కాయకల్ప చికిత్స..

రెపో రేట్లను అరశాతం తగ్గిస్తూ రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీసుకున్న నిర్ణయంతో కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఆర్థిక లావాదేవీలు పుంజుకుంటాయని చాలామంది ఆశిస్తున్నారు. ఊహించిన దానికన్నా ఎక్కువగా వడ్డీ రేట్లను తగ్గించడంతో పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. స్టాక్‌ మార్కెట్‌ కూడా ఈ దిశలోనే స్పందించింది. బుధవారం ఉదయం నుండి ఏ మాత్రం తడబాటు లేకుండా మార్కెట్‌ సూచీ పైకే ప్రయాణం చేయడం రిజర్వు బ్యాంకు నిర్ణయానికి సానుకూల స్పందనే! అయితే, అరశాతం రెపో రేటు తగ్గిచడంతోనే బ్రహ్మాండం బద్దలవుతుందని భావించడం సబబుకాదు. ఆర్థిక వ్యవస్థను పట్టిపీడిస్తున్న అనేక సమస్యలు ఇంకా ఉన్నాయి. వడ్డీ రేట్లను తగ్గిస్తూ ప్రకటన చేస్తూనే ద్రవ్యోల్బణంపై రిజర్వుబ్యాంకు గవర్నర్‌ రఘురాం రాజన్‌ ఆందోళన వ్యక్తం చేయడాన్నీ ఈ దిశలోనే చూడాలి. భారీ అంచనాలతో రూపొందించిన వృద్ధ్ది రేటుకు కోత పెట్టడం కూడా దీనికే నిదర్శనం. రెపో రేట్ల తగ్గింపు ప్రభావం స్థిరాస్తి రంగానికి తక్షణమే కలిసి వస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో వాహన కోనుగోళ్లు కూడా జోరందుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. వినియోగదారులను కొనుగోళ్ల ప్రక్రియవైపు పెద్ద ఎత్తున మళ్లించడం ద్వారా ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేయడమే రిజర్వు బ్యాంకు వ్యూహమన్న అభిప్రాయాన్ని ఆర్థిక రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. తక్షణ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ దీర్ఘ కాలంలో ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉంది.
వాహనరంగంలో కొనుగోళ్ల ప్రక్రియ జోరందుకునే అవకాశం ఉందన్న అంచనాలతో పాటే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడాన్నీ తోసి పుచ్చలేం. మధ్య తరగతి, ఆపై ఉన్నత శ్రేణి కొనుగోళ్లు చేసే కార్ల వ్యాపారం అలా ఉంచితే, మార్కెట్‌పై పెద్ద ఎత్తున ప్రభావం చూపే మోటార్‌ సైకిళ్ల కొనుగోళ్లు పెరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉండటమే దీనికి కారణం. మోటారు సైకిళ్లను పెద్దఎత్తున కొనుగోలు చేసే వారిలో గ్రామీణ జనాభానే అధికం! రెపో రేట్లు తగ్గినంత మాత్రాన వర్షా భావ పరిస్థితులను అధిగమించి కొనుగోళ్ల ప్రక్రియకు వారు మళ్లడంపై నిపుణుల్లో వ్యక్తమవుతున్న అనుమానాలను అంత తేలిగ్గా కొట్టి వేయడానికి వీలులేదు. రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకోవడంపై కూడా ఇదే విధంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి దేశ వ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ ధరలు చుక్కలనంటుతున్నాయి. 
ఈ దశలో వడ్డీ రేట్లు తగ్గినంత మాత్రానే స్థిరాస్తుల అమ్మకం జోరందుకుంటున్న అంచనాలపై ఆ రంగానికే చెందిన నిపుణులు అనుమానాలు వ్యక్తం చేయడాన్నీ తక్కువ చేసి చూడలేం. వర్షాభావ పరిస్థితుల ప్రభావం ఈ ఏడాది దేశంపై తీవ్రంగానే పడనుంది. రిజర్వు బ్యాంకు సైతం ఇదే రకమైన ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. ఒకటి, రెండు రాష్ట్రాల్లో మినహా దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రమే. అన్ని కీలక ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు అడుగంటాయి. దీంతో రానున్న రోజుల్లో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు చుక్కలనంటే ప్రమాదం ఉంది. అదే జరిగితే ద్రవ్యోల్బణానికి రెక్కలు వస్తాయి. ఈ నేపథ్యంలోనే రెపో రేటు తగ్గిస్తూ రిజర్వు బ్యాంకు తీసుకున్న చర్యను కాయకల్ప చికిత్సగానే చూడాల్సి ఉంది. ఆ మాత్రపు ఫలితాలు కూడా ప్రజలకు అందాలంటే బ్యాంకుల సానుకూల స్పందన కూడా కీలకం. వినియోగదారులకు వడ్డీ తగ్గింపు ప్రయోజనాలను బ్యాంకులు బదిలీ చేయాల్సి ఉంది. బ్యాంకులు ఈ దిశలో చర్యలు చేపట్టకుంటే ఫలితం దాదాపు శూన్యంగానే ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభంలో రిజర్వు బ్యాంకు 75 బేసిక్‌ పాయింట్లను తగ్గిస్తే ద్రవ్య లభ్యతకు ఎటువంటి ఇబ్బందీ లేకపోయినా బ్యాంకులు పాక్షికంగానే స్పందించాయి. తాజా ప్రకటన తరువాత కూడా కొన్ని బ్యాంకులు మాత్రమే సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. సాక్షాత్తూ రిజర్వు బ్యాంకు గవర్నరే ఈ విషయాన్ని చెబుతూ సానుకూల చర్యలు తీసుకోవాలని కోరిన తరువాత కూడా బ్యాకింగ్‌ రంగం నుండి అంతంత మాత్రపు స్పందన రావడం నిరాశ కలిగించే పరిణామమే! అదే సమయంలో బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తే చిన్న తరహా పొదుపుదారులకు అందే అంతంత మాత్రపు ప్రయోజనం కూడా అందకుండా పోయే ప్రమాదం ఉంది. ఈ తరహా ప్రజానీకం కూడా నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 
నిజానికి ప్రపంచమే కుగ్రామంగా మారిన ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో దేశ ఆర్థిక వ్యవస్థను అనేక అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. హద్దులు దాటుకుని ప్రయాణం చేస్తున్న పెట్టుబడి, దాని కనుసన్నల్లో నడిచే కార్పొరేట్‌ శక్తులు దేశాల ఆర్థికాంశాలను నిర్దేేేస్తున్నాయి. కార్పొరేట్ల అడుగులకు మడుగులొత్తే విధానాలకే పాలకులు పెద్దపీట వేసినంతకాలం ఆర్థిక వ్యవస్థలో సంక్షోభాలు తప్పవు. ఒక సంక్షోభం నుండి మరో సంక్షోభానికి వ్యవస్థ పరుగులు తీస్తూనే ఉంటుంది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ చరిత్ర ఇప్పటి వరకు తేల్చిన సత్యం ఇదే! సంక్షేమమే థ్యేయంగా ప్రజానుకూల ఆర్థిక విధానాల అమలుకు ప్రభుత్వాలు సిద్ధపడేంత వరకు ఈ తరహా చర్యలను అంతంత మాత్రపు ఫలితాలు ఇచ్చే పైపై పూతలుగానే చూడాల్సి ఉంది.