
ఉరి ఉగ్రవాద దాడి తరువాత దేశంలో పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదం పై చర్చ సాగుతుంది. కాశ్మీర్ లోయలో కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి. దేశ భక్తి పేరుతో ఉన్మాదాన్ని ప్రేరేపించే ప్రయత్నాలు సాగుతున్నాయి. సర్జికల్ దాడుల తరువాత ఆ ఘనత తమదేనని లాభాల వేట మొదలయ్యింది. పనిలో పనిగా ఏదేశ వస్తువులు కొనాలో, వద్దో చర్చ జరుగుతుంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నాలు అనేక విషయాల్లో సాగినట్టుగానే ఉగ్రవాద విషయం లోనూ వాస్తవాలు కప్పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి.
మనదేశంలోని పఠాన్ కోట, ఉరి తో పాటు పారిస్, ఇస్తాంబుల్, ఢాకా, బాగ్దాద్, సౌదీ అరేబియా ఇలా గత ఆరునెలల్లో అరడజను దేశాలపై ఉగ్రవాదం పంజా విసిరింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పెనుభూతంగా మారింది. ఎందుకిలా జరుగుతుందో మనం పరిశీలించాలి. సామ్రాజ్యవాదం మార్కెట్ కోసం ఒకపక్క భౌగోళికంగా ప్రపంచ దేశాలను పంచుకుంటూ తమ గుప్పెట్లో పెట్టుకుంటూ పోతోంది. సామ్రాజ్యవాదం వ్యవస్థలో పెంచుతున్న అసమానత, ధనిక, పేద అంతరాలు, నిరుద్యోగం లాంటి వైరుధ్యాలు పెరుగుతున్నాయి. పెట్టుబడి ఏదేశంలో పెద్దఎత్తున విస్తరిస్తోందో, అక్కడ సమాజాలకు అనుగుణంగా కొన్ని దశాబ్దాలుగా నిర్మితమైన వ్యవస్థ పొరలను అది ధ్వంసం చేయడం ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు సామ్రాజ్యవాదానికి వంతపాడుతుండటంతో, సంస్కృతిని, ఉపాధిని, హక్కులను కోల్పోతున్న అణగారిన ప్రజలు కొన్ని ప్రాంతాలలో మతం పేరిట ఐక్యం అయ్యే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈవిధంగా సామ్రాజ్యవాదానికి, ఉగ్రవాదానికి మధ్య విడదీయలేని సంబంధం ఉంది. నిరక్షరాస్యత, నిరుద్యోగం, ఉపాధిలేమి, పేదరికం లాంటి కీలక అంశాలే ఉగ్రవాదానికి ప్రధాన కారణాలని సహజంగా అందరూ భావిస్తారు. అది ఒక కారణం మాత్రమే. ఈ అసహనానికి దాంతోపాటు అనేక కారణాలుంటాయి.
ఉగ్రవాదపు రక్తపు మరకల వెనుక ఉన్నదెవరు?
సామ్రాజ్యవాద దేశాల ఆధిపత్య ధోరణి, గొంతెమ్మకోర్కెలే ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ స్టేట్ లాంటి ఉగ్రవాద సంస్థల పుట్టుకకు కారణమవుతున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాలు తమ అవసరాలు ప్రపంచ అవసరాలుగా మలిచి ఇరాక్, లిబియా, సిరియా, ఆప్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో అక్కడి సహజవనరులను దోచుకోవడం కోసం, అక్కడ తమ కనుకూలమైన కీలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి అక్కడి ప్రజాస్వామ్య ప్రభుత్వాలపై తిరుగుబాట్లను రెచ్చగొట్టడం, దారికి రాకపోతే ఆయా దేశాలపై ఏదో ఒక నింద మోపి యుద్ధాలు చేయడమే, నేటి ఉగ్రవాద దాడులకు మూల కారణమన్నది వాస్తవం.
చరిత్రను పరిశీలిస్తే ఉగ్రవాదం పుట్టుక ఎలా జరిగిందో మనకు తెలుస్తుంది. ఆప్ఘనిస్తాన్‌లో సోవియట్ యూనియన్‌ను నిలువరించడం కోసం అమెరికా, పాకిస్తాన్‌లు కలిసి తాలిబాన్‌లను పెంచి పోషించి సోవియెట్ పైకి ఉసిగొల్పాయి. 1979లో ఆఫ్ఘనిస్థాన్‌కీ సోవియట్ యూనియన్‌కీ మధ్య సాగిన సమరంలో లాడెన్‌ది కీలక పాత్ర. తాలిబాన్ నాయకులలో ఒకడైన ఒసా మా బిన్ లాడెన్ స్థాపించినదే అల్‌ఖైదా ఉగ్రవాదసంస్థ. అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ రహస్యంగా ఆఫ్ఘన్ తీవ్రవాదులకు వందల మిలియన్ డాలర్ల సాయం చేసింది. అధునాతన ఆయుధాలను అందించింది. మొదట ముజాహిద్దీన్ ఖుద్స్ అనే సంస్థ తరఫున యుద్ధంలో పాల్గోన్నాడు లాడెన్. ఈ యుద్ధంలో ఒక సోవియట్ సైనికుడి తుపాకీ లాక్కుని అతడ్ని ఉట్టిచేతులతో హతమార్చిన చరిత్ర లాడెన్‌ది. అప్పట్లో అమెరికాకు లాడెన్ ఆపద్బాంధవుడిలా కనిపించాడు. లాడెన్ అన్న ఆయుధం దొరికినందుకు సంబరం చేసుకుంది అగ్రదేశం. లాడెన్‌కీ సీఐఏకీ అవినాభావ సంబంధాలు నడిచాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. అమెరికా అగ్రవాదంలోంచి పుట్టుకొచ్చిన ఉగ్రవాదానికి మానవ రూపం నిస్సందేహంగా ఒసామా బిన్ లాడెన్.
అదే విధంగా ఇరాక్‌లో సామూహిక జనహనన ఆయుధాలున్నాయనే అబధ్ధం పేరుతో దాడులకు దిగిన అమెరికా, నాటో దేశాలు 2006లో సద్దాంను అన్యాయంగా ఉరితీశాయి. అప్పటి వరకూ ఇరాక్‌లో సద్ధాం హుస్సేన్ నాయకత్వంలోని సున్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా షియా ప్రభుత్వాన్ని ఏర్పరచి.. స్థానిక ప్రజల్లో అలజడి సృష్టించి.. అది ప్రపంచ ప్రళయంగా మారే ప్రమాదాన్ని తీసుకొచ్చింది ముమ్మాటికీ అమెరికానే. సరిగ్గా ఇదే సమయంలో ఇస్లామిక్ స్టేట్ విజృభించడం ప్రారంభించింది. మొదట్లో లాడెన్ ప్రోద్బలంతో అల్‌ఖైదా ఇన్ ఇరాక్ గా ప్రారంభమై 2006 తరువాత ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ ( ఐయస్ ఐయస్) గా మారింది. మొదట్లో అమెరికా సైన్యాల చేతిలో ఇది బాగా దెబ్బతిన్నప్పటికీ, అబూబకర్ అల్ బాగ్దాదీ దీని పగ్గాలను చేపట్టిన తరువాత దీని విజృంభణ ఆరంభమైంది. మెల్లగా స్థానిక తీవ్రవాద సంస్థలను తనలో విలీనం చేసుకొని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ ఆండ్ సిరియాగా అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించే క్రమంలో ఈమధ్య కాలంలో ఏకంగా ఇస్లామిక్ స్టేట్‌గానే ఉనికిని చాటుకుంటోంది. ఈ సంస్థకు చెందిన ఉగ్రవాదులంతా అతివాద సున్నీలు. ఇరాక్, సిరియాల తరువాత జోర్డాన్, లెబనాన్‌లకు విస్తరించి, పాలస్తీనాను విముక్తంచేసి ఖలీఫా రాజ్యం తెస్తామని, తరువాత ప్రపంచమంతా ఖలీఫా రాజ్యం రావాలనేది వీరి ప్రధాన అజెండా. ఇరాక్, సిరియాల్లోని చమురు బావులపై ఆధిపత్యం సాధించి వర్తకం నిర్వహించడం ద్వారా కోట్ల రూపాయలను ఆర్జిస్తూ ప్రపంచంలోనే అత్యంత సంపన్నవంతమైన ఉగ్రవాద సంస్థగా ఎదిగింది.
ఇజ్రాయిలుకు మద్దత్తుగా పాలస్తీనాలో జరిగిన విధ్వంసం ఖరీదు.. అక్షరాలా 48వేల కోట్ల రూపాయలు. వేలాది మంది చనిపోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. సామాన్యులు, చివరికి చిన్నపిల్లలు కూడా హృదయవిదారకంగా ప్రాణాలు విడిచిన విచలిత దృశ్యాల్ని ప్రపంచమంతా ప్రత్యక్షంగా చూసింది. విచక్షణ లేకుండా ఇజ్రాయెల్ సాగించిన దాడుల్లో చనిపోయిన వారిలో మూడొంతుల మంది సాధారణ పౌరులే. యుద్ధంలో సాధారణ పౌరుల్ని చంపడం, జనవాసాలపై దాడులు చేయడం, వారిని సామూహిక శిక్షలకు గురి చేయడం ఇవన్నీ అంతర్జాతీయ చట్టాల ప్రకారం అతిపెద్ద యుద్ధ నేరాలు. లిబియాలో గడాఫీ విషయంలో ఇదే జరిగింది. గడాఫీకి వ్యతిరేకంగా అలజడి రేకెత్తించి చివరికి అతనిని చంపేసింది.
అవసరమైతే ఆయా దేశాల్లో వీధి పోరాటలను ఉసిగొల్పడం దగ్గరినుంచి, తమ మాటకు లొంగని వాళ్లను ప్రలోభాలతో లొంగదీసుకునే వరకూ..అమెరికా పన్నని పన్నాగం లేదు. ఇటు వైపు ఆయుధాలను అమ్ముతూ.. అటు వైపు యుద్ధాలు చేయిస్తూ.. మధ్యమధ్యలో ఆ యుద్ధాలు తప్పని అంతర్జాతీయ సమాజంతో నిరసనలు తెలియచేస్తూ.. అమెరికా సాగిస్తున్న కపట నాటకానికి పుట్టిన పిల్లలే మొన్నటి అల్ ఖాయిదా, నేటి ఐఎస్‌ఐఎస్. రెండో ప్రపంచ యుద్ధం కావచ్చు.. అందులో జారవిడిచిన అణుబాంబులు కావచ్చు.. వియత్నాం యుద్ధంలో గాల్లో కలిసిన ప్రాణాలు కావచ్చు.. ఉత్తరకొరియా దక్షిణ కొరియా వివాదం కావచ్చు.. ప్రపంచంలో ఎక్కడ ఏ బాంబు పడ్డా అది మేడిన్ అమెరికానే.
పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని పెంచిందీ అమెరికానే
యుద్ధం.. ఉగ్రవాదంగా రూపుమారడంలోనూ అమెరికా పెద్దన్న హస్తమే అన్నిచోట్లా కనిపిస్తుంది. అమెరికాలో ఉగ్రదాడులు జరిగిన తరవాతైనా అగ్రరాజ్యం బుద్ది మారలేదు. ముంబైలో 2008లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు జరిపిన తరువాత నేటికీ అమెరికా పాకిస్థాన్‌కు ఆర్థిక, ఆయుధ సహకారం అందిస్తూనే ఉంది. వాస్తవానికి పాకిస్తాన్‌లో ఉగ్రవాదం పెరిగిందంటే ఆ పాపంలో అమెరికాకీ వాటా ఖచ్చితంగా వుంది. పరోక్షంగా ఉగ్రవాదానికి వెన్నుదన్నుగా నిలబడి పెంచిపోషించిన ఘన చరిత్ర అమెరికాది. పెద్దన్న తన స్వార్ధం కోసం ఆడుతున్న వికృత క్రీడలోంచి పుట్టుకొచ్చిన మొక్కే నేడు విషవృక్షమై ఊడలు పాతుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా కారే ప్రతి నెత్తుటి చుక్కా అమెరికా పుణ్యమే. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి పాక్ సహకారం తీసుకుంటూనే అదే పాక్‌తో భారత్‌లో ఉగ్రవాద ప్రేరేపిత కార్యకలాపాల్ని ప్రేరేపిస్తోంది నైతిక విలువలకు ఎప్పుడో నీళ్ళదిలిన పెద్దన్నే. అమెరికా చేత అమెరికా కోసం అమెరికా పెంచి పోషించిందే ఉగ్రవాదం
ఉగ్రవాద సమస్యమూలాలు తెలుసుకొని వాటికి పరిష్కారాలు అన్వేషిం చాల్సిందిపోయి, ఉగ్రవాదం పేరులో పొరుగుదేశంపై సైనిక దాడులకు ఉపక్రమించడం మంచిదికాదు. ఇది ఉగ్రవాద సమస్యపట్ల వారి అవగాహనారా హిత్యాన్ని సూచిస్తోంది. సైనిక చర్య ద్వారా ఉగ్రవాదం అంతమ వుతుందనుకొంటే అమెరికా, ఆప్ఘనిస్తాన్, ఇరాక్‌లలో అల్‌ఖైదా మీద జరిపిన వైమానిక దాడులతోనే అది అంతమై ఉండేది.
- కారుసాల శ్రీనివాసరావు