ఎన్.ఎ.ఒ.బి నిర్వాసితులందరికీ న్యాయం చేయాలి.

                నేవల్‌ ఆల్టర్నేట్‌ ఆపరేటివ్‌ బేస్‌ (ఎన్‌ఎఒబి) పేరుతో 2005లో ఎస్‌.రాయవరం, రాంబిల్లి మండలాల్లో 4412.53 ఎకరాల భూమి సేకరించడం జరిగింది. అందులో వేల్పుగుంటపాలెం, రేవువాతాడ, దేవళ్లపాలెం, పిసినిగొట్టిపాలెం గ్రామాల నిర్వాసితులకు ఎన్‌ఎఒబి కాలనీ పేరుతో 373 మందికి ఇళ్లు నిర్మాణం చేయడం జరిగింది. ఇందులో  మిగిలిన 34 మందికి దిబ్బపాలెం ఆర్‌హెచ్‌ కాలనీ ఇళ్లు కేటాయింపు జరిగాయి. మొత్తం 407 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. వీరు కాకుండా బంగారమ్మపాలెం, కొత్తపట్నం, వాడనర్సాపురం, యాతకొత్తపట్నం, కొప్పిగుంటపాలెం గ్రామాలను ప్రభావిత గ్రామాలగా గుర్తించారు. కానీ నేటికీ పూర్తిస్థాయిలో ప్రభుత్వం అంగీకరించిన నష్టపరిహారం చెల్లించలేదు. నేవల్‌ బేస్‌ నుండి రావల్సిన నష్టపరిహారం జిల్లా అధికారులకు అందజేసినా స్థానిక మత్స్యకారులకు, నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యదోరణిని ప్రదర్శిస్తున్నారు. బయోమెట్రిక్‌ కార్డులు తీసుకున్న వారందరికీ వెంటనే నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి బయోమెట్రిక్‌ కార్డు తీసుకున్న వారికి కూడా నేటికీ నష్టపరిహారం చెల్లించలేదు. దీనిని సిపియం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.

                నేడు నేవల్‌ ఆల్టర్ నేట్ ఆపరేటివ్‌ బేస్‌ (ఎన్‌ఎఒబి) ప్రాజెక్టు నిమిత్తం 1964`57 ఎకరాల భూముల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం తేది:20-10-2015న జి.వో.ఎం.ఎస్‌.నెం: 402 ను జారీ చేసింది.  దీనిలో ఎస్‌.రాయవరం మండలం వాకపాడు గ్రామ సర్వే నెం: 48లో 186.27 ఎకరాలు, రాంబిల్లి మండం రజా అగ్రహారం గ్రామ సర్వే నెం: 230లో 10.73.25 , సర్వేనెం: 229లో 686`10 ఎకరాలు, మర్రిపాలెం గ్రామ సర్వే నెం: 229`2లో 19.95 ఎకరాలకు 5 లక్షలు చొప్పున నష్టపరిహారం ప్రకటించింది.

                మరలా రెండో విడత నేవల్‌ బేస్‌ విస్తరణకు సన్నాహాలు ప్రభుత్వం చేయడానికి సిద్ధమైంది. కాని నేటికి కూడా మొదటి విడతలో పరిష్కారంకాని అనేక సమస్యలు వున్నాయి. రెండో విడత నేవల్‌ బేస్‌ విస్తరణ చేసే ముందు ఈ భూముల సేకరణకు సంబంధించి సామాజిక ప్రభావ అంచనా రిపోర్టులను  ఇచ్చి అక్కడున్న పరిస్థితితులను అధ్యయనం చేయాలి. దీని ఆధారంగా ఈ భూ సేకరణ అక్కడ ప్రజలకు, ఇతర వృత్తిదార్లకు ఇవ్వాల్సిన ప్యాకేజీ తదితరాలను ప్రకటించాల్సి వున్నది. అలాగే దీనికి 2013 చట్టం ప్రకారం ‘‘ప్రజాభిప్రాయ సేకరణ’’ను కూడా నిర్వహించాలి. ఇవేమీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవోను ఇచ్చింది. దీంతో ఆ ప్రాంత రైతులు, మత్స్యకారులు, ఇతర ప్రజలందరూ ఆందోళనకు గురౌతున్నారు.

                ఈ ప్రాజెక్టులకు ఆనుకొని ఉన్న శారదానదిలో కూడా మత్స్యవేట సాధ్యం కాదు. దీంతో మత్స్యకారులు, ఇతర వృత్తిదార్లు తీవ్రంగా నష్టపోతున్నారు. వీరందరినీ అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పిన కేంద్ర డిఫెన్స్‌ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అడ్డంకులనే సృష్టించింది. ఇప్పటికీ అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. మేజర్‌ సన్స్‌, గంపల మహిళకు, వితంతువులను నిర్ధిష్టంగా గుర్తించి పరిహారం ప్యాకేజీ ఇవ్వలేదు. నిర్వాసితులకు ఆర్‌ కార్డు ఇవ్వలేదు. నూతనంగా నిర్మించిన ఎన్‌ఎఒబి కాలనీని బయట ప్రాంతంకు సులువుగా వెళ్లే రహదారి సౌకర్యం ఇవ్వలేదు. యాతకొత్తపట్నం మేజర్‌ సన్స్‌కు పరిహారం ఇవ్వలేదు. మత్స్యకారులకు రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తామని, ప్రత్యేక హాస్పటల్‌, ఫిషింగ్‌ జెట్టీ నిర్మాణం వంటి కీలకమైన హామీలను సైతం ఇప్పటికీ పరిష్కరించలేదు.

                ఒక ప్రభుత్వ రంగ సంస్థ విషయంలోనే ఇలా జరిగితే, ప్రైవేటు సంస్థలు మరింత ఘోరంగా వ్యవహరిస్తాయి. తమ భూములు, గ్రామాలను సైతం ఇచ్చిన రైతు, మత్స్యకారులు, ఇతర వృత్తిదార్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. ఆ తర్వాతే రెండవ విడత కార్యక్రమాలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రెండవదశ ఎన్‌ఎఒబి ప్రాజెక్టు విషయంలో 2013 భూ అధికరణ చట్టం అమలు, అక్కడ సామాజిక ప్రభావ అంచనాల రిపోర్టును వెంటనే విడుదల చేయాని డిమాండ్‌ చేస్తున్నాం.

                  ఈ ప్రెస్ మీట్ లో సిపియం పార్టీ రాష్ర్ట కార్యదర్శి సిహెచ్.నరసింగరావు, జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, సిపియం రాంబిల్లి మండల నాయకులు జి.దేముడు నాయుడు, సిహెచ్.గంగరాజు పాల్గొన్నారు.