కాలుదువ్వితే దీటైన జవాబిస్తాం

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా దీనానగర్‌లో భీకర దాడికి పాల్పడి ఎస్పీ సహా ఏడుగురిని కాల్చిచంపడంపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో స్పందించారు. పాకిస్తాన్‌తో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని, అయితే భారతదేశ ప్రతిష్ఠను సవాలు చేస్తే పాక్‌కు గట్టిగా బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. సిఆర్‌పిఎఫ్ 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు సోమవారం మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌కు వచ్చిన రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, పాక్‌తో భారత్ సత్సంబంధాలను కోరుకుంటున్నప్పటికీ ఇటువంటి సీమాంతర తీవ్రవాద ఘటనలు పదే పదే ఎందుకు కొనసాగుతున్నాయో అర్థం కావడం లేదన్నారు. భారత్ తనంతట తాను తొలుత ఎవరిపైనా దాడికి పాల్పడబోదని, అయితే దీనిని అలుసుగా తీసుకుని భారత్‌పై ఎవరైనా దాడికి దిగితే దీటైన జవాబిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.