
వచ్చే వారం మొదలు కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వివాదాస్పద భూ సేకరణ బిల్లు ఆమోదం పొందడానికి వీలుగా, జులై 15న ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. నీతి ఆయోగ్ ఏర్పడిన తరువాత ఇలా సమావేశం కావడం ఇది రెండవసారి. అయితే, ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశమే లేదు. భూ సేకరణ బిల్లు రైతు వ్యతిరేకం అంటూ నిరసన వ్యక్తం చేస్తున్న ప్రతిపక్ష కాంగెస్ తన పార్టీ వారికి ఆ విధంగా సూచనలు ఇచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. తొమ్మిది రాష్ట్రాలలో- కేరళ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం- కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. భూ సేరణ బిల్లుపై కొనసాగుతున్న అనిశ్చితిని తొలగించేందుకు ప్రధాని ముఖ్యమంత్రులతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సమావేశానికి రాలేనని, భూ సేకరణ బిల్లుకు తాను వ్యతిరేకినని ప్రధానికి లేఖ రాశారు. ఈ కీలక సమావేశానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కనుక హాజరు కాకపోతే, 30 మందికి గాను పది మంది రానట్లే. భూ బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇదివరకే ఒక లేఖ రాశారు. భూ సేకరణ చట్టానికి కేంద్రం ప్రతిపాదించిన సవరణలు తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని వారు ఆ లేఖలో వివరించారు.