ఉత్తి మాటలతో విద్యరాదు

రాజమండ్రిలో 2015 జులై 22న జరిగిన ప్రాంతీయ విద్యా సదస్సులో మీరు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాభివృద్ధికి పలు నిర్ణయాలు, ఆదేశాలు జారీ చేశారు. సంతోషం. రాష్ట్ర అభివృద్ధికి విద్యాభివృద్ధి ఎంతో కీలకం. నేడు మన రాష్ట్రంలో అక్షరాస్యత 67.41 శాతం మాత్రమే ఉంది. రాష్ట్ర సగటు కంటే ఆరు జిల్లాలు, దేశ సగటు అక్షరాస్యత (74.04 శాతం) కంటే 12 జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. విజయనగరం, కర్నూలు జిల్లాల్లో 60 శాతం కూడా లేదు. రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యత సాధించాలన్నారు. సుమారు 60 ఏళ్ళలో సాధించలేనిది నాలుగు సంవత్సరాలలో సాధించడం సాధ్యమా? దానికి తగిన ప్రణాళిక ఏది? నిధులు ఏవి? అవి ప్రకటించకుండా ఆదేశాలు జారీ చేయడం ప్రజల్ని మభ్య పెట్టడమే కదా!
ఇప్పటికీ 50 శాతం అక్షరాస్యత దాటని మండలాలు రెండు వందలకు పైగా ఉన్నాయి. దేశంలో అక్షరాస్యతలో 31వ స్థానంలో ఉన్నాం. మీరు ప్రకటించిన అంశాలు వాస్తవ రూపం దాల్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది సాధ్యం కావాలంటే రాష్ట్ర బడ్జెట్‌లో 25 శాతం విద్యారంగానికి కేటాయించాలి. ఇప్పటికే కేటాయింపులు 15 శాతం మాత్రమే. రాష్ట్రంలో 15 వేల దాకా టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 90 శాతం ఎంఇఒ, డివైఇఒ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 30 శాతం స్కూళ్ళలో టాయిలెట్స్‌ లేక బాలికలు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులున్నప్పటికీ ప్రభుత్వ స్కూళ్ళలోనే 63 శాతం విద్యార్థులున్నారు. ఫలితాలు ప్రతియేటా పెరుగుతున్నాయి.ఈ వాస్తవాలు వదిలేసి కార్పొరేట్‌ స్కూళ్ళు బాగున్నాయని, ప్రభుత్వ స్కూళ్ళు పనికిరావని వాస్తవ విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఎన్ని ఇబ్బందులున్నా కార్పొరేట్‌ స్కూళ్ళ కంటే మెరుగైన ఫలితాలు సాధించిన నవోదయ, గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వాటిని మెరుగుపరచి ప్రోత్సహించడం మానేసి, కార్పొరేట్‌ స్కూళ్ళు బాగున్నాయని చెప్పడం బాధ్యత నుంచి తప్పుకోవడమే. మీరు ముద్దు పేరుతో పిలుస్తున్న కార్పొరేట్‌, ప్రైవేట్‌ స్కూళ్ళు పేద, మధ్య తరగతి ప్రజల నుంచి ఫీజులు దోచుకుంటున్నాయి. అపార్టుమెంట్లలో, అశాస్త్రీయమైన బోధనతో నడుస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలు, బోధన, పరీక్షా పద్ధతులు కూడా పాటించరు. ముందు వాటిని కంట్రోలు చేయడానికి చట్టం చేయండి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్‌ స్కూళ్ళలో 25 శాతం మంది పేద పిల్లల్ని చేర్చని రాష్ట్రాలలో మన రాష్ట్రం ముందు ఉంది. అది అమలు జరిపించండి.
ప్రాథమిక విద్య నాసిరకంగా ఉందన్నారు. మన రాష్ట్రంలో ప్రాథమిక విద్యను ప్రయోగశాలగా మార్చింది ఎవరు? తరగతికి ఒక టీచరున్న పాఠశాలలు కేరళ రాష్ట్రంలో 93 శాతం ఉంటే మనకు 4 శాతం ఉన్నాయి. మనం మంచి పాఠశాలలు ఏర్పాటు చేయడం మానేసి, ఉన్నవి మూతవేసే పనిలో ఉన్నాం. పాఠశాలల పని దినాల్లో టీచర్లను శిక్షణకు పంపుతున్నారు. ఇక ఆ పాఠశాలలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయో తమరే సెలవివ్వాలి. పర్యవేక్షణ వ్యవస్థ లేదు. 'బడి పిలుస్తోంది' కార్యక్రమం పూర్తి అయ్యేలోగా ప్రతి స్కూల్‌లో టాయిలెట్స్‌, మంచినీటి సౌకర్యం ఉండాలని తమరు ఆదేశించినా ఇప్పటికీ అమలు కాలేదని మీ ప్రకటనను బట్టి తెలుస్తోంది! ఉన్నత పాఠశాలలన్నింటిలో వైఫై పథకం మంచిదే. కంప్యూటర్‌ ఫ్యాకల్టీలు రద్దయినందున రెండు సంవత్సరాల నుంచి ఉన్న కంప్యూటర్లకు దుమ్ము పట్టి ఉన్నాయి. ఈ విషయం మీ దృష్టిలో లేనట్లుంది? కేరళలో వామపక్ష ప్రభుత్వం కంప్యూటర్‌ విద్యను ఒక పాఠ్యాంశంగా చేర్చింది. 10వ తరగతిలో పరీక్ష ఉంటుంది. మన రాష్ట్రం నాలెడ్జ్‌ హబ్‌గా తయారవ్వాలంటే మన విద్యార్ధులకు కంప్యూటర్‌ విద్య సిలబస్‌లో చేర్చి, ఉపాధ్యాయులను నియమించాల్సి ఉండగా అవన్నీ చేయకుండా వైఫై వలన ప్రయోజనం ఏమిటో తెలపాలి. కంప్యూటర్‌ విద్య చెప్పే వారే లేకుండా ల్యాబ్‌లు ఇస్తామనడం ప్రయోజనం ప్రక్కదారి పడుతుంది. ఉన్నత పాఠశాలల్లో ఆట వస్తువులకు, ఆటల పోటీలకు బడ్జెట్‌లు కేటాయించకుండా, తగినంత మంది వ్యాయామ ఉపాధ్యాయులు లేకుండా పిల్లలకు శరీరక దారుఢ్యానికి తగిన ఆహారం అందించకుండా విద్యార్థులను ఒలింపిక్స్‌కు ఎలా తయారు చేయాలి? చిత్తూరు జిల్లా యర్రావారి పాలెం నుంచి హాకీ ఒలింపిక్స్‌కు సెలెక్ట్‌ అయిన రజని దుర్గతిని ఒక్కసారి తమ ప్రభుత్వం పట్టించుకోవాలని మనవి. మన రాష్ట్రంలో దాదాపు సగం మంది విద్యార్థులు ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాలయాల్లో ఉన్నారు. వీటిలో ఆటస్థలం ఉన్నవే అరుదు. నిబంధనలకు విరుద్ధంగా అపార్టుమెంట్లలో నడుస్తున్నాయి. అక్కడ చదివే విద్యార్థులకు ఆటలు దాదాపు శూన్యం. ఇక వారి నుంచి ఎంతమంది ఒలింపిక్‌ క్రీడాకారులు వస్తారో?
ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత పెంచేందుకు కృషి చేయాల్సిందే. అందుకు తగిన సౌకర్యాలు పాఠశాలల్లో కల్పించాలి. అన్ని సబ్జెక్టులకు టీచర్లుండేలా చూడాలి. లెక్కల మాస్టార్లే లేని కొన్ని మున్సిపల్‌ స్కూళ్ళలో ఐఐటి ఫౌండేషన్‌ కోర్సులు పెట్టాలని మన మున్సిపల్‌ మంత్రిగారు ఆదేశిస్తున్నారు! ''ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కుతానన్నట్టుంది.'' ఎన్ని ఉన్నత పాఠశాలల్లో లైబ్రరీ, లాబొరేటరీ సౌకర్యాలున్నాయి? ఇప్పటికీ అందరికీ పాఠ్యపుస్తకాలు అందలేదు. స్పష్టమైన పరీక్షా విధానం ప్రకటించలేదు. కేవలం 10వ తరగతిలోనే మంచి ఫలితాలు అనే లక్ష్యంగా కాక 6వ తరగతి నుంచి నాణ్యత పెంచేలా చర్యలు చేపట్టాలి. అందుకు ముందుగా ప్రాథమిక విద్యను పటిష్టపరచాలి. అప్పుడు మన ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ కంటే మంచి ఫలితాలు వస్తాయి తప్ప, ఉన్న ఉపాధ్యాయుల్ని ప్రతిజ్ఞలు చేయించడం వల్ల ప్రయోజనాలు ఉండవు. వెంటనే విద్యారంగం పట్ల ఒక స్పష్టమైన విధానం ప్రకటించాలి. విద్యామిషన్‌ అమలుకు తగిన నిధులు కేటాయించాలి. రోల్‌మోడల్‌గా నవోదయ, గురుకులాలు ఉన్నాయి. ప్రభుత్వ బడుల్లో చదివి అత్యంత ఉన్నత స్థానాల్లో ఉన్న వారెందరో ఉన్నారు. ప్రభుత్వ అధినేతలే కార్పొరేట్‌ పాఠశాలల గురించి చెప్పడం పరోక్షంగా వాటికి ప్రచారం చేసినట్లుగా భావించాల్సి ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీకి తట్టుకోవాలంటే పాఠశాల స్థాయి నుంచి నాణ్యమైన విద్య అందించాలి. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం వలన అరకొర చదువులతో విద్యార్థులు ఉన్నత చదువులకెళ్తున్నారు. ఇంజనీరింగ్‌ చదివినా వేలాది మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో విద్య ప్రభుత్వ రంగంలోనే ఉంది. ఇప్పటికీ 63 శాతం మంది విద్యార్థులు చదువుతున్న మన రాష్ట్ర ప్రభుత్వ విద్యా రంగాన్ని మెరుగుపరిచే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
తెలుగుదేశం పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రతి యేటా డిఎస్‌సి జరపాలి. పేద పిల్లలకు కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య అందించాలి. వొకేషనల్‌ కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలి. మధ్యాహ్న భోజన పథకంలో ప్రతి రోజూ కోడిగుడ్డుతో పౌష్టికాహారం అందించాలి. అన్ని విద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించాలి. మాతృభాషలోనే ప్రాథమిక విద్య, ఇంగ్లీషు ఒక సబ్జెక్టుగా బోధించాలి. ఇవన్నీ అమలు జరగాలంటే 25 శాతం విద్యకు బడ్జెట్‌ కేటాయించాలి.
- వి కృష్ణయ్య