
పారిస్‌లో 1945 అక్టోబరు 3న స్థాపించ బడ్డ ప్రపంచ కార్మిక సమాఖ్య (డబ్ల్యుఎఫ్ టియు) దిగ్విజయంగా 70 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. కార్మిక వర్గ అంతర్జాతీయ తకు, ప్రపంచ కార్మికోద్యమ ఐక్యతకు కృషి చేస్తున్న వారు సాధించిన విజయం ఇది. రాజకీ య లేదా కార్మిక సంఘాల అనుబంధాలతో నిమిత్తం లేకుం డా కార్మికవర్గ ప్రయోజనాల ఆధారంగా కార్మికులందరినీ ఒక తాటి మీదకు తేవటం డబ్ల్యుఎఫ్‌టియు విశిష్టత. ఐక్యతకు, నియంతృత్వ వ్యతిరేక ఉమ్మడి పోరాటాలకు, శాంతి స్థాపన కృషికి, వలస ప్రజల విముక్తి పోరాటాలకు, మెరుగైన జీవన పరిస్థితుల కోసం జరిగే పోరాటాలకు, దోచుకునే బహుళజాతి కంపెనీలకు, యుద్ధోన్మాదులకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడ్డ యుద్ధాలకు డబ్ల్యుఎఫ్‌టియు ప్రతిరూపమని సంస్థాపక మహాసభలో ఎన్నికైన ప్రధాన కార్యదర్శి లూయిస్ సైల్లెంట్ ప్రకటించారు.
వర్గ సామరస్యాన్ని కోరుకునే శక్తులు 1949 డిసెంబరులో డబ్ల్యుఎఫ్‌టియు నుంచి విడగొట్టుకుని లండన్‌లో స్వతంత్ర కార్మిక సంఘాల అంతర్జాతీయ సమా ఖ్యను (ఐసిఎఫ్‌టియు)ను ప్రారంభించాయి. డబ్ల్యుఎఫ్ టియు, ఐసిఎఫ్‌టియుల మధ్య సైద్ధాంతిక విబేధాలు న్నాయి. సోషలిస్టు వ్యవస్థతో కూడిన నూతన ప్రపంచాన్ని డబ్ల్యుఎఫ్‌టియు కోరుతుండగా, పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థను రక్షించాలన్న కార్యక్రమానికి ఐసిఎఫ్ టియు కట్టుబడి ఉంది. అయినప్పటికీ 2006 నవంబరులో రెండు సమాఖ్యలూ కలసి అంతర్జాతీయ ట్రేడ్ యూనియన్ల సమాఖ్య (ఐటియుసి) ను ఏర్పర్చాయి. ఐటియుసికి విరుద్ధం గా, సామ్రాజ్యవాద పాలకుల సాధనాలైన ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, అంతర్జాతీయ వాణిజ్య సంస్థల ప్రజావ్యతిరేక, కార్మికవ్యతిరేక విధానాలపై డబ్ల్యుఎఫ్‌టియు తీవ్రంగా పోరాడుతోంది.
ఆఫ్రికా, ఆసియా, లాటిన్
అమెరికా ప్రజలకు సంఘీభావం
సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం డబ్ల్యుఎఫ్‌టియు సంస్థాపక లక్ష్యం. జాతీయ విముక్తి, మానవహక్కులు, ట్రేడ్‌యూనియన్ హక్కులు, ప్రజానుకూల సమాజ మార్పుల కోసం జరిగే పోరాటాలకు అది కట్టుబడి ఉంది. యుద్ధాన్ని వ్యతిరేకిస్తుంది. శాంతిని కాంక్షిస్తుంది. వలస దేశాల్లో జరుగుతున్న విముక్తి పోరాటాలకు సంఘీభావంగా ఉద్యమాలు నడిపింది. ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు ప్రాధాన్యతనిచ్చింది. ఆఫ్రికా, ఆసియా, మధ్యధరా, లాటిన్ అమెరికాలోని అభివృద్ధి చెందుతోన్న దేశాల ప్రజా ఉద్యమాల్లో గణనీయమైన పాత్ర పోషిస్తోంది. ఆఫ్రికా, మధ్యధరా దేశాల సార్వభౌమత్వ హక్కులపై అమెరికా, దాని మిత్రులైన సామ్రాజ్యవాదశక్తులు చేస్తున్న అమానవీయ దాడులను గట్టిగా, బాహాటంగా డబ్ల్యుఎఫ్‌టియు వ్యతిరేకిస్తున్నది. పాలస్తీనా, ఆఫ్రికా, అరబ్ దేశాల ప్రయోజనాలను కాపాడేందుకు సంఘీభావ కార్యక్రమాలు చేస్తున్నది. ఫలితంగా ఈ దేశాల్లోని అనేక కార్మిక సంఘాలు డబ్ల్యుఎఫ్‌టియులో చేరుతున్నాయి. యూరప్‌లో కూడా పెద్ద ఎత్తున సంస్థాగత పరిణామాలు చోటు చేసుకుంటున్న కారణంగా ముఖ్యమైన కార్మిక సమాఖ్యలు కూడా డబ్ల్యుఎఫ్‌టియులో భాగస్వాములవుతున్నాయి.
ట్రేడ్ యూనియన్ ఇంటర్నేషనల్స్ (టియుఐ)
డబ్ల్యుఎఫ్‌టియు నిర్మాణంలో ట్రేడ్ యూనియన్ ఇంటర్నేషనల్స్ అంతర్భాగంగా ఉన్నాయి. ఇవి వేటికవి విడివిడిగా నిబంధనలను కలిగి ఉన్నప్పటికీ వీటి లక్ష్యాలు డబ్ల్యుఎఫ్‌టియు లక్ష్యాలకు, విధానాలకు అనుగుణంగా ఉంటాయి. పది పారిశ్రామిక, సర్వీసు రంగాలకు ట్రేడ్‌యూనియన్ ఇంటర్నేషనల్స్ ఉన్నాయి.
ప్రాంతీయ, అంతర్జాతీయ కార్మిక సంఘాల వేదికలకు సహకారం
సామ్రాజ్యవాద వ్యతిరేక వైఖరి కలిగి ఉన్నందున, అరబ్ ట్రేడ్ యూనియన్ అంతర్జాతీయ సమాఖ్య (ఐసిఎటియు), ఆఫ్రికా ట్రేడ్ యూనియన్ల ఐక్యతా వేదిక (ఒఎటియుయు), ఆల్ ఆఫ్రికన్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ (ఎఐటియుఎఫ్) లతో డబ్ల్యుఎఫ్‌టియు స్నేహ, సహకార సంబంధాలను ఏర్పర్చుకుంది. అన్ని చైనా ట్రేడ్ యూనియన్ల సమాఖ్యలతో కూడా సహకార సంబంధాలను ఏర్పర్చుకునేందుకు డబ్ల్యుఎఫ్‌టియు ప్రాముఖ్యతనిచ్చింది.
నయా ఉదారవాద విధానాలపై పోరు
సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో భాగంగా ఫైనాన్స్ పెట్టుబడి రుద్దుతున్న నయా సరళీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ డబ్ల్యుఎఫ్‌టియు అనుబంధ సంఘాలు సమ్మెలతో సహా మిలిటెంట్ పోరాటాలను నిర్వహిస్తున్నాయి. లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలో ప్రారంభమైన పోరాటాలు చివరికి యూరప్, అమెరికాలకు కూడా పాకి కోట్లాది మంది కార్మికులు వీధుల్లోకి వస్తున్నారు. డబ్ల్యుఎఫ్‌టియు తన సైద్ధాంతిక బలాన్ని అందిస్తూ ఈ పోరాటాలకు నాయకత్వం వహిస్తున్నది.
15వ మహాసభ అనంతర పోరాటాలు
క్యూబా రాజధాని హవానాలో జరిగిన 15వ మహాసభ తర్వాత నిర్మాణాన్ని పటిష్టంచేసే, ప్రజాస్వామ్యాన్ని విస్తృత పర్చే, అంతర్జాతీయ కార్మిక పోరాటాలకు సంబంధించిన అన్ని సమస్యలపై కార్యాచరణను తీవ్రం చేసే పనిలో డబ్ల్యుఎఫ్‌టియు నిమగమయింది. అంతర్జాతీయ సంఘీభావాన్ని పెంపొందించేందుకు 2009 నుంచి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవాన్ని జరుపుతున్నది. ఉమ్మడి సమస్యలపై ఉమ్మడి నినాదంతో ఆందోళన, ప్రచారం, కార్యాచరణల ద్వారా ఈ దినోత్సవం జరుగుతున్నది. ఈ కార్యాచరణ దినోత్సవ ప్రాశస్త్యం, దానిలో పాల్గొనటం గణనీయంగా పెరుగుతున్నది.
తృతీయ ప్రపంచ దేశాల్లోని ప్రపంచవాణిజ్య సంస్థ కార్యాలయాలను మూసివేయాలని కోరుతూ 2007లో ప్రదర్శన నిర్వహించింది. పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ఇజ్రాయిల్ ఓడలను మూడు రోజులపాటు బహిష్కరించాలని పిలుపునిచ్చింది. ఇజ్రాయిల్ జైళ్ళలో ఉన్న పాలస్తీనా రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని కోరుతూ అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవం జరిపింది. తక్కువ ధరల్లో పోషకాహారం అందించాలని కోరుతూ రోమ్‌లోని ఎఫ్‌ఎఒ (ఆహార, వ్యవసాయ అంతర్జాతీయ సంస్థ) కేంద్ర కార్యాలయం ముందు జరిపిన ప్రదర్శన, 2015లో ఇటలీ, గ్రీస్, సైప్రస్ దేశాల్లో వలస కార్మికుల హక్కుల కోసం జరిపి ప్రదర్శనలు డబుఎఫ్‌టియు నిర్వహించిన కార్యక్రమాల్లో మరికొన్ని.
ప్రాంతీయ, జాతీయ స్థాయిల్లో సెమినార్లు, ట్రేడ్ యూనియన్ విద్య, కేంద్ర కార్యాలయాల్లో ట్రేడ్ యూనియన్ శిక్షణా పాఠశాలలు నడపటం ద్వారా డబ్ల్యుఎఫ్‌టియును సైద్ధాంతికంగా పటిష్టం చేసే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతున్నది. శ్రామిక మహిళలు, యువ కార్మికులు ఈ ప్రక్రియలో ప్రాధాన్యత పొందుతున్నారు. కార్మికోద్యమం ఎదుర్కొనే కీలక సమస్యలపైనా, ప్రజా పోరాటాలకు సంఘీభావంగా అంతర్జాతీయ మహాసభలు నిర్వహించబడుతున్నాయి.
అనుభవాలను పంచుకునేం దుకు, ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించుకునేందుకు, అంతర్జాతీయ సంఘీభావాన్ని వ్యక్త పర్చేందుకు, నిర్మాణాన్ని పటిష్టపర్చుకునేందుకు ఈ చొరవ దోహద పడుతున్నది. ప్రపంచ పెట్టుబడిదారీ సంక్షోభాన్నీ, వలసల సమస్యనూ, యువత, మహిళా హక్కులనూ, కొలంబియా, పాలస్తీనా, వెనిజులా, క్యూబా, లెబనాన్, సిరియా, సూడాన్ మొదలగు దేశాల అంతర్గత సమస్యల్లో సామ్రాజ్యవాదుల జోక్యం, తదితర అంశాలపై తన అనుబంధ సంఘాలతో కలిసి అటువంటి ముఖ్యమైన మహాసభలను నిర్వహించింది. అంతర్జాతీయ సంస్థల్లో డబ్ల్యుఎఫ్‌టియు హాజరు, దాని ప్రభావం పెరిగింది. ప్రతి సంవత్సరం జరిగే అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) మహాసభల వద్ద డబ్ల్యుఎఫ్‌టియు విస్త ృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
ఉన్నత ఆశయాలు
ఉత్పత్తి సాధనాలను సమాజపరం చేసి సోషలిస్టు సమాజాన్ని స్థాపిస్తేనే కార్మికవర్గంపై దోపిడీ అంతమవు తుందని డబ్ల్యుఎఫ్‌టియు నమ్ముతుంది. సోషలిస్టు భావాలను సమున్నతంగా నిలబెడుతూ దోపిడీ నుంచి సమాజాన్ని విముక్తి చేయటానికి డబ్ల్యుఎఫ్‌టియు కట్టుబడి ఉంది. వర్గ సామరస్యం వైపు కార్మిక వర్గాన్ని నడిపించాలనే ప్రయత్నాలను వమ్ముచేస్తోంది. కార్మికవర్గ ప్రయోజనాలకు, సమాజ అభివృద్ధికి, మానవాళి ఉన్నత లక్ష్యాలకు కట్టుబడి ఉన్నందునే అంతర్జాతీయ ట్రేడ్ యూనియన్ రంగంలో డబ్ల్యుఎఫ్‌టియు చెరగని ముద్రవేసింది.
70వ వసంతోత్సవాన్ని జరపాలి
డబ్ల్యుఎఫ్‌టియు స్థాపించి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వివిధ కార్యక్రమాలు జరపాలని 2015 జూన్ 6-7 తేదీల్లో జెనీవాలో జరిగిన డబ్ల్యుఎఫ్‌టియు కౌన్సిల్ నిర్ణయించింది. 2015 అక్టోబరు 3న బ్రెజిల్‌లో డబ్ల్యుఎఫ్‌టియు నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధులు హాజరయ్యే కేంద్ర కార్యక్రమం జరుగుతుంది. ప్రజల సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడుతున్నాయి. గ్రీస్‌లో డబ్ల్యుఎఫ్‌టియు అనుబంధ కార్మిక సంఘమైన 'పామే' 2015 ఏప్రిjల్ 26న ఏథెన్స్ నగర ఒలింపిక్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి 5 వేల మందికిపైగా హాజరయ్యారు. వారిలో సుమారు 2 వేల మంది యువతీ యువక కార్మికులున్నారు. డబ్ల్యుఎఫ్‌టియు అంతర్జాతీయ కేంద్ర కార్యాలయం ఈ నగరంలోనే ఉంది.
15వ మహాసభ తర్వాత డబ్ల్యుఎఫ్‌టియుతో సిఐటియు సంబంధాలు బలపడ్డాయి. డబ్ల్యుఎఫ్‌టియుతో సిఐటియు అనుబంధమైన తర్వాత సిఐటియు అనుబంధ సంఘాలకు, మిత్ర సంఘాలకు అనేక రకాల బాధ్యతలను డబ్ల్యుఎఫ్‌టియు ఇచ్చింది. డబ్ల్యుఎఫ్‌టియు సెక్రెటేరియట్, కౌన్సిల్, వివిధ ట్రేడ్ యూనియన్ ఇంటర్నేషనల్స్‌లో సిఐటియు పాత్ర పెరిగింది. వర్గ పోరాట సిద్ధాంతానికి, కార్మికవర్గ అంతర్జాతీయతకు కట్టుబడి ఉన్నందునే సిఐటియుకు ఈ గుర్తింపు వచ్చింది. 2015 అక్టోబరు 3న వివిధ స్థాయిల్లో సిఐటియు సెమినార్లు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తుంది.
- (సిఐటియు ఆలిండియా కేంద్రం నుంచి)
(డబ్ల్యుఎఫ్‌టియు 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా)