కరువు చర్యలేవీ?

ఆదిలోనే హంసపాదులా ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావం తీవ్రరూపం దాల్చడం ఆందోళనకరం. నిరుటి కరువు, తుపాను ప్రకృతి బీభత్సాలకు నష్టాలపాలైన రైతుల్లో ఈ ఏడాది సకాలంలో నైరుతీ రుతుపవనాల రాక వలన తొలకరి ఆశలు చిగురించాయి. కాగా జూన్‌ మొదటి మూడు వారాల్లో మురిపించిన వర్షాలు అనంతరం మొరాయించి అన్నదాతల ఆనందాన్ని ఆవిరి చేశాయి. ఇరవై రోజులకు పైగా చినుకు కరువై వర్షాకాలంలో ఎండాకాలంలా తయారైంది. అసాధారణ స్థాయికి ఉష్ణోగ్రతలు ఎగబాకడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఖరీఫ్‌ సాగు పడకేసింది. వానల కోసం రైతన్నలు మబ్బుల వంక ఎదురు చూస్తున్న విపత్కర పరిస్థితి. పదమూడు జిల్లాల నవ్యాంధ్రలో ఆరు జిల్లాలు అనావృష్టితో అల్లాడుతున్నాయి. సీజను ఆరంభంలో కురిసిన వర్షాల వల్ల తతిమ్మా ఏడు జిల్లాలూ సగటు వర్షపాత లెక్కలతో పచ్చగా కనబడుతున్నా క్షేత్ర స్థాయి అంత బాగా ఏమీ లేదు. దక్షిణాంధ్రలో ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలో కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో వర్షాభావం అత్యంత భయానకంగా ఉంది. సీమ ఈ సంవత్సరం కూడా కరువు కోరల్లో చిక్కుకుంటుందన్న ఆందోళనలు అప్పుడే వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్లుగా సీమపై అనావృష్టి పగబట్టడం పెను విషాదం. వరుస కరువులు సీమ ప్రజల జీవనగతిని చిన్నాభిన్నం చేయడం దయనీయం. ముందటేడు సమైక్య రాష్ట్రంలో ప్రకటించిన కరువు మండలాలన్నీ సీమలోనివే. విభజనానంతరం నిరుడు ప్రకటించిన దుర్భిక్ష మండలాల్లో అత్యధికం సీమకు చెందినవే. నిత్య కరువులతో అల్లాడుతున్న సీమలో మరోసారి తిష్ట వేసిన కరువు ఆ ప్రాంత ప్రజలకు గోరుచుట్టుపై రోకలి పోటు. ఎపిలో ఇప్పటికి 150 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 165 మిల్లీమీటర్లు పడింది. కురవాల్సినదానికంటే పది శాతం అధికమని చేసే విశ్లేషణలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించవు. రాష్ట్రంలో 670 మండలాలుంటే 279 మండలాల్లో వర్షాభావం నెలకొంది. 42 శాతానికిపైగా రాష్ట్రంలో దుర్భిక్షం తాండవిస్తోంది. మరీ 97 మండలాల్లో పరిస్థితులు చేజారాయి. రోజు రోజుకు వర్షాభావ మండలాలు పెరుగుతున్నాయి. ప్రాజెక్టుల్లో నీరు అడుగంటాయి. ఇదీ క్షేత్ర స్థాయి సత్యం.
రాజకీయాలు, ప్రచార్భాటాల రంధిలో మునిగి తేలుతున్న తెలుగుదేశం ప్రభుత్వం కరువు బాధితుల గోడు ఆలకించడానికి ఎంత మాత్రం ఇష్టపడట్లేదు. కొన్నాళ్లు ఓటుకు నోటు, ఇంకొన్నాళ్లు జపాన్‌ పర్యటన, ఇప్పుడు గోదావరి పుష్కరాలు, వీటితోనే సర్కారుకు తీరిక లేకుండా ఉంది. దుర్భిక్ష రక్కసిని పట్టించుకునే తీరిక, ఓపిక ప్రభుత్వానికి ఉన్నట్లు లేదు. గత సంవత్సరం కూడా సర్కారు అలానే కరువు బాధితులను నిర్లక్ష్యం చేసింది. కనీసం అనావృష్టి మండలాలను గుర్తించడానిక్కూడా మనసు రాలేదు. ఖరీఫ్‌లో కరువొస్తే రబీ చివరిలో మండలాలు ప్రకటించిన 'ఘనత' మూటగట్టుకుంది. ప్రకటించిన మండలాల్లోనైనా సహాయ చర్యలు చేపట్టిందా అంటే అదీ లేదు. మళ్లీ ఖరీఫ్‌ వచ్చినా రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించలేదు. సహాయం చేయమని కేంద్రానికి విజ్ఞప్తి చేయడం మినహా ఒక్క రూపాయి సాధించలేదు. సుమారు రూ.800 కోట్ల పరిహారం ఎగ్గొట్టింది. సమైక్య రాష్ట్రంలో ముందటేడు ప్రకటించిన కరువు మండలాల్లో రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీపై చంద్రబాబు సర్కారు చేతులెత్తేసింది. దుర్భిక్షంతో అలో లక్షణా అంటున్న రైతాంగాన్ని ఆదుకోకుండా ప్రాథమికరంగ మిషన్‌, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రెండంకెల వృద్ధి అనేవి శుష్క వాగ్దానాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు. అంతకుమించి రైతులను వంచనకు గురి చేసే వ్యవహారం.
ఈ ఏడాది దేశంలో సాధారణ స్థాయిలో వర్షాలు పడబోవని, దక్షిణాదిలో లోటు ఎక్కువగా ఉండబోతోందని సీజను ప్రారంభానికి ముందే భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్‌నినో ప్రభావం ఉందని ప్రపంచ దేశాలు ఎప్పటి నుంచో ఘోషిస్తున్నాయి. కరువొచ్చాక బావి తవ్వుకోవచ్చనే రీతిలో చర్మం మొద్దుబారిన ప్రభుత్వం ఈ ముందస్తు సంకేతాలను చెవికెక్కించుకోలేదు. ఖరీఫ్‌లో నెలా పదిహేను రోజులు కరిగిపోయినా కంటింజెన్సీ ప్రణాళికలు రూపొందించి అమలు చేయడంలో సాచివేతే. ప్రకృతి విపత్తులను అడ్డుకోలేకపోయినా ముందస్తు చర్యలు చేపట్టి నష్టాన్ని వీలైనంత మేరకు తగ్గించే అవకాశం ఉన్నా సర్కారు తన బాధ్యతను మర్చిపోవడం దుర్మార్గం. ఇప్పటికే వేసిన విత్తనాలు మొలకెత్తక, భూమిలోనే మాడిపోయి రైతులు పెట్టుబడులు నష్టపోయారు. ఏరువాక సాగక రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రుణ మాఫీ గందరగోళం వల్ల బ్యాంకులు వ్యవసాయ అప్పులు నిలిపేశాయి. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా ముఖ్యమంత్రి, మంత్రులు ఖరీఫ్‌పై పూర్తి స్థాయిలో సమీక్షించిన దాఖలాల్లేవు. ప్రతిదానికీ రుణ మాఫీ, రైతు సాధికార సంస్థలతో లింక్‌ పెట్టి తప్పించుకోవడం మరీ ఘోరం. కరువు మహమ్మారిపై యుద్ధానికి ఇప్పటికైనా ప్రభుత్వం కదలాలి. కంటింజెన్సీ ప్రణాళికలు రూపొందించి రైతులను అన్ని విధాలా ఆదుకోవాలి. దుర్భిక్షాన్ని తట్టుకునే పంటల సాగుకు సబ్సిడీపై విత్తనాలు, పెట్టుబడులు, ఇతర ఉత్పాదకాలు సమకూర్చాలి. కరువు ప్రాంతాల్లో ఉపాధి హామీ కింద కూలీలకు ఉపాధి కల్పించాలి. పశుగ్రాసం అందించాలి. ప్రజలకు తాగునీటి ఎద్దడి నివారించాలి. నిత్య కరువులతో అల్లాడుతున్న రాయలసీమ, ఇతర మెట్ట ప్రాంతాల్లో శాశ్వత, తాత్కాలిక చర్యలు చేపట్టాలి.