కల్తీ మద్యం బాధితులను పరామర్శ ..

విజయవాడలో కల్తీ మద్యం మరణాలపై హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు. మెజిస్టీరియల్‌ విచారణ వల్ల ఉపయోగం ఉండదన్నారు. ప్రభుత్వ మద్యం విధానంపై కమిషన్‌ నియమించాలని సూచించారు. విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణ బార్‌లో మద్యం సేవించి ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సిపిఎం రాజధాని ప్రాంత కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు, విజయవాడ నగర కార్యదర్శి డి.కాశీనాథ్‌తో కలిసి మధు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యాన్ని ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా గుర్తించటం శోచనీయమన్నారు. గతేడాది రూ.11 వేల కోట్ల రాగా, ఈ ఏడాది రూ.15 వేల కోట్ల ఆదాయం రావాలని ప్రభుత్వం టార్గెట్‌ ఇచ్చిందని తెలిపారు. అనధికార, కల్తీ మద్యం అమ్మకాల ద్వారా మరో రూ.15 వేల కోట్ల రాబడి వస్తోందన్నారు. మొత్తం ఆదాయంలో సగం రాజకీయ పార్టీలు, మంత్రులకు ముడుపుల రూపంలో వెళుతున్నాయని తెలిపారు. దశలవారీగా మద్య నిషేధం, బెల్ట్‌ షాపులను పూర్తిగా నిషేధిస్తామన్న సిఎం చంద్రబాబు, నేడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మద్య నిషేధం అమలు చేయకపోగా, అమ్మకాలను రెట్టింపు చేయాలని ఆదేశిస్తున్నారని చెప్పారు.