కాలేజీ తరలింపుపై పెల్లుబుకిన ఆగ్రహం

 పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల స్థలంలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించేందుకు 99 ఏళ్లు లీజుచిచ్చి పట్టణ నడిబొడ్డున ఉన్న కళాశాలను ఊరిచివరకు తరలించడం దారుణమని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ధ్వజమెత్తాయి. ఈ మేరకు తాలుకా సెంటర్‌లోని గుంటూరు-మాచర్ల ప్రధాన రహదారిపై మంగళవారం రాస్తారోకో చేపట్టారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు గద్దె చలమయ్య మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాభివృద్ధికి చర్యలు తీసుకోపోగా పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న కళాశాలను తరలించాలనుకోవడం సరికాదన్నారు. దుకాణాలు, వ్యాపారులు, వ్యక్తుల వద్ద అధికార పార్టీ నాయకులు బెదిరింపు వసూళ్లకు పాల్పడడమే కాకుండా ఏకంగా కళాశాల స్థలాన్నే కొద్ది మందికి కట్టబెట్టే చర్యలకు పూనుకోవడాన్ని ప్రజలు భరించలేరన్నారు. సత్తెనపల్లి పరిసరాల్లోని ఐదు వేలమంది ఇదే కాలేజీలో ఇంటర్‌ చదువుతున్నారని, అయినా కాలేజీని పట్టణానికి చివర అసౌకర్యంగా ఉన్న ప్రాంతానికి తరలించాలనుకోవడం సరికాదన్నారు. ఒకరకంగా ఇది పేదలను చదవొద్దు అనే సంకేతమివ్వడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇదే కాలేజీ స్థలంలో షాపులు నిర్మించేందుకు రహస్యంగా జడ్‌పిలో తెచ్చిన లీజు అగ్రిమెంట్లను సైతం విద్యార్థి, యువజన సంఘాలు ఐక్యంగా తిప్పికొట్టిన అంశాన్ని గుర్తుచేశారు.