కార్మిక సమ్మెకు సర్వం సిద్ధం..

సెప్టెంబర్‌ 2న 24 గంటల పాటు జరిగే సార్వత్రిక సమ్మెకు దేశంలోని అన్ని రంగాలకు చెందిన వారు సన్నద్ధమయ్యారు. 1991 నుంచి అధికార పక్షాలు చేపట్టిన నయా ఉదారవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా జరిగే 16వ సార్వత్రిక సమ్మె ఇది. 11 కేంద్ర ట్రేడ్‌ యూనియన్లు, జాతీయ సమాఖ్యలు సంయుక్తంగా చేపట్టే నాలుగవ సమ్మె ఇది. సమ్మె పూర్తి విజయవంతం అవడానికి కావలసిన అన్ని చర్యలూ తీసుకున్నట్లు దేశం నలుమూల నుంచి అందిన సమాచారం తెలియజేస్తోంది. కేంద్ర ట్రేడ్‌ యూనియన్లు: కేంద్ర ట్రేడ్‌ యూనియన్లు అన్నీ తమ జాతీయ స్థాయి సమావేశాలను నిర్వహించాయి. స్వతంత్రంగా, సంయుక్తంగా చేపట్టవలసిన కార్యక్రమాల గురించి ఉద్ధృతంగా ప్రచారం చేశాయి. అన్ని ట్రేడ్‌ యూనియన్లకు చెందిన రాష్ట్ర స్థాయి సమావేశాలను కూడా జరిపినట్లు సమాచారం అందింది. 
రాష్ట్ర స్థాయి సమావేశాలు: పశ్చిమ బెంగాల్‌ మొదలుకొని అన్ని రాష్ట్రాలు సంయుక్త సమావేశాలు జరిపాయి. అన్ని యూనియన్లు, సమాఖ్యలు సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని ఆ సమావేశంలో పిలుపునిచ్చారు. సిటియుకు చెందిన జాతీయ నాయకులు రాష్ట్రాల్లో జరిగిన సమావేశాలకు హజరయ్యారు. సమావేశానికి హాజరైన వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సమావేశాలన్నీ ప్రాంతీయ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో జరగడం గమనించాల్సిన విషయం