ఉడతకేల ఊర్లో పెత్తనం..

వంద ఎలుకలు తిన్న పిల్లి శాకాహారులను విమర్శిస్తూ కాశీకి బయలుదేరినట్లుగా ఈనెల 2న జరిగిన దేశవ్యాప్త సమ్మెను విమర్శిస్తూ పారిశ్రామిక, వ్యాపారవేత్తల సంఘాలు దేశభక్తి తమకే ఉన్నట్లు నీతి వాక్యాలు బోధిస్తున్నాయి. పాలకుల పంచన చేరిన బడా పారిశ్రామిక, వ్యాపారవేత్తలు (కార్పొరేట్లు) దేశ ఆర్థిక వ్యవస్థకు సమ్మె వల్ల వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిందని అంటున్నారు. దేశభక్తుల ఇంటికి, తమకు తడికే అడ్డం అన్నట్లు మీడియాకు సమాచారం ఇచ్చారు. భారత్‌కు వ్యాపార నిర్వహణకు అనుకూలంగా ఉన్న దేశం అనే మంచి పేరు పోతుందని ఆవేదన వ్యక్త పరిచారు. ఇంతటితో ఆగకుండా దేశంలో పెట్టుబడుల వాతావరణం దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్నారు. ఉపాధి కల్పనకు కార్మిక చట్టాల సంస్కరణలు కీలకమైనవని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిస్టీస్‌ (సిఐఐ) వెల్లడించింది. సమ్మెలు దేశ అభివృద్ధిని అడ్డుకుంటాయంటూ ఒక్కరోజు సమ్మె వల్ల రూ.25 వేల కోట్లు నష్టం జరిగిందని అసోసియేటెడ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ ఆఫ్‌ ఇండియా (అసోచామ్‌) నీతివాక్యాల చాటున తమ అక్కసును వెళ్ళగక్కింది. కేంద్రంలో ఉదారవాద విధానాలను ఉపయోగించుకొని ఆర్థిక అక్రమాల్లో ఆరితేరిన బడాపారిశ్రామిక, వ్యాపారవేత్తలు కొందరు పాలకుల మాటలను తమ మాటలుగా వల్లిస్తున్నారు.
దేశ సంపదను విదేశీ, స్వదేశీ బడాపారిశ్రామికవేత్తలకు తాకట్టు పెట్టే విధానాలను కేంద్ర వామపక్ష కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తు న్నాయి. మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని, సంపద సృష్టికి కారణమైన కార్మికులను యజమానులకు బానిస లుగా మార్చే కార్మిక చట్టాల సవరణను ఆపాలని 15 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు పాల్గొ న్న ఈ దేశవ్యాప్త సమ్మె చరిత్రలో ఒక మైలు రాయిలాంటిది. ప్రతి సంవత్సరం దాదాపు రూ.6 లక్షల కోట్లు రాయితీ పొందుతూ మరోవైపు లక్షల కోట్ల రూపా యలు పన్నులు చెల్లించని కార్పొరేటర్లకు దేశ ఆర్థిక పరిస్థితి గుర్తుకు రాదా..? వనరులను కొల్లగొట్టి తమ సంపద పెంచుకుంటూ కొత్తకొత్త వ్యాపారాల్లో ప్రవేశి స్తున్నారు. పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించడానికి తీసుకున్న బ్యాంకు రుణా లు లక్షల కోట్లు చెల్లించకుండా ఆర్థికవ్యవస్థను కుంటుబరుస్తుంటే పెట్టుబడులు వస్తాయా..? దేశంలో భారీ రాయితీలు పొంది వందల నుంచి వేల కోట్ల రూపాయలకు పడగలెత్తుతున్నారు. తొండ ముదిరి ఊసరవెల్లిగా మారినట్లు విదేశాలలో పరిశ్రమలు పెట్టి అక్కడ పారిశ్రామికాభివృద్ధికి ఉపయోగపడుతున్న కార్పొరేట్ల విధానాల వల్ల మనదేశంలో ఉపాధి దొరుకుతుందా?
ఈ విధానాల వల్లనే భారతదేశం వస్తూత్పత్తిలోనూ, ఎగుమతుల్లో ప్రపంచంలో 19వ స్థానంలో ఉంది. కానీ నల్లధనం ఎగుమతుల్లో మాత్రం ఐదవ స్థానంలో ఉన్నది. పొట్టకూటి కోసం చిన్న తప్పు చేసిన పేదవాడిని జైల్లో పెడుతున్నారు. కార్పొరేట్‌ సంస్థల అధిపతులు ప్రతి సంవత్సరం పాలకులపై ఒత్తిడి తెచ్చి 20 నుంచి 30 వేల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు రద్దు చేయిం చుకుంటున్నారు. ఒకే ఆస్తిని తనఖా పెట్టి నాలుగైదు బ్యాంకుల్లో రుణాలు తీసు కుంటున్న కార్పొరేట్‌ సంస్థలు ఉన్నాయని ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ రఘు రాం రాజన్‌ ఆవేదన వ్యక్తం చేశారంటే కార్పొరేట్ల ఆర్థిక అక్రమాలు ఎంతగా పెరిగాయో అర్థమవుతుంది. ఇన్ని అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపార, పారిశ్రా మికవేత్తలకు మరిన్ని హక్కులు కావాలంటున్నారు. జాతి మొత్తాన్ని సుసంపన్నం చేయాల్సిన వనరులన్నీ కూడా అక్రమంగా కొందరే దక్కించుకొని ఆ కొందరే సంపన్నులు అవుతున్నారని నయా ఉదారవాద విధానాలను పరోక్షంగా ఆయన విమర్శించారు. ఇలాంటి అక్రమ సంపాదనను చట్టబద్ధమైన నిధుల క్రిందకు మార్చుకోవడం కోసం స్టాక్‌ మార్కెట్లో దుకాణాలు తెరిచిన 900 కంపెనీలను సెబి గుర్తించింది. దర్యాప్తు కోసం ఈ కేసులన్నీ ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సిబిడిటి)కు అప్పజెప్పినట్లు ఈ మధ్యనే సెబి ఛైర్మన్‌ యుకె సిన్హా వెల్లడించారు.
అధికార పార్టీ పెద్దల అండదండలతో ప్రైవేట్‌ టెలికాం కంపెనీల పెద్దలు కొందరు చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు చెల్లించడం లేదని కాగ్‌ సంస్థ తప్పు పట్టడంతో పాటు పార్లమెంటుకు తెలిపింది. రిలయన్స్‌, జియో, ఎయిర్‌టెల్‌, ఆర్‌కామ్‌, టాటా టెలి వంటి కంపెనీల పద్దులో రూ.31 వేల కోట్లు తేడా వచ్చిందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) గత మేలో ఆరోపించింది. దీంతో పాటు మొబైల్‌ అవర్స్‌కు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనల్లో జరిమానా వేయకపోవడం వలన కేంద్ర ప్రభుత్వానికి రాబడి రూ. 4,300 కోట్ల మేర గండిపడిందని తెలిపింది. గతంలో సుప్రీంకోర్టు లైసెన్స్‌లు రద్దు చేసిన ఎనిమిది ప్రైవేట్‌ కంపెనీల నుంచి రిజర్వ్‌ ధరను వసూలు చేయక పోవడంతో మరో 20 వేల కోట్ల రూపాయలకు లెక్కలో తేడా వచ్చిందని నాలుగు నెలల క్రితం కాగ్‌ తమ నివేదికను పార్లమెంటు ముందుంచింది. పారిశ్రామిక, వ్యాపారవేత్తల సంఘాల పెద్దలు చేసిన విమర్శలను పరిశీలిద్దాం. ఒక రోజు స మ్మె వల్ల రూ.25 వేల కోట్ల నష్టం ఆర్థికవ్యవస్థకు వచ్చిందని అంటున్నారు. రోజు కు రూ.25 వేల కోట్లు అంటే నెలకు రూ.7 లక్షల 50 వేల కోట్లు, సంవ త్సరానికి రూ.90 లక్షల కోట్లు. ఆర్థిక వ్యవస్థకు ఉద్యోగులు, కార్మికులు మూల స్తంభాల లాంటి వారే కదా. వీరి ఉద్యోగ భద్రతకు అనుకూల చట్టాల అవసరం లేదా? తమ సంపదను పెంచుకోవడం తప్ప ప్రజా క్షేమం పట్టని వీరికి ఉడతకేల ఊర్లో పెత్త నం అన్నట్లు ఉద్యోగులు, కార్మికుల పోరాటాల గురించి మాట్లాడే అర్హత లేదంటూ కార్మిక చట్టాల సవరణలకు వ్యతిరేకంగా పోరాటాలను కొనసాగించాలి.
ఇరిగినేని పుల్లారెడ్డి