ఉత్తరాంధ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టండి

     ఉత్తరాంధ్ర అభివృద్ధికి తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక సర్క్యూట్‌ హౌస్‌లో వినతిపత్రాన్ని అందజేశారు. 
వినతి పత్రంలోని వివరాలను వేదిక ప్రధాన కార్యదర్శి ఎ అజశర్మ మీడియాకు తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 46లో పేర్కొన్న విధంగా ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, సెక్షన్‌ 94(2)లోని మౌలిక వసతుల కల్పన, సెక్షన్‌ 93(13 షెడ్యూల్‌)లోని ఐఐఎం, గిరిజన యూనివర్శిటీ, ప్రత్యేక రైల్వే జోన్‌ వంటి వాటిపై తక్షణమే స్పందించాలన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు ప్రధాన కారణం సాగునీటి సౌకర్యం లేకపోవడమేనన్నారు. పేదరికంతో ప్రజలు వలసలు పోతున్నారన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు బలహీనపడటంతో పాటు, జ్యూట్‌, చక్కెర, ఫెర్రో ఎల్లాయిస్‌వంటి ఉపాధి కల్పించే పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు. ఇందువల్ల వేల సంఖ్యలో కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. నూతనంగా వస్తున్న రసాయన, మందుల పరిశ్రమలు, విద్యుత్‌ప్లాంటుల వంటివన్నీ కాలుష్యాన్ని వెదజల్లేవే కావడంతో వ్యవసాయం దెబ్బతినటమే కాకుండా, ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి బారినపడి ప్రజలు అవస్థలకు గురవుతున్నారన్నారు. పంచగ్రామాలు, గాజువాక ఈనాం భూ సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. గత ప్రభుత్వాలు ఈ సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్య వైఖరిని అనుసరించాయని విమర్శించారు. యుద్ధ ప్రాతిపదికన గోదావరి నీటితో విశాఖ మహానగర తాగునీటి అవసరాలను తీర్చే చర్యలు చేపట్టాలన్నారు. వంశధార, నాగావళి నదులపై ప్రాజెక్టులను పూర్తిచేయాలన్నారు. ఈ విషయంలో ఒడిశా ప్రభుత్వంతో ఉన్న అభ్యంతరాలను ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని పరిష్కరించాలన్నారు. స్టీలుప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సహకార చక్కెర ఫ్యాక్టరీలను పటిష్టం చేయాలన్నారు. తుమ్మపాల ఫ్యాక్టరీలో క్రషింగ్‌ను వెంటనే ప్రారంభించేలా ఆదేశించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగు సాంస్కృతిక కేంద్రాన్ని విజయనగరంలో అభివృద్ధి చేయాలని కోరారు.