ఐరాస లక్ష్యాలు నెరవేరెేనా..

 వచ్చే పదిహేనేళ్లలో ప్రపంచంలో పేదరికాన్ని అంతం చేయాలన్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) లక్ష్యం మంచిదే కానీ దేశాల చిత్తశుద్ధి, సమిష్టి కార్యాచరణ పైనే అనుమానం. దశాబ్దంన్నర క్రితం 2000 సంవత్సరంలో ఐరాస తీసుకున్న సహస్రాబ్ది లక్ష్యాల్లో చాలా మట్టుకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లున్నాయి. ఐరాస టార్గెట్లను అమెరికా ఇతర పశ్చిమ దేశాలు తుంగలో తొక్కి తమ స్వంత ఎజెండాతో మున్ముందుకెళుతున్నప్పుడు ఎన్ని నూతన ఎజెండాలు రూపొందించినా ఆశించిన మార్పు రాదన్నది స్పష్టం. అందుకే పేదరిక నిర్మూలన లక్ష్యంగా తాజాగా ఐరాస ప్రతిపాదించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డిజి) అమలుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు న్యూయార్క్‌లో జరిగిన ఐరాస సర్వప్రతినిధి సభలో ఎస్‌డిజి ముసాయిదాకు ఆమోదం లభించిన తరుణంలో పదిహేనేళ్ల క్రితం నిర్ణయించుకున్న సహస్రాబ్ది లక్ష్యాల మాటేమిటో అవలోకనం చేసుకోవడం అవసరం. ఐరాస అసెంబ్లీ వేదికపై క్యూబా అధ్యక్షుడు రావుల్‌ కాస్ట్రో ఆ పని చేశారు. సహస్రాబ్ది లక్ష్యాలు ఆశించిన మేరకు సాధించలేదని కుండ బద్దలు కొట్టారు. పేద దేశాల్లోనే కాదు పారిశ్రామిక దేశాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రగతి అసమగ్రంగానే ఉంది. అభివృద్ధి ఫలాల పంపిణీలో అసమానతలు ఏర్పడటమే కాదు పెరగడం కూడా ఒక వాస్తవం. అంతకంతకూ సంపద కేంద్రీకృతం అవుతోంది. దేశాలకూ దేశాల మధ్య మాత్రమే కాదు ఒకే దేశంలోని ప్రజల మధ్య కూడా ఆర్థిక వైరుధ్యాలు పెరగడం ఆందోళనకరం. ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్ల మంది ప్రజలు దారిద్య్రంలో మగ్గుతున్నారు. వారి రోజువారీ ఆదాయం 1.25 డాలర్లకంటే తక్కువ. శిశుమరణాలు ధనిక దేశాల్లో కంటే పేద దేశాల్లో ఎన్నో రెట్లు ఎక్కువ. ప్రసూతి మరణాలూ అంతే. ప్రభుత్వాల విధానాల మూలంగా నానాటికీ పేద, నిరుద్యోగ, నిర్వాసిత ప్రజల సంఖ్య 'వృద్ధి' చెందుతోంది. ఈ దారుణాలపై ఐరాసలో సమీక్షించి మూల కారణాలు కనుగొని, ఆ తర్వాత కొత్త ఎజెండా రూపొందిస్తే కొంతైనా భరోసా లభించేది. 
దారిద్య్రం, ఆర్థిక వైరుధ్యాలు పెరగడానికి ప్రధాన కారణం అమెరికా, సామ్రాజ్యవాద దేశాల ఒత్తిడితో ప్రపంచం నెత్తిన బలవంతంగా రుద్దిన నయా-ఉదారవాద ఆర్థిక విధానాలు. ఆర్థిక సంక్షోభాలకు అవే హేతువులు. వాటిని మరింత ఎక్కువ వేగంగా అమలు చేయాలని ఉవ్విళ్లూరుతూ పేదరికం, సమానత్వం సాధిస్తామనడం పొసగని వ్యవహారం. సహస్రాబ్ది లక్ష్యాల్లో చాలా వరకు విజయం సాధించామంటున్న ఐరాస ప్రపంచ భాగస్వామ్య టార్గెట్‌లో విఫలమైనట్లు అంగీకరించడం గమనార్హం. దేశాల సుస్థిర అభివృద్ధికి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ప్రాధాన్యమివ్వాలని, రుణ భార వ్యవస్థలుగా మిగిలి పోవద్దని పోప్‌ ఫ్రాన్సిస్‌ ఐరాస వేదికపై చేసిన సూచన ఆలోచించదగింది. ప్రపంచబ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు పేద దేశాలను ప్రగతి వైపునకు మళ్లించేందుకు కాకుండా సామ్రాజ్యవాద దేశాల మార్కెట్‌ను విస్తరింపజేసుకొని, విసృంఖలంగా దోపిడీ చేసుకోడానికి దోహదపడుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం, మేధో సంపత్తిపై ఏకఛత్రాధిపత్యాన్ని తొలగించకుండా ఐరాస సహస్రాబ్ది లక్ష్యాలు, ప్రస్తుత ఎస్‌జిడి సాధన అసాధ్యం. పేదరిక నిర్మూలనకు ఐదు లక్షల కోట్ల డాలర్లు అవసరమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చాల్సి ఉంది. దేశాలు సైనిక వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెంచుతూ పేదరిక నిర్మూలనకు వనరుల్లేవనడం దుర్మార్గం. పర్యావరణ ప్రతికూలతల వలన అత్యధికంగా పేదలు నష్టపోతుండగా ఆపేరుతో పేద దేశాలపై సామ్రాజ్యవాద దేశాలు దాష్టీకం సాగించడం దుర్మార్గం. 
ఐరాస ముసాయిదా తాము తీసుకున్న లక్ష్యాలూ ఒకేలా ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోడీ వక్కాణించడం గమనార్హం. గత కాంగ్రెస్‌, ప్రస్తుత బిజెపి ప్రభుత్వాలు తలకెత్తుకున్న ఆర్థిక విధానాలు రెండు 'భారతాల'ను సృష్టిస్తున్నాయి. ఒక పక్క సహస్ర కోటీశ్వరులు పెరుగుతుంటే మరో పక్క అంతకంటే ఎన్నో రెట్ల వేగంతో పేదలూ పెరుగుతున్నారు. దేశంలో 77 శాతం మంది రోజుకు రూ.20 కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారని ప్రభుత్వ సర్వేనే పేర్కొంది. ముప్పై కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువనున్నారని గతంలో ప్రణాళికా సంఘం వెల్లడించింది. అసలు దేశంలో ఎంత మంది పేదలున్నారో, ప్రభుత్వ దృష్టిలో పేదలంటే ఎవరో కూడా నిర్ధారించకుండా పేదరిక నిర్మూలన ఎలా సాధ్యం? వ్యవసాయ దేశంలో వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకున్న దశలో, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న భయంకర పరిస్థితులను ఏ మాత్రం పట్టించుకోకుండా మోడీ 'అభివృద్ధి' నినాదం సాకారమవుతుందా? ప్రజల కొనుగోలు శక్తి పెంచకుండా మేక్‌ ఇన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియాలకు అర్థముందా?
భారత్‌ అయినా, మరే దేశమైనా తన విధానాలు, ప్రాధాన్యతలను మార్చుకుంటేనే పేదరిక నిర్మూలన లక్ష్యం నెరవేరుతుంది. ఐరాస సెక్రటరీ జనరల్‌ బాన్‌ కీ మూన్‌ ఉద్భోధించినట్లు మెరుగైన ప్రపంచం కోసం విశ్వజనీన, సమగ్ర దార్శనికత కావాలి. దీనికి ఉన్నతస్థాయి రాజకీయ నిబద్ధత, అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరం.