ఉధృతంగా మున్సిపల్‌ సమ్మె

 ఐదో రోజూ పారిశుధ్య కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగింది. వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగాయి. వీరి ఆందోళనలకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. సమ్మెలో భాగంగా మంగళవారం విజయవాడలో మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎపి మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(జెఎసి) ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వచ్చిన కార్మికులు నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం అక్కడి నుండి భారీ ర్యాలీగా కాళేశ్వరరావు మార్కెట్‌ సెంటర్‌ రహదారిపై కార్మికులు మోకాళ్లపై నిలబడి రాస్తారోకో నిర్వహించారు. ఆ తరువాత ప్రెస్‌క్లబ్‌లో మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో 'సమ్మె-ప్రభుత్వ వైఖరి' అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణాజిల్లా నందిగామలో కార్మికులు అర్ధనగ ప్రదర్శన, జగ్గయ్యపేటలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎల్‌ఐసి ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. మచిలీపట్నం, ఉయ్యూరు, తిరువూరు, గుడివాడ, పెడనలో దీక్షలు కొనసాగుతున్నాయి. వీరికి వైసిపి నాయకులు మద్దతు తెలిపారు. గుంటూరు జిల్లావ్యాప్తంగా అన్ని మున్సిపల్‌ కేంద్రాల్లో కార్మికులు దీక్షా శిబిరాలు ఏర్పాటు చేశారు. గుంటూరులో అత్యవసర సేవలను బంద్‌ చేశారు. నరసరావుపేటలో మానవహారం, వీరికి మద్దతుగా సిఐటియు ఆధ్వర్యంలో ఆర్‌టిసి డిపో వద్ద రాస్తారోకో చేశారు. సత్తెనపల్లిలో నోటికి నల్ల రిబ్బన్లు ధరించి నిరసన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఆందోళనకు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చలమయ్య మద్దతు తెలిపారు. మంగళగిరిలో దీక్షలకు వ్యకాస మద్దతు తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం మున్సిపల్‌ కార్యాలయాల వద్ద కార్మికులు రిలే నిరాహార దీక్ష చేశారు. విశాఖ జిల్లా భీమిలి, గాజువాక, మధురవాడ జోనల్‌ కార్యాలయాల ఎదుట కార్మికులు నిరసనలు తెలిపారు. జివిఎంసి ప్రధాన కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులకు మద్దతు తెలుపుతూ ఎఐటియుసి ధర్నా, మల్కాపురం బస్టాపు వద్ద జివిఎంసి ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యాన రాస్తారోకో నిర్వహించారు. జివిఎంసి కమిషనర్‌కు వామపక్షాల నాయకులు వినతిపత్రం అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులు నల్ల రిబ్బన్లు కళ్లకు, నోటికీ కట్టుకుని నిరసన తెలిపారు. 
వీరి ఆందోళనకు సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌, బిజెపి, లోక్‌సత్తా పార్టీల ప్రతినిధులు మద్దతు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పోటీ కార్మికులతో పారిశుధ్య పనులు చేపట్టడాన్ని అడ్డుకున్న ఆందోళనకారుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించిన ప్రజాప్రతినిధుల తీరును జిల్లావ్యాప్తంగా కార్మిక, ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ సందర్భంగా ఏలూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఆందోళన ఉధృతం చేశారు. రిలేనిరాహార దీక్షలు చేపట్టారు. తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం మున్సిపాలిటీల్లో కార్మికుల సమ్మె కొనసాగింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టరేట్‌ ఎదుట నిరవధిక ధర్నా శిబిరాన్ని ప్రారంభించారు. చీరాల్లో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట దీక్షలు చేపట్టారు. ఆ దీక్షా శిబిరాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు సందర్శించి ఆందోళనకు మద్దతు తెలిపారు. మార్కాపురం, కందుకూరు, చీమకుర్తి, కనిగిరి, అద్దంకిల్లోనూ ధర్నాలు నిర్వహించారు. నెల్లూరు కార్పొరేషన్‌లో మస్తర్‌ కార్యాలయం వద్ద తెల్లవారుజామునే బైఠాయింపు జరిపారు. సమీప గ్రామాల నుంచి కొత్తవారితో పనులు నిర్వహించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట, ఇతర మున్సిపాలిటీల్లో ధర్నాలు జరిపారు. చిత్తూరు జిల్లాలో అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్లలో కార్మికులు అర్ధనగంగా ధర్నా నిర్వహించారు. తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మద్దతుగా దీక్ష చేపట్టారు. అయితే ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొంతమంది కార్మికులు చెత్తకుండీల వద్ద పేరుకుపోయిన చెత్తను గ్లౌజ్‌లు, మాస్క్‌లు లేకుండానే శుభ్రం చేయడం గమనార్హం. కడప జిల్లావ్యాప్తంగా కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కడపలో మంత్రి నారాయణ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కర్నూలులో జరిగిన నిరసన ర్యాలీలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.షడ్రక్‌ పాల్గొని మద్దతు తెలిపారు. వెంటనే మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనంతపురం జిల్లావ్యాప్తంగా సమ్మె కొనసాగుతోంది.