ బెనర్జీ చెప్పిన దానికి పొంతనే లేదని సలీమ్ అన్నారు. మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు ఎవరు అబద్ధం చెబుతున్నారో తేలాలని సలీమ్ విలేకరులతో చెప్పారు. కిషన్‌జీ మమతా బెనర్జీని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారని ఆయన దెప్పిపొడిచారు. వామపక్ష కూటమి ప్రభుత్వాన్ని కూలదోయడానికి క్రమబద్ధంగా హత్యలు చేయిస్తూ టిఎంసి మావోయిస్టులను పావులుగా వాడుకుందని ఆయన విమర్శించారు. ఇంతకు ముందు కూడా పార్లమెంట్లో టిఎంసి మావోయిస్టుల సరసతను వామపక్షాలు బయటపెట్టాయని చెబుతూ, ఇది చాలా ముఖ్యమైన విషయమని అన్నారు. అప్రతిష్ఠ మూటకట్టుకున్న ఎస్ఎస్ రారు ప్రభుత్వం 70వ దశకంలో చేసిన ఎన్కౌంటర్లు పశ్చిమ బెంగాల్లో ఎవరికీ తెలియదని, ఆ నీతిని ఇప్పుడు మమతా బెనర్జీ దిగుమతి చేసుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల దృష్టిలో కిషన్‌జీ నేరస్థుడేనని, అయితే, నేరస్థులకు కూడా మానవ హక్కులుంటాయని అన్నారు. రాష్ట్రంలో చట్టాలు అమలు కావడం లేదని, తీవ్రవాద రాజకీయం అనే కొత్త రాజకీయ సంస్కృతి వేళ్లూనుకుంటోందని చెబుతూ, ఇక్కడ రాజకీయ హత్యలు అసాధారణమేమీ కాదన్నారు. 2009 ఆగస్టు 9న మావోయిస్టు నాయకుడు ఆజాద్ హత్య జరిగినప్పుడు ఆమె కేంద్ర మంత్రిగా ఉన్నారని, అప్పుడు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా మాట్లాడారని చెబుతూ, ముఖ్యమంత్రి అయ్యాక ఆమె ఆ విధానాన్నే అనుసరిస్తున్నారన్నారు. ఆజాద్ ఎన్కౌరటర్పై ఆమె వ్యాఖ్యలు రాజకీయ జిమ్మిక్కులన్నారు.
రాష్ట్రంలో మావోయిస్టు ఆపరేషన్లకు ముఖ్యమంత్రి చిట్‌ఫండ్ డబ్బును వినియోగించారని ఆరోపించారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. కిషన్‌జీని కనుక హత్య చేసి ఉంటే నిజం అదే బయటకు వస్తుందని సిపిఎం అప్పుడే చెప్పిందన్నారు. 2020కల్లా భారత్ హిందూ రాజ్యంగా ఆవిర్భవిస్తుందని విహెచ్పి నాయకుడు అశోక్ సింఘాల్ చేసిన వ్యాఖ్యపై స్పందిస్తూ, ఇవి ఉబుసుపోని వ్యాఖ్యలు కావని, రాజకీయ పథకంలో భాగమని అన్నారు