ఈనెల 30వ తేదీ వరకు సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు

ప్రజాసమస్యల పరిష్కారానికి సోమవారం నుండి ఈనెల 30వ తేదీ వరకు సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ గుంటూరు తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు వెల్లడించారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చాయని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. కేంద్రంలో నరేంద్ర మోడి అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకు పోయిందని, పంటలకు గిట్టుబాటు ధరల్లేక నాలుగేళ్లలో రెండు లక్షల మంది రైతులు ఆత్యహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రైతులు తమ సమస్యల పరిష్కారానికి పెద్డయెత్తున ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, రైతు, డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు చేస్తామని, పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని వాగ్దానం చేసినా ఈ కాలంలో ఒక్క పేద కుటుంబాకీ ఇళ్ల పట్టాల ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, అద్బుతమైన రాజధాని నిర్మాస్తామని చెప్పి 50 వేల ఎకరాలను సమీకరించి కార్పొరేట్‌ సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను పాదయాత్రల ద్వారా చైతన్య పరచనున్నట్లు తెలిపారు. జిల్లాలో అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, పక్కాగృహాల మంజూరు కోసం, గ్రామాలలో అధ్వానంగా ఉన్న పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని, అక్రమణకు గురైన శ్మశాన స్థలాలను విడిపించాలని, శ్మశానాలు లేని గ్రామాలకు స్థలం కేటాయించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇళ్ల స్థలాలిచ్చి మెరకలు లేకుండా నిరుపయోగంగా వున్న స్థలాలకు మెరకలు తొలగించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు మంజూరు చేయాలని కోరారు. పాదయాత్రలో వచ్చిన సమస్యలపై సంబంధిత కార్యాలయాల వద్ద దశల వారీగా ఆందోళనలు చేయనున్నట్లు వెల్లడించారు.