ఏపికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలకు సిద్ధం

రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పిస్తామని కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయకపోతే ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు పిలుపునిచ్చారు .ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని శుక్రవారం మరోసారి కేంద్ర మంత్రి లోక్‌సభలో ప్రకటించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్ర పునర్విభజన బిల్లుపై చర్చ సందర్భంగా అప్పటి ప్రధాని, ప్రతిపక్షపార్టీ నాయకులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ లోటు బడ్జెట్‌ పూడ్చడానికి 15 వేల కోట్లు, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్యాకేజీ ఇవ్వలేదని అన్నారు. రైల్వేజోన్‌లు, విద్యా,వైద్య సంస్థల నిర్మాణాలు అమలు కాలేదన్నారు. ఈ సమస్య సాంకేతికంగా వచ్చింది కాదని, కావాలనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తోందని ధ్వజమెత్తారు.