ఐరోపా అసలు స్వరూపం..

 గ్రీకు ప్రజలు కేవలం ఒక వారం క్రితం రిఫరెండంలో తిరస్క రించిన 'పొదుపు ప్యాకేజీ'ని ప్రధాని అలెక్సీ సిప్రాస్‌ అంగీకరిం చటమంటే గ్రీక్‌ ప్రభుత్వం లొంగిపోవ టమే. గ్రీకు ప్రజలంటే జర్మన్‌ ద్రవ్య పెట్టుబడికున్న చిన్నచూపుకు ఇది ఒక సూచిక. వాస్తవంలో ఐరోపాకే కాక మొత్తం ప్రపంచానికి ఇది ఒక నిర్ణయాత్మకమైన మలుపు. వామపక్షాల ముఖ్యంగా యూరోపియన్‌ వామపక్షాల ఆలోచనా ధోరణికి ఇది ఒక ముగింపు. గ్రీస్‌ ప్రధాని అలెక్సీ సిప్రాస్‌ షరతులను అంగీకరించటమా, లేదా అనేది అసలు విషయం కాదు. యూరోపియన్‌ వామపక్షాలు తమను తాము పరిమితం చేసుకున్న వ్యవహార శైలిలో సిప్రాస్‌కు అంతకుమించిన ప్రత్యామ్నాయం లేదు. దాని మాటునగల భావన లోపభూయిష్టమైనదని సిరిజా లొంగుబాటు తెలియజేస్తున్నది. ఇది సిరిజాను ఆషామాషీగా విమర్శించటం కాదు. గ్రీస్‌, ఐరోపా, ఇతర చోట్ల కనిపించే వామపక్ష పడికట్టు పద వాచాలతకు ముగింపుపలికి ఇది వామపక్ష పునరాలోచనకు ఆరంభం కావాలి.
జులై 6న పదవి నుంచి వైదొలిగిన గ్రీస్‌ ఆర్థిక మంత్రి, స్వయం ప్రకటిత మార్క్సిస్టు యానిస్‌ వరౌఫాకిస్‌ తాను గార్డియన్‌ పత్రికలో రాసిన వ్యాసంలో ఈ వ్యవహార శైలి గురించి స్పష్టంగా పేర్కొన్నాడు. 'యూరో జోన్‌ నుంచి గ్రీస్‌ లేదా పోర్చుగీస్‌ లేదా ఇటలీ వైదొలిగితే అది ఐరోపా పెట్టుబడిదారీ వ్యవస్థను ముక్కలు, చెక్కలు చేస్తుంది. దానితో రైన్‌ నదికి తూర్పున, ఆల్ఫ్స్‌ పర్వత శ్రేణికి ఉత్తరాన తీవ్ర మాంద్యం ఏర్పడుతుంది. మిగిలిన ఐరోపా అంతా ప్రతిద్రవ్యోల్బణ విషవలయంలో చిక్కుకుంటుంది. ఒకవేళ ఇదే జరిగితే లాభపడేది ఎవరని మీరనుకుంటున్నారు? ఐరోపా ప్రజాసంస్థల బూడిదలో నుంచి పురాణ ఫీనిక్‌ పక్షిలాగా ప్రగతిశీల వామపక్షం నవనవోన్మేషంగా పునరావిర్భవిస్తుందా? లేక గోల్డెన్‌ డాన్‌ నాజీలు, నయా ఫాసిస్టు శ్రేణులు, పరదేశస్థులను ద్వేషించేవారు ఆధిపత్యంలోకి వస్తారా? యూరోజోన్‌ అంతంతో ఈ రెండింటిలో ఎవరు బాగా పనిచేస్తారో వారే ఆధిపత్యంలోకి వస్తారనటంలో నాకెలాంటి సందేహం లేదు. ఈ 1930వ దశక ఆధునికానంతర కథనానికి ఊపిరులూదాలని నాకు లేదు. ఇది ఐరోపా పెట్టుబడిదారీ వ్యవస్థ తనను తాను కాపాడుకోవట మైతే దానిని జరగనివ్వాల్సిందేనని వరౌఫాకిస్‌ చెప్పాడు. ఐరోపా పెట్టుబడిదారీ వ్యవస్థ మీద ప్రేమతో కాక సంక్షోభం పర్యవసానంగా వచ్చే మానవ క్షోభను సాధ్యమైనంత తగ్గించటానికి చేసే ప్రయత్నంగా ఇది ఉంటుందని ఆయన పేర్కొన్నాడు.
మానవ క్షోభను పెంచుతుందని వరౌఫాకిస్‌ భయపడుతున్న ఫాసిజంలాగానే ఇష్టంలేకపోయినా విధించే 'పొదుపు విధానం'తో కూడా అదే జరుగుతుంది. అంతేకాక ఏ 'పొదుపు' విధానాన్న యితే అడ్డుకుంటామని అధికారంలోకి వచ్చిన వామపక్షం పట్ల ప్రజలకున్న భ్రమలు బూడిదై, దాని నుంచి అవే ఫాసిస్టు శక్తులు అధికారంలోకి వస్తాయి. కాబట్టి ప్రజాస్వామ్య చట్రంలోనే ఐరోపా పెట్టుబడిదారీ వ్యవస్థ 'రక్షింపబడుతుంద'నే భావన వరౌఫాకిస్‌ వాదనలో ఉంది. ఇలా నమ్మేది ఒక వరౌఫాకిస్‌ మాత్రమే కాదు. ఐరోపాలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగిన సందర్భంలో ఐరోపా వామపక్షంలోని ప్రధాన భాగం సమైక్య ఐరోపాకు కట్టుబడి ఉన్నది. ఐరోపా ఖండం ప్రస్తుత రూపం ద్రవ్య పెట్టుబడికి ముఖ్యంగా జర్మన్‌ ద్రవ్య పెట్టుబడికి ఆధిపత్య సాధనంగా ఉన్నదని ఈ వామపక్ష విభాగానికి తెలుసు. ఐక్య ఐరోపా ఈ ఆధిపత్యాన్ని అధిగమిస్తుందని, ఇదంతా ప్రజల ఆమోదం తీసుకుని ద్రవ్య పెట్టుబడి చేస్తున్నదని ఈ వామపక్షం నమ్మిందనేది సుస్పష్టం.
ఈ అవగాహన వల్లనే గ్రీస్‌లో ఆ దేశ ప్రధాని రిఫరెండంను కోరాడు. గ్రీకు ప్రజలను తిరస్కరిం చమని సిరిజా కోరిన 'పొదుపు చర్యల'ను సడలించ టానికి ఋణదాతలైన దుష్ట త్రయం (ట్రోయికా) అంగీకరించని స్థితిలో కావలసిన ప్రత్యామ్నాయా లను గ్రీస్‌ ప్రభుత్వం రూపొందించ జాలదనేది ఇప్పుడు స్పష్టంగా తెలుస్తున్నది. 'పొదుపు చర్యలను' గ్రీకు ప్రజలు గట్టిగా తిరస్కరిస్తే 'ట్రోయికా' పునరా లోచన లోపడుతుందని, అది అప్పు నుంచి ఉపశ మనం పొందటానికి వీలు కల్పించే ఒప్పందం చేసుకు నేందుకు జరిగే చర్చలలో తమను బలోపేతం చేస్తుం దని సిరిజా ప్రభుత్వం అమాయకంగా నమ్మింది. వేరే మాటల్లో చెప్పాలంటే ప్రజల ప్రజాస్వా మిక ఆకాంక్షకు ద్రవ్య పెట్టుబడి తలొగ్గుతుందని ఐరోపా వామపక్షంలోని ప్రధాన భాగంలాగానే సిరిజా కూడా నమ్మింది. ఈ నమ్మకం చూసీచూడగానే నమ్మలేనటు వంటిదిగా కనపడదు. ఎందుకంటే ఇప్పటికీ ఐరోపాలో చాలా చోట్ల చెప్పుకోదగినంతగా సంక్షేమ రాజ్య విధానాలు అమలవుతున్నాయి. వీటితో పాటుగా పనిచేస్తున్న బూర్జువా ప్రజాస్వామ్యం కూడా అస్తిత్వంలో ఉన్నది. ప్రస్తుతం 'పొదుపు చర్యలను' అమలుచేయటం నచ్చిన విధానంగా ఉన్నప్పుడు, సంక్షోభం ఐరోపా అంచునగల దేశాలను ముంచెత్తు తున్నప్పుడు ద్రవ్య పెట్టుబడికి ఆ దేశాల ప్రజలతో తన ఇష్టానుసారంగా వ్యవహరించ గలగటం సాధ్యపడింది.
తప్పుడు భావన
ద్రవ్య పెట్టుబడిని 'హేతువు'ను పట్టించుకునేలా చేయగలమని, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి ఆ వర్గాన్ని దారిలోకి తెచ్చుకోవచ్చనే ఈ భావన తప్పని తేలింది. మధ్యస్థ-వామపక్ష రాజకీయాలతో కాకుం డా సమాజంలో ఆధిపత్యంలోకి వస్తున్న ఒక్క వామ పక్ష రాజకీయాల చొరవతోనే ఐరోపాను పునః ప్రతిష్టించవచ్చనే అవగాహన సరైనది కాదని ఇది తెలియజేస్తున్నది. అలాగే ఐరోపా పెట్టుబడిదారీ వ్యవస్థకు చెందిన సంస్థలను కదిలించకుండా వామపక్షం నేతృత్వంలోని ప్రజాస్వామ్యంతో ద్రవ్య పెట్టుబడిపై గెలవగలమనే భావన తప్పులతడక తప్ప మరొకటికాదు. నిజానికి మొదటి ప్రపంచ యుద్ధం జరిగే కాలంలో పెట్టుబడిదారీ వ్యవస్థ సందర్భంగా కౌట్‌స్కీ, తదితరులు చేసిన వాదనలతో ఈ భావన పోలివున్నది. అదేమంటే గుత్త పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రజల గొంతు నులుముతుంటే మనం గుత్త పెట్టు బడిదారీ వ్యవస్థ పూర్వ స్థితికి వెళ్ళాలని డిమాండ్‌ చెయ్యాలి. అలాంటి డిమాండ్‌ లెనినిస్టు అర్థంలో 'పరివర్తనకాల డిమాండ్‌'గా ఉంటుంది. అయితే అది పరిష్కారం కాదు. లెనిన్‌ చెప్పినట్లుగా అసలు విషయం ఏమంటే మనం గుత్త పెట్టుబడిదారీ పూర్వ స్థితికి కాకుండా సోషలిజం దిశగా పయనించాలి.
ప్రజలను కూడగట్టి, ద్రవ్య పెట్టుబడిని 'హేతుబద్ధం'గా వ్యవరించేలా చేసి మనం గుత్త పెట్టుబడిదారీ వ్యవస్థ పూర్వ స్థితికి 'తిరిగి వెళ్ళాలనే' వ్యూహం పనిచేయదు. ఎందుకంటే పెట్టుబడిదారీ వ్యవస్థ ముఖ్యంగా సమకాలీన ద్రవ్య పెట్టుబడి అత్యంత కిరాతకమైనది. ద్రవ్య పెట్టుబడికి ఆధిపత్యం కావాలి. దానికి అర్థమయ్యే భాష పేరు ప్రాబల్యం. ప్రజాభిప్రాయాన్ని, హేతువును అది ఏమాత్రం పట్టించుకోదు. ఐరాపాలోని ఈ వామపక్ష విభాగం కంటే చాలా ముందుగానే ఈ విషయాన్ని జాన్‌ మేనార్డ్‌ కీన్స్‌ కూడా విస్మరించాడు. 'డిమాండ్‌ నిర్వహణ'లో ప్రభుత్వం జోక్యం చేసుకోవటాన్ని వ్యతిరేకించే ద్రవ్య పెట్టుబడిని సమిష్టి డిమాండ్‌ లోపాన్ని సరిదిద్ది, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలను పూర్ణ ఉద్యోగితను సాధించగలిగేలా చేసి దారిలోకి తెచ్చుకోవచ్చనే కీన్స్‌ ఊహ అవగాహనారాహిత్యంతో కూడుకున్నది. ఆర్థిక వ్యవస్థ వాస్తవంలో ఎలా పనిచేస్తుందనే విషయం వివరించి పెట్టుబడి దారులకు ముఖ్యంగా ద్రవ్య పెట్టుబడిదారులకు నచ్చజెప్పగలిగితే వాళ్ళ ఆస్తులను లాక్కోకుండానే వ్యవస్థను రక్షించవచ్చు అనేది కీన్స్‌ ఊహ.
యుద్ధానంతరం 'డిమాండ్‌ నిర్వహణ'లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవటం స్థిరపడినప్పుడు కొంతకాలంపాటు కీన్స్‌ అవగాహన సరైనదేమోననే అభిప్రాయం ఏర్పడింది. అయితే అది పొరపాటు అని తేలింది. పెట్టుబడిదారీ వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారినప్పుడు తప్పనిసరి పరిస్థితులలో ద్రవ్య పెట్టుబడి ప్రభుత్వ 'డిమాండ్‌ నిర్వహణ'ను ఆమోదించింది. తన బలం పుంజుకున్న వెంటనే సంక్షోభంలో కూడా 'పొదుపు చర్యలను' డిమాండ్‌ చేసేటంతగా 'డిమాండ్‌ నిర్వహణ'కు నీళ్ళు వదిలింది. ఇది కీన్స్‌ను సమాధిలోనే ఒకింత ఆశ్చర్యపరచి ఉంటుంది. ఈ మొత్తం ఉదంతంలో ముఖ్యమైన విషయం ఏమంటే గ్రీకు ప్రజలు కేవలం తమ అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తపరిచారు. ద్రవ్య పెట్టుబడిపై ఎలాంటి ఒత్తిడి లేదు. దాని అధిపత్యానికి ఎటువంటి ప్రమాదం ఏర్పడలేదు. సిరిజా ప్రభుత్వం 'ట్రోయికా'ను తప్ప రష్యానుగాని, చైనాను గాని, బ్రిక్స్‌ బ్యాంకునుగాని లేక నిధుల కోసం మరెవరినీ సంప్రదించే ప్రయత్నం చేయలేదు. సిరిజాకు అలా చేయగలిగే పరిస్థితి లేదు. ఒకవేళ చేసినా అది విజయవంతం అయ్యేదికాదు. అయితే అలా చేసివుంటే సిరిజా నుంచి ప్రమాదం పొంచి ఉన్నదనే ఆలోచన కొంత వరకు నమ్మదగినదిగా ఉండేది. అయితే వరౌఫాకిస్‌ ముందుకు తెస్తున్న హేతువు ప్రకారం సిరిజా తన చేతుల్ని తానే కట్టేసుకుంది. అది ద్రవ్య పెట్టుబడికి ప్రమాదకరంగా మారటం అటుంచి కనీసం దానికి సమస్యగా కూడా కాలేకపోయింది.
ఈ మొత్తం ఉదంతానికి సంబంధించి మరో ప్రధాన కోణం ఉన్నది. అదేమంటే గ్రీస్‌ ప్రజలకు సకల ఐరోపా కార్మికవర్గం తన మద్దతును, సంఘీభావాన్ని తెలుపలేదనే వాస్తవం. క్లుప్తంగా చెప్పాలంటే ద్రవ్య పెట్టుబడి క్రూరత్వాన్ని, ఐరోపా యూనియన్‌ మీద అది చెలాయిస్తున్న అప్రజాస్వామిక ఆధిపత్యాన్ని సకల ఐరోపా కార్మికవర్గం ప్రతిఘటించటం లేదు.
ద్రవ్య పెట్టుబడి నియంతృత్వం
బహిరంగంగా 'టెర్రరిస్టు నియంతృత్వాన్ని' ద్రవ్య పెట్టుబడి చెలాయించటమే ఫాసిజం అని జార్జి డిమిట్రోవ్‌ అన్నాడు. గ్రీస్‌ విషయంలో జరిగింది బహిరంగ టెర్రరిస్టు నియంతృత్వం కాకపోవచ్చు. అయితే ద్రవ్య పెట్టుబడి నియంతృత్వ సారథ్యంలో ఐరోపా యూనియన్‌ నడుస్తున్నది. గ్రీస్‌లో ఈ నియంతృత్వం వ్యక్తీకరింపబడినదానికి వ్యతిరేకంగా మిగిలిన ఐరోపాలో ఎటువంటి కార్మికవర్గ ప్రతిఘటనా జరిగినట్లు కనబడలేదు. కాబట్టి వింతగా ద్రవ్య పెట్టుబడి ఐరోపా అంతటా సమైక్యంగా ఉంటే కార్మికవర్గం మాత్రం దేశాలవారీగా ముక్కలై ఉన్నది. 'అంతర్‌ సామ్రాజ్యవాద స్పర్థలు' కనుమరుగైన పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేయటం కష్టమవుతుంది. ఉత్పత్తులలో విభిన్నతలేకుండా దిగుమతి ఆధారిత ఆర్థికవ్యవస్థగా ఉన్నప్పుడు, రష్యా, భారత్‌ వంటి ఖండాంతర ఆర్థికవ్యవస్థల వలె స్వయం సమృద్ధమయ్యే అవకాశంలేనప్పుడు, గ్రీస్‌లాంటి చిన్న దేశాలలో ఈ పోరాటం మరింత కష్టతరమౌతుంది. అయితే దిగుమతులపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థ గల ఈ చిన్న దేశంలోని ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను చూసి ద్రవ్య పెట్టుబడి 'మనసు మార్చుకుంటుందని' వామపక్షం నమ్మినప్పుడు ఈ పోరాటం ఊహకందన ంత కష్టతరమౌతుంది.
ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యంలోని ఐరోపా యూనియన్‌కు ఐరోపా వామపక్షం ఇస్తున్న మద్దతులోగల వైరుధ్యాలు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షతో పరిష్కారమౌతాయనే భ్రమ గ్రీస్‌ ఉదంతంతో తొలిగిపోవాలి. ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష యావత్తు ఐరోపా ఖండంలో కాకుండా వేరువేరు దేశాలలో వేరువేరు సందర్భాలలో వ్యక్తీకరింపబడితే అది జరగదు. ప్రజాస్వామిక ఐరోపాకు కావలసిన నూతన సంస్థలు ఆవిర్భవించ టానికి ముందు ఐరోపాలో అస్తిత్వంలో ఉన్న 'అధికార సంస్థలు' నాశనం కావలసిన అవసరం ఉన్నది.
ప్రభాత్‌ పట్నాయక్‌