కార్మిక వ్యతిరేక జిఒ 279ని రద్దు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేకిగా వ్యవహరిస్తుందని, మున్సిపల్‌ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు అన్యాయం చేసే జిఒ 279ని రద్దు చేయాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సిఐటియు) జిల్లా అధ్యక్షులు ఆది నికల్సన్‌ డిమాండ్‌ చేశారు.జిఒ 279ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సిఐటియు) ఆధ్వర్యంలో గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నికల్సన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పించుకునేందుకు ఈ జిఒ తీసుకువచ్చిందన్నారు. జిఒ అమలులోకి వస్తే ప్రభుత్వానికి, కార్మికులకు సంబంధం లేకుండా పోతుందని తెలిపారు. మున్సిపాల్టీల్లో రోడ్లు ఊడ్చేందుకు యంత్రాలను వినియోగిస్తే కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. జిఒను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఫిబ్రవరి 4వ తేదీన జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముట్టడిస్తామని, కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని కలెక్టరేట్‌ ముట్టడిని జయప్రదం చేయాలని ఆయన కోరారు. సిఐటియు నగర ఉపాధ్యక్షులు బి. ముత్యాలరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో పారిశుధ్య సక్రమంగా లేకపోవటంతో విదేశీ పెట్టుబడులు రావటం లేదనే సాకు చెబుతుందని , ఇదిసరికాదన్నారు. 20 ఏళ్ల నుండి ఇదే కార్మికులు పని చేస్తున్నారని, ఇప్పటి వరకూ పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టలేదా అని ప్రశ్నించారు. ఈ పద్ధతి అమలులోకి వస్తే కాంట్రాక్టరు ఇస్టానుసారం వ్యవహరిస్తారని, కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. వెంటనే ప్రభుత్వం ఈజిఒను ఉపసంహరించుకోవాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు సోమి శంకరరావు, ఏటుకూరు రోశమ్మ, జి. కోటేశ్వరరావు, శంకర్‌, వెంకటలక్ష్మి, ఏసుమ్మ, శుక్లా పాల్గొన్నారు.