ఓటుకు నోటు ఎఫ్‌ఐఆర్‌లో బాబు పేరు నమోదు చేయాలి : పి.మధు

ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు. బుధవారం కడపలోని సిపిఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి కె.ఆంజనేయులుతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బలం తక్కువగా ఉన్నప్పటికీ అధికారం, డబ్బు వినియోగించి ఎన్నికల్లో గెలవాలని టిడిపి యత్నిస్తోందన్నారు.
ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు రూ. 50 లక్షలు అప్పచెబుతూ టిడిపి కన్నంలో దొంగలా దొరికిందన్నారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఎలాంటి పోరాటమూ చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పోరాడితే వామపక్ష పార్టీలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
రైతుల డిమాండ్‌కనుగుణంగా వేరుశనగ విత్తనాలు అందించాలన్నారు. డ్వాక్రా మహిళల పేరుతో ఇసుక దందాను కొనసాగిస్తూ ప్రభుత్వం మాఫియాను తయారు చేసిందన్నారు. ఈ పథకాన్ని అడ్డుపెట్టుకుని టిడిపి కార్యకర్తలు కోట్లు కొల్లగొట్టేందుకు అవకాశం కల్పించిందని చెప్పారు. 'నీరు-చెట్టు'లో తీవ్ర అవినీతి జరిగిందని, కరువు గ్రామాల్లో తాగునీటి వ్యాపారం జోరుగా సాగిందని విమర్శించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని వాగ్దానం చేసి అధికారంలోకొచ్చిన చంద్రబాబు, నేడు అవినీతికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే పైమూడింటిపైనా విచారణ జరిపించాలని మధు డిమాండ్‌ చేశారు. కడప జిల్లాలో రైతు రుణమాఫీ జంతర్‌మంతర్‌ను తలపిస్తోందన్నారు. సుమారు 11 లక్షల మంది రైతులు రుణాలు పొందితే 37 శాతం మంది రైతులకు రూ. 50 వేలలోపు రుణాలు మాత్రమే మాఫీ చేసిందన్నారు. ప్రభుత్వం నాలుగు లక్షల ఖాతాలు మాఫీ చేసినట్లు చెప్పుకుంటోందని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు చెందిన మొత్తం రుణాలు మాఫీ చేస్తామని గతంలో చెప్పి, నిన్న పది వేలు ఇస్తామని చెప్పి, నేడు ఇచ్చిన మూడు వేలు వాడుకోవద్దని ఆంక్షలు విధిస్తోందన్నారు.
రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించి ప్రజల మీద భారాలు మోపేందుకు కొత్త మద్యం పాలసీని రూపొందించిందన్నారు. సూపర్‌మార్కెట్‌, బిగ్‌బజార్లలో సైతం బ్రాందీ, విస్కీ అమ్మేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. జిల్లాలో మధ్యాహ్న భోజన కార్యకర్తలకు 26 కోట్ల బకాయిలు, ఎనిమిది నెలల వేతనాలు చెల్లించాల్సి ఉందన్నారు. అంగన్వాడీలు రూ. 4,200 వేతనంతో దుర్భర జీవితం గడుపుతున్నారని, రెండు వేలు పెంచుతామని గతంలో ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదని అన్నారు. వీరి బకాయిలు, వేతనాలు పెంచడానికి చేతులు రాని రాష్ట్ర సర్కార్‌, పార్టీలకతీతంగా 2,150 కోట్ల ప్రజాధనాన్ని పరిశ్రమల అధిపతులు ఎస్‌పివైరెడ్డి, టి.జి.వెంకటేష్‌తో పాటు మరికొందరికి రాయితీల రూపంలో కట్టబెట్టిందన్నారు.