కాషాయాన్ని వెంటాడుతున్న కమ్యూనిస్టు భూతం

మామూలుగా ఎన్నికల ప్రచార సమయంలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ ఉంటుంది. పోలింగ్‌ ముగిసిన మరుక్షణంలో మొదలయ్యే ఎగ్జిట్‌ పోల్స్‌ ఆ కుతూహలానికి కొంత సమాధానమిస్తాయి. ఎన్నికల సర్వేల కన్నా ఎగ్జిట్‌ పోల్స్‌ వాస్తవ ఫలితాలకు కొంత దగ్గరగా ఉంటాయనేది సాధారణంగా ఉన్న భావన. కానీ ఇప్పుడు బీహార్‌ ఎన్నికల విషయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఉత్కంఠను మరింత పెంచేశాయి. విజయం గురించిన అంచనాలలో విపరీతమైన తేడా ఇందుకు కారణం. రెండు మినహా మిగిలిన ఛానల్స్‌ జెడియు-ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమికి ఆధిక్యత లేదా మొగ్గు ఉంటుందని చెప్పాయి. టుడేస్‌ చాణక్య, ఎక్స్‌ప్రెస్‌ సిసిరో మాత్రం బిజెపి ఎన్‌డిఎ కూటమికి అధికారం వస్తుందంటున్నాయి. మిగిలిన సంస్థల కన్నా ఒక రోజు ఆలస్యంగా ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేసిన ఎన్‌డిటివి ఎన్‌డిఎకు ఆధిక్యత వస్తుందని చెప్పింది. జెడియు కూటమికి ఆధిక్యత వస్తుందని సిఎన్‌ఎన్‌-ఐబిఎన్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పడంతో ప్రకటించిన ప్రసారాలే మానేశారని కథనాలు వచ్చాయి. ఇదంతా చాలా తికమక వ్యవహారంగా తయారైంది. విజేతలుగా ఎవరిని చూపించినా అత్యధిక, అత్పల్ప సీట్ల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. సగటు లెక్కకట్టి చూస్తే ఇంచుమించు అన్నీ ఒకేరకంగా ఉన్నాయి. చాణక్య సంస్థ అంచనాలు చాలా వరకూ సరిగ్గా ఉంటాయని చెబుతున్నారు గాని మొన్నటి మహారాష్ట్ర ఎన్నికల్లోనే అది విఫలమైందనేది వాస్తవం. ఈ ఊహాగానాలను పక్కనపెట్టి రేపటి ఫలితాల కోసం చూడటమే ఈ సమయంలో ఉత్తమమని ప్రజలు భావించే పరిస్థితి.
బీహార్‌ ఎన్నికలలో రాజకీయ సమీకరణ ఎంత తీవ్రంగా ఉన్నదీ ఈ పరిస్థితిని బట్టి తెలుస్తుంది. ఎవరి జయాపజయాలు ఎలా ఉన్నా దేశ రాజకీయాలపై కూడా చాలా ప్రభావం పడుతుంది. ఏడాదిన్నరలోనే ప్రధాని మోడీ ప్రభావం పలచబడటం బిజెపికి పెద్ద దెబ్బ అనుకుంటే మూడు పార్టీలు కలిసి కూడా ప్రజల విశ్వాసం పొంది ఓట్ల చీలిక నివారించలేకపోవడం పాలక కూటమికి పరాభవమవుతుంది. అయితే రెండుసార్లు విజయం సాధించిన నితీష్‌కుమార్‌ జెడియు అప్పుడు బిజెపితో ఉన్నారు. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో ఉన్నారు. గత ఎన్నికల్లో జెడియు పోటీ ప్రధానంగా ఈ రెండు పార్టీలపైనే నడిచింది గనక ఇప్పుడు అవన్నీ కలవడం తప్పక మార్పు తెస్తుందనేది ఒక అంచనా. విధానాలలో మార్పు లేకుండా, అవకాశవాద, అవినీతి పోకడలు విడనాడకుండా బిజెపికి వ్యతిరేకంగా లౌకిక నినాదం ఇచ్చినంత మాత్రాన ప్రజలు ఆదరించకపోవచ్చనేది వారు ఓడితే వచ్చే పాఠం. ఇక బిజెపి ఓడిపోతే రిజర్వేషన్లపై దాడి, మతతత్వ రాజకీయాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు, వీటికి ప్రజల తిరస్కృతిగానే పరిగణించాల్సి ఉంటుంది. ఢిల్లీ తరహాలో బీహార్‌ కూడా ఓడిపోతే ఇక లోక్‌సభ ఫలితాలను 'ఒకేసారి అద్భుతం'(వన్‌టైం వండర్‌)గానే చూడక తప్పదు. హోరాహోరీగా వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌లో ఏది నిజమైనా ఈ రెండింటికీ వర్తించే అంశాలివి.
చర్చలో బొత్తిగా ప్రస్తావనకు రానిదీ, ప్రాధాన్యతకు నోచుకోనిదీ బీహార్‌లో వామపక్ష పార్టీలు విడిగా చేసిన ఐక్య పోటీ. రెండు ప్రధాన కూటముల మధ్య ఎంచుకోవలసినంత తేడా ఏమీ లేదని ఈ పార్టీలు ఓటర్లకు స్పష్టంగా చెప్పాయి. వామపక్షాలు బిజెపి మతతత్వ ఓటమి ప్రధానంగా భావిస్తాయి గనక కాంగ్రెస్‌తో, ఇతర ప్రాంతీయ పార్టీలతో కలసి వ్యవహరిస్తాయనే ఒక ప్రచారం నిరంతరం నడుస్తుంటుంది. బీహార్‌ ఎన్నికల్లో వాటికి ఎన్ని స్థానాలు వస్తాయనే ప్రశ్న అటుంచితే ఈ ప్రచారంలో పస లేదని తేలిపోయింది. కాంగ్రెసేతర, బిజెపియేతర లౌకిక ప్రాంతీయ పార్టీల సమీకరణ ప్రయత్నాలు కొన్ని జరిగినా అనుభవాలు ప్రోత్సాహకరంగా లేవని రుజువైన ఫలితమిది. ప్రాంతీయంగా జాతీయ పాలక పార్టీలను ఎదిరించి నిలదొక్కుకునే స్థితి నుంచి ఈ ప్రాంతీయ పార్టీలు వాటి సహాయంతో తమ రాజకీయాలు నడుపుకోవడం ప్రధానమనే స్థితికి వచ్చాయి. తమ తమ రాష్ట్రాల్లో గాని లేక కేంద్రంలో గాని అధికారంలో భాగం పొందాలంటే అటు బిజెపి, ఇటు కాంగ్రెస్‌ ఏ పార్టీతోనైనా విచ్చలవిడిగా కలసి పోతున్నాయి. రెండింటి మధ్యనా బేరసారాలతో తమ బరువు పెంచుకుంటున్నాయి. నితీష్‌కుమార్‌ రెండుసార్లు బిజెపి సహాయంతో గెలిస్తే లాలూ కాంగ్రెస్‌తో కలసే ఉన్నాడు. దేవగౌడ కుమారుడు కుమార స్వామి, చంద్రబాబు నాయుడు బిజెపితో జట్టు కడితే పంజాబ్‌లో ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ చాలా కాలంగా వారితో కలసి పాలన సాగిస్తున్నాడు. డిఎంకె, అన్నాడిఎంకెలు అటూఇటూ పొత్తులు మార్చి పబ్బం గడుపుకోవడం దేశమంతా చూసింది. ఒడిషాలో నవీన్‌ పట్నాయక్‌ ఉదాహరణా భిన్నమైంది కాదు. బిఎస్‌పి కూడా రెండుసార్లు బిజెపితో కలసి పాలన చేసింది. ఎటొచ్చీ ఎస్‌పి(సమాజ్‌వాది పార్టీ) మాత్రం తన ప్రయోజనాల రీత్యా వాటితో చేరకుండా ప్రయోజనాలు నెరవేర్చుకోవడం చూస్తుంటాం. రెండో వైపున ఆర్థిక విధానాల విషయంలో ఈ ప్రాంతీయ పాలక పార్టీలన్నీ కాంగ్రెస్‌, బిజెపిలకు తీసిపోని కార్పొరేట్‌ మార్గం అనుసరిస్తూ అదనంగా కుటుంబ పాలనకు నిలయాలవుతుంటాయి.
ఇన్ని అవలక్షణాల మధ్య ప్రాంతీయ పార్టీలతో కలసి వ్యవహరించినా వామపక్షాల స్వంత బలం పెరగనివ్వకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడటం కూడా అన్ని రాష్ట్రాల అనుభవం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీరోచితంగా మాట్లాడి గద్దెక్కగానే అంతా తలకిందులు చేయడంలో వీటికివే సాటి. ఈ నేపథ్యంలోనే విశాఖపట్టణంలో జరిగిన సిపిఎం మహాసభ వామపక్షాల స్వతంత్ర బలం పెంచుకోవడంపై కేంద్రీకరించాలని, ప్రజా పునాది విస్తరించుకోవాలని భావించింది. బీహార్‌లోనూ వామపక్షాలు నితీష్‌ కూటమిని బలపరుస్తాయని చాలా కథనాలు వచ్చినా నిజం కాకపోవడానికి అదే కారణం. సంప్రదాయికంగా అక్కడ కొంత పునాది కలిగిన సిపిఐ, సిపిఎం, సిపిఐఎం లిబరేషన్‌లు కలసి పోటీ చేయడం మంచి ప్రభావమే చూపించింది. ఫలితాలు, సీట్ల సంఖ్యతో నిమిత్తం లేకుండా స్వంతంగా పోరాడాలన్న వాతావరణం తీసుకొచ్చింది. ఎన్నికల పరిశీలకులూ, సర్వేలూ వేటిలోనూ ఈ వాస్తవానికి ఎలాటి ప్రాధాన్యతా లేనట్టు, రెండు కూటముల మధ్యనే పోటీ చేస్తున్నట్టు చిత్రించడం వాటి రాజకీయ దృక్కోణాన్నే తెలియజేస్తుంది. వామపక్షాలను తోకలుగా ఎగతాళి చేసేవారు అవి స్వంతంగా నిలబడితే హర్షిస్తారా అంటే అదీ జరగదు. పైగా రేపు స్థానాలు రాకపోతే అపహాస్యం చేద్దామని పొంచి చూస్తుంటారు.
అయితే ఎవరు ఎంత విస్మరించాలని చూసినా సైద్ధాంతికంగా, విధానాల పరంగా వామపక్షాల వైఖరి, పాత్ర ముందుకు వస్తూనే ఉంటాయి. ప్రతికూల ప్రచారం కోసమైనా వారు వామపక్షాలను గురించి చెప్పక తప్పని స్థితి. అవార్డు వాపసీ వెనక ఉన్నది కమ్యూనిస్టులేనని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వంటివారు రోజూ ఎక్కడో ఒక చోట ఆరోపిస్తూనే ఉన్నారు. అసలు చరిత్ర నుంచి సాహిత్యరచనల వరకూ ఈ దేశంలో మేధా రంగాన్ని పూర్తిగా వారే ఆక్రమించేశారని వాపోతున్నారు. పరోక్షంగానైనా సరే వామపక్ష భావజాల ప్రభావాన్ని అంగీకరించినందుకు సంతోషమే. కానీ అదంతా రాజకీయ ప్రభావాలతో జరిగింది కాదనీ, మార్క్సిస్టు భావజాలనికి ఉన్న శాస్త్రీయత అందుకు కారణమని చెప్పకుండా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. ఉదాహరణకు చరిత్ర రచనలో వామపక్ష భావజాలం గలవారు ఉన్నందునే ఛాందసాలకు అతీతంగా భారత దేశ చరిత్రను నిర్మించుకోవడం సాధ్యమైంది. లేకపోతే పురాణాలే చరిత్రగా చలామణిలోకి వచ్చేవి. అలాగే శాస్త్ర పరిశోధనా రంగంలో గజముఖుడికి ప్లాస్టిక్‌ సర్జరీ చేశారనీ, గాంధారీ దేవి పిండం ముక్కలైతే ఇంక్యుబేషన్‌లో పెట్టి కౌరవులను పుట్టించారనీ, కుంతీదేవి సర్రోగసీతో పిల్లలను కన్నదనీ తోచిన భాష్యాలు చెప్పి ఒప్పుకోమంటారు. ఇవి పురాణ విశ్వాసాలకు, శాస్త్రీయ విజ్ఞానానికి కూడా విరుద్ధమైన విపరీతాలు. ఇలాటి వాటిని ఖండించడానికి కమ్యూనిస్టులే అవసరం లేదు- కాస్త ఇంగితజ్ఞానముంటే చాలు. శేఖర్‌ కపూర్‌ అనే ఒక సంపాదకుడైతే మరింత ముందుకు పోయి అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి కమ్యూనిస్టులేమీ చేయలేదని ఆరోపించేందుకు సిద్ధపడ్డాడు. అసలీ దేశంలో కాంగ్రెస్‌ గుత్తాధిపత్యానికి గండి కొట్టింది కమ్యూనిస్టులేననీ, అత్యవసర పరిస్థితిలో సిపిఎం బలమైన పశ్చిమ బెంగాల్‌లో ఆ పార్టీ కార్యకర్తలు వందలమంది ప్రాణాలు కోల్పోయారనీ ఈ మహా మేధావికి తెలియకపోవడం దారుణం. ఇప్పుడు కూడా అదే బెంగాల్‌లో అదే తరహా హత్యాకాండ సాగుతున్నా వీరు ఉపేక్ష వహించడం వెనక రహస్యమిదే.
ఇప్పుడు జరిగే నిరసన మొత్తం నెహ్రూ నాటి ఉదార వాద వారసత్వమనీ, అది గాంధీ కుటుంబ ఆధిపత్యంలో నడుస్తుందనీ చెప్పడానికి బిజెపి తంటాలు పడుతున్నది. వాస్తవమేమంటే అది స్వాతంత్య్ర పోరాటం నాటి జాతీయ సమైక్యతా భావన కొనసాగింపు. ఆరెస్సెస్‌కు స్వాతంత్య్ర పోరాట స్రవంతితో సంబంధం లేదు. మత రాజకీయమే వారి సిద్ధాంతం. కనక దాని మానస పుత్రులకు రెచ్చగొట్టి చిచ్చుపెట్టే మాటలు వేదవాక్కులుగానూ, శాంతి సామరస్యాలు చెబితే కమ్యూనిస్టు సిద్ధాంత బోధలుగానూ వినిపించి కంపరమెత్తిస్తాయి. అంతటితో ఆగక దాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్‌తో ముడివేసి చూపాలనుకోవడం మరింత కుటిలత్వమే. బీహార్‌ ఫలితాలతో నిమిత్తం లేకుండా దేశమంతటా ఆలోచనాపరులు దీన్ని ఇప్పటికే తిరస్కరించడం సంతోష కారణం. అక్కడ వారు ఓడిపోతే మరింత తీవ్ర తిరస్కరణ ఎదురైనట్టు భావించాలి. కన్నులొట్టపోయి బయిటపడినా దుందుడుకు చర్యలకు కళ్లెం పడకతప్పదు. అదే సమయంలో ఈ ఫలితాల నుంచి ప్రాంతీయ పార్టీలూ తమ పాఠాలు నేర్చుకునే అవసరముంటుంది.
తెలకపల్లి రవి