కార్పొరేట్‌ అనుకూల విధానాల్లో టిడిపి ప్రభుత్వ ముందంజ

కార్పొరేట్‌ కంపెనీలు సులు వుగా వ్యాపారం చేసుకునే అవకా శాలు కల్పించిన రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. ఈ అవకాశాలు కల్పించడానికి అవసర మైన సంస్కరణలు అమలు చేస్తున్న క్రమంలో కార్మికులు, రైతులు, సామాన్య ప్రజల ప్రయో జనాలు సమిధలవుతున్నాయి. కార్పొరేట్‌ అనుకూల సంస్కరణల అమలులో బిజెపి, తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి ఆరు స్థానాల్లో ఉన్నాయి. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్కరణల అమలు బాగా స్పీడందుకుంది. ప్రపంచ బ్యాంకుతో ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడుకున్న బంధం దీనికి తోడయింది. ఈ సంస్కరణల సునామీలో కొట్టుకుపోకుండా నిలబడగల గాలంటే ప్రపంచబ్యాంకు సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడటం తప్ప మరో మార్గం లేదు.
ప్రపంచ బ్యాంకు బాటలో
అంతర్జాతీయ మార్కెట్‌లో నిలబడటానికి భారత్‌ చేసే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని 2014లో ప్రధాని మోడీ కోరిందే తడవుగా ప్రపంచబ్యాంకు రంగంలోకి దిగింది. భారతదేశంలో వ్యాపారం పెరగటానికి చట్టాలు ఆటంకంగా ఉన్నాయని, సంస్కరణలు అవసరమని ప్రపంచబ్యాంకు సిఫార్సు చేసింది. చట్టాలు ఆటంకంగా ఉండటాన, తేలికగా వ్యాపారం చేసుకోగలిగే అంశంలో మొత్తం 189 దేశాల్లో భారతదేశం అట్టడుగున 142వ స్థానంలో ఉందని ప్రపంచబ్యాంకు పేర్కొంది. అందుకని కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో వేగంగా సంస్కరణలు అమలు చేయాలని సిఫార్సు చేసింది. భారతదేశ ప్రభుత్వంతో అనేక సంవత్సరాలుగా పని చేస్తున్నప్పటికీ, సంస్కరణల అమలు గత సంవత్సర కాలంగా మాత్రమే బాగా పుంజుకుంటు న్నదని, దీనికి తేలికగా వ్యాపారం చేసుకోవటానికి అవకాశాలు కల్పిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నమే కారణమని ప్రపంచబ్యాంకు పేర్కొంది. గత సంవత్సర కాలంగా మోడీ ప్రభుత్వం తను సంస్కరణలు అమలు చేయటమేగాక, రాష్ట్రాలను కూడా సంస్కరణలు అమలు చేసేలా ప్రోత్సహించటం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. 2014 డిశంబరులో కేంద్రం, రాష్ట్రాలు పాల్గొన్న వర్క్‌ షాపులో 98 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. జూన్‌ 2015న ప్రణాళిక అమలుకు అంచనా వేయాలని నిర్ణయించారు. దీన్లో భాగంగానే ఇప్పుడు ప్రపంచబ్యాంకు నివేదిక వెల్లడయింది.
భూ సేకరణ చట్టానికి సవరణలు
ప్రపంచబ్యాంకు కార్యాచరణ ప్రణాళికలో భాగంగానే 2013లో అందరి ఆమోదంతో రైతులకు లాభదాయంగా ఉండే విధంగా తెచ్చిన భూ సేకరణ చట్టాన్ని మారుస్తూ మోడీ ప్రభుత్వం ఆర్డినెన్సు మీద ఆర్డినెన్సులు తెచ్చింది. ప్రతిపక్షాల వ్యతిరేకత వల్ల రాజ్యసభలో ఆమోదం పొందటం సాధ్యం కాదని తెలిసినా తన ప్రయత్నాన్ని చివరిదాకా విరమించుకోలేదు. టిడిపి ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రానికి మద్దతునిచ్చింది. పార్లమెంటుకు లోపలా, బయటా 2013 చట్ట మార్పులకు వ్యతిరేకంగా పెద్ద పోరాటం జరగటంతో ఆర్డినెన్సును తిరిగి జారీ చేయలేదు. తమ వ్యాపారాలు అభివృద్ధి చేసుకునేందుకు ఈ చట్టం ఆటంకంగా ఉందని కార్పొరేట్‌ సంస్థలు భావించి దీన్ని సంస్కరించాలని డిమాండ్‌ చేయగానే మోడీ ప్రభుత్వం దీన్లో మార్పులు చేస్తూ ఆర్డినెన్సు తెచ్చింది. రైతుల ఆమోదం నుంచి, సమాజంపైపడే ప్రభావం అంచనా వేసే బాధ్యత నుంచి మినహాయింపులు ఇచ్చింది. తను అనుకున్న మార్పులు రాష్ట్రాల ద్వారా చేయించాలని, లేదంటే జాయింట్‌ పార్లమెంటు సమావేశం పెట్టి బిల్లు పాస్‌ చేయాలని ప్రయత్నిస్తున్నది. బీహార్‌ ఎన్నికల తర్వాత దీనిపై ముందుకు వెళ్ళే ప్రమాదం ఉంది.
రాష్ట్ర టిడిపి ప్రభుత్వం విదేశీ, స్వదేశీ పరిశ్రమల కోసం ఏడున్నర లక్షల ఎకరాలకు పైగా భూమిని సేకరించాలని నిర్ణయించింది. దీనిలో ప్రభుత్వ, అసైన్డ్‌, దేవాదాయ, అటవీ భూములతో పాటు రైతుల భూములను తీసుకోవా లనుకున్నది. ఇంత పెద్ద ఎత్తున భూమి సేకరిస్తే ప్రభుత్వ, దేవాదాయ, అటవీ భూములను సాగుచేసుకుంటున్న రైతులు తమ ఉపాధి కోల్పోతారు. 2013 చట్ట ప్రకారం రైతుల ఆమోదం లేకుండా, పాదర్శకత లేకుండా ప్రభుత్వం భూమిని తీసుకునే అవకాశంలేదు. అయినా రైతుల ప్రయివేటు భూములను తీసుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులను మభ్య పెట్టి, ప్రలోభపెట్టి, భయపెట్టి లొంగదీసుకుంటున్నది. పారదర్శకత ఎక్కడాలేదు. అఖిల పక్ష సమావేశాలు వేసి చర్చించిన దాఖలాలు లేవు. పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి పెరుగుదలకు భూములు అవసరంకావొచ్చు. ఏ భూములు తీసుకోవాలి? ఏవి తీసుకోకూడదు? రైతుల ఆమోదం, సమాజంపై పడే ప్రభావం, పారదర్శకత, నష్టపరిహారం, భాగస్వామ్యం, పునరావాసం, తదితర అంశాలన్నీ ఉన్న 2013 చట్ట ప్రకారం మాత్రమే ప్రభుత్వం భూములు తీసుకోవాలి. తీసుకున్న భూముల్లో పరిశ్రమలు పెట్టకపోతే రైతులకు తిరిగి స్వాధీనం చేయాలని కూడా 2013 చట్టంలో ఉంది. ఈ చట్టం ప్రకారం చేస్తేనే అవసరానికి మించి భూములు సేకరించే వీలులేకుండా పోతుంది. కాగా, పరిశ్రమలకు భూముల కేటాయింపు, నిర్మాణ అనుమతులకు సంబంధించిన సంస్కరణల అమలు జాతీయ సరాసరి 34.57 శాతం ఉండగా, రాష్ట్రానికి అధికంగా 62.16 శాతం మార్కులు వచ్చాయి. దీన్నిబట్టే రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూములను అవసరాలకు మించి లాక్కుంటున్నదని అర్థమవుతుంది. బిజెపి పాలిత మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌ల తర్వాతి స్థానం టిడిపి ప్రభుత్వానిదే.
కార్మిక హక్కుల కత్తిరింపు
2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే కార్మిక చట్టాల్లో మార్పులు చేయటం ప్రారంభించింది. రాష్ట్రాలను కూడా కార్మిక సంస్కరణల అమలుకు ప్రోత్సహించింది. రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర బిజెపి ప్రభుత్వాలతో పాటు రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం పోటీపడి ముఖ్యమైన కార్మిక చట్టాల్లో మార్పులు చేసింది. కేంద్రంలో, రాష్ట్రంలో చేసిన మార్పుల పర్యవసానంగా ముఖ్యమైన 16 చట్టాల అమలు నుంచి అత్యధిక పరిశ్రమలు తప్పించుకునే అవకాశం వచ్చింది. రాష్ట్ర టిడిపి ప్రభుత్వం చేసిన సవరణలతో సమ్మె చేసే దారులన్నీ మూసుకుపోయాయి. ఈ భరోసాతోనే మా రాష్ట్రంలో అంతా ప్రశాంతంగా ఉంటుంది. మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండని ముఖ్యమంత్రి విదేశీ కార్పొరేట్‌ కంపెనీలకు హామీ ఇస్తున్నారు. తమ హక్కులను కాపాడుకునేందుకు సమ్మెలతో సహా కార్మికులు చేసే ఏ పోరాటాలనైనా చట్టాల ద్వారా అడ్డుకోవటం సాధ్యంకాదని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ముఖ్యమైన కార్మిక చట్టాలను అమలు చేస్తున్నామంటూ యజమానులు సొంతగా సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే సరిపోయే విధంగా కేంద్రంలో, రాష్ట్రంలో మార్పులు చేసి దొంగకే తాళం ఇచ్చారు. పారిశ్రామికవేత్తలకు కావల్సినవన్నీ అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక హక్కులను మాత్రం అమలు చేయకుండా నిలిపివేస్తున్నది. ప్రపంచ బ్యాంకు రాష్ట్రానికి రెండో ర్యాంకు ఇచ్చినదానికి కారణాల్లో పెట్టుబడిదారులకు సౌలభ్యం కల్పించటం, కార్మిక శ్రమ దోపిడీకి అవకాశం కల్పించటం ఉన్నాయి. కార్పొరేట్‌ కంపెనీలకు ఎక్కువగా నొప్పి తగలకుండా ముఖ్యమైన కార్మిక చట్టాలన్నిటి కింద ఒకే రిజిస్ట్రేషన్‌ చేయించుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇందుకనుగుణంగా చట్టంలో మార్పులు కూడా చేసింది. కార్మిక చట్టాల అమలును పరిశీలించటానికి అవసరమయిన తనిఖీలను నియంత్రించటంలో రాష్ట్రానికి మూడో స్థానం వచ్చింది. కంప్యూటర్‌ ఎంపిక చేసిన కొద్ది సంస్థల్ని మాత్రమే (లాటరీ పద్ధతిలో) తనిఖీ చేసే పద్ధతిని ప్రవేశ పెట్టిన కొద్ది రాష్ట్రాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఒకటి. కార్మికోద్యమం బలంగా ఉండి, వామపక్ష ప్రభుత్వాలు సుదీర్ఘకాలంపాటు అధికారంలో ఉన్న బెంగాల్‌, త్రిపుర, కేరళ రాష్ట్రాల్లో కార్మికుల పొట్టకొట్టి కార్పొరేట్లకు పెట్టే సంస్కరణలు అమలు కాకపోవటం గమనించాల్సిన అంశం. అందుకే ప్రపంచబ్యాంకు ప్రకటించిన ర్యాంకుల్లో బెంగాల్‌, కేరళ, త్రిపుర రాష్ట్రాలు వరుసగా 11, 18, 20 స్థానాల్లో వెనుకబడి ఉన్నాయి.
కార్మిక సంస్కరణలు అమలు చేస్తే పెట్టుబడులొస్తాయా?
కార్మికుల హక్కులను తొలగించినంత మాత్రానే పెట్టుబడులొస్తాయని పాలకులు నమ్మబలుకుతున్నారు. అమలు కాకుండా మిగిలిపోయినవి కార్మిక సంస్కరణలని, ఇవి పూర్తయితే 'మేక్‌ ఇన్‌ ఇండియా' కార్యక్రమం జయప్రదమవుతుందని చెపుతున్నారు. ఉపాధి పెరుగు తుందని ఉవ్విళ్ళూరుస్తున్నారు. రెండో స్థానం నుంచి మొదటి స్థానంలోకి వెళ్తామని, పెట్టుబడులు వచ్చి పడతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి ముచ్చటపడుతున్నారు. కానీ ప్రపంచబ్యాంకు ర్యాంకులను బట్టి పెట్టుబడులురావని ఆచరణలో తేలుతున్నది. విదేశీ పెట్టుబడులు వచ్చిన దాన్ని బట్టి రాష్ట్రాల స్థానాల్ని, ప్రపంచబ్యాంకు ర్యాంకులతో పోల్చి చూస్తే ఈ వాస్తవం బయటపడుతుంది.
పై గణాంకాలను విశ్లేషిస్తే కార్మికులు, రైతుల పొట్టగొట్టినంత మాత్రానే విదేశీ పెట్టుబడులు వచ్చిపడతాయనే అవగాహన తప్పనితేలుతుంది. స్వదేశీ, విదేశీ పెట్టుబడుల మొత్తం విషయంలో కూడా 2015 జనవరి నుంచి జులై వరకు ఏడు నెలల కాలంలో పెట్టుబడుల ప్రతిపాదనలలో ఆంధ్రప్రదేశ్‌ది 8వ స్థానం. ఇదే కాలంలో వాస్తవంగా ఉత్పత్తిలోకి వచ్చిన పెట్టుబడుల విషయంలో రాష్ట్రానిది 6వ స్థానం. కాబట్టి ప్రపంచబ్యాంకు ఇచ్చిన ర్యాంకును చూసి మురిసిపోవటం సరికాదు. కార్మిక శ్రమను మరింతగా దోచుకోవటానికి కార్మిక సంస్కరణలు ఉపయోగపడతాయి కాబట్టి వాటిని అమలు చేయాలని విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ కంపెనీలు డిమాండ్‌ చేస్తున్నాయి. 
అవి అమలయితే దేశంలో ఏ ప్రాంతానికి వచ్చినా శ్రమశక్తి సృష్టించే విలువలో ఎక్కువ వాటాను కొట్టేయొచ్చు. అందుకు కార్మికోద్యమాన్ని అణిచివేయాలని పాలకుల పన్నాగం. తన మనుగడకే ప్రమాదం వచ్చిన తర్వాత మూలకు నెట్టబడినపుడు పిల్లయినా తిరగబడుతుంది. బ్రిటిష్‌ ముష్కర పాలనకు వ్యతిరేకంగా దశాబ్దాల తరబడి పోరాడి కార్మిక హక్కులను చట్టం రూపంలో సాధించిన అనుభవం కార్మికోద్యమానికి ఉంది. స్వతంత్ర భారతంలో, ప్రజాస్వామ్య దేశంలో ఈ హక్కులను కాపాడుకోవటం అంత కష్టం కాబోదు.

ఎం ఏ గఫూర్ 
(వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర కార్యదర్శి)