కార్మికసంఘాలకు దేశవ్యాప్త సమ్మెకు సిపిఎం మద్దతు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా విజయవాడలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది కార్మికులు ముందు రథం సెంటర్‌కు చేరుకు న్నారు. అక్కడి నుంచి ర్యాలీలో కార్మికులు చీమల దండులా కదిలారు. దీంతో బెడవాడ ఎర్రబారింది. ప్రజానాట్య మండలి కళాకారుల పాటలు, డప్పు కళాకారుల వాయిద్యాలు కార్మికులను ఉత్సాహపరి చాయి. ఫ్లైఓవర్‌ మీదుగా సాగిన ర్యాలీ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు కొనసాగింది. సిఐటియు, ఏఐటి యుసి, ఐఎప్‌టి యు, టియుసిసి, వైఎస్‌ఆర్‌టియుసి, ఐఎన్‌టియుసి, ఏఐసిసిటియుసి, ఐఎఫ్‌టియు తదితర కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు ఈ ర్యాలీకి అగ్రభాగాన ఉండి నడిపించారు. సిపిఎం, సిపిఐ రాష్ట్ర కమిటీలు ఈ ర్యాలీకి స్వాగతం పలికి ర్యాలీలో పాల్గొన్నారు.
కార్మికుల హక్కులకు ప్రమాదం: మధు
సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద ర్యాలీని ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత పోరాటం చేసి సాధించుకున్న కార్మికుల హక్కులకు ప్రమాదం వచ్చిందన్నారు. బ్రిటిష్‌ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం జరిగినట్టే, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించేందుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం సాగాలని పిలుపునిచ్చారు. పెట్టుబడిదారీ యాజమాన్యాలకు తొత్తులాగా నరేంద్రమోడీ, చంద్రబాబులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బిజెపి అధికారంలో ఉన్న రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో కూడా కార్మిక హక్కుల చట్టానికి సవరణలు తీసుకొచ్చారని చెప్పారు. ఈ సమ్మె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక అని వ్యాఖ్యానించారు. గత బడ్జెట్‌ సమావేశాల్లో చడీ చప్పుడు లేకుండా కార్మిక హక్కులను హరించే చట్టాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి బెంజ్‌ సర్కిల్‌లో సభలు నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతి ఇస్తున్నారని, కార్మికులు స్వరాజ్‌ మైదానంలో సభ నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదని విమర్శించారు. మరో స్వాతంత్య్ర పోరాటం కోసం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ ఉప సంహరించుకుంటున్న భూ సేకరణ ఆర్డినెన్స్‌ ప్రకారం కృష్ణా జిల్లాలో వేల ఎకరాలను కబ్జా చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నా రని విమర్శించారు. రాబోయే రోజుల్లో భూ సమస్యలపై రైతులు, కార్మికులు అంతా ఏకమై రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ప్రజలపై ఉక్కుపాదం మోపుతున్నాయని విమర్శించారు. దేశ వ్యాప్తంగా కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని ఇప్పటికేనా నరేంద్రమోడీ కళ్లు తెరవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిహెచ్‌ బాబురావు, సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాధ్‌, సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు