ఎస్సీ,ఎస్టీ చట్ట సవరణ..

జంతు కళేబరాలు, మనుషుల మృతదేహాలను తరలించాలనిగానీ... పారిశుధ్య పని (మానన్యువల్‌ స్కావెంజింగ్‌) చేయాలని గానీ ఎస్సీ, ఎస్టీలపై ఒత్తిడి చేస్తే కఠిన చర్యలు తప్పవు! ఈ దిశగా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో కేంద్ర ప్రభుత్వం పలు సవరణలు తీసుకొచ్చింది. మంగళవారం లోక్‌సభలో విపక్ష సభ్యులు లేకుండానే... ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ బిల్లు-2014 మూజువాణీ ఆమోదం పొందింది. దీని ప్రకారం... ఎన్నికల్లో ఫలానా వారికి ఓటు వేయాలనిగానీ, ఓటు వేయొద్దని కానీ ఒత్తిడి తెచ్చినా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు పెట్టవచ్చు. అంతేకాదు... ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన విధుల్లో నిర్లక్ష్యం వహించే నాన్‌ ఎస్సీ, ఎస్టీ అధికారిని ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూమిని కబ్జా చేయకూడదు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళను ఆమె అనుమతి లేకుండా లైంగికపరమైన ఉద్దేశంతో తాకినా, అలాంటి పదాలు వాడినా, సైగలు చేసినా నేరమే. ఎస్సీ, ఎస్టీ మహిళను దేవదాసీలుగా ప్రకటించకూడదు. ఎస్సీ, ఎస్టీలను ప్రార్థనా మందిరాలు, విద్యా, వైద్య సంస్థల్లో ప్రవేశించకుండా నిషేధించడం, ఉమ్మడి వనరులను వాడుకోకుండా ఆంక్షలు విధించడం, సామాజిక, ఆర్థిక బహిష్కరణ విధించడం వంటివన్నీ ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం కింద నేరాలే అవుతాయి. ఆయా కేసుల విచారణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ కేసుల్లో బాధితులను, సాక్ష్యులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అయితే... ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశాల గురించి సభ్యులు ప్రశ్నించినప్పుడు... ‘‘తప్పుడు కేసులు పెట్టిన వారిని శిక్షించేందుకు ఐపీసీలో సెక్షన్లు ఉన్నాయి’’ అని సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి తవర్‌ చంద్‌ గెహ్లాత్‌ తెలిపారు.