ఈనాటికీ తరగని మార్క్స్ ప్రాధాన్యత

2007లో లండన్‌లో యూదుల పుస్తక వారోత్సవం జరుగుతున్నది. అప్పటికి కారల్‌ మార్క్స్‌ వర్థంతి (మార్చి14) మరి రెండు వారాలుంది. పుస్తక వారోత్సవం జరుగుతున్నది కూడా లండన్‌లో మార్క్స్‌తో బాగా ముడివడిన బ్రిటిష్‌ మ్యూజియం లైబ్రరీలోని వలయాకారపు పఠన మందిరం సమీపంలో. జాక్స్‌ అట్టాలీ, నేనూ ఆయనకు జోహార్లర్పించేందుకు అక్కడకు చేరాం. మేమిద్దరం చాలా భిన్నమైన తరహాలకు చెందిన సోషలిస్టులం. అయితే మీరు ఆ తేదీని సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇది ఒకటికి రెండు రెట్లు ఊహించని విషయంగా కనిపిస్తుంది. 1883లో మార్క్స్‌ విఫలజీవిగా మరణించాడని ఎవరూ చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆయన రచనలు అప్పటికే జర్మనీపై, మరీ ముఖ్యంగా రష్యాలోని మేధావులపై ప్రభావం చూపడం ప్రారంభ మైంది. ఆయన శిష్యుల నాయకత్వంలో జర్మన్‌ కార్మికోద్యమాన్ని చేజిక్కించుకునేందుకు అప్పటికే ఒక ఉద్యమం నడుస్తున్నది. అయితే 1883 నాటికి ఆయన జీవిత కాలపు కృషిని చూపించేందుకు చాలా స్వల్పమే ఉంది. ఆయన కొన్ని ప్రతిభావంతమైన కరపత్రాలు రాశారు. అసంపూర్ణ ప్రధాన రచన దాస్‌ కాపిటల్‌ మొండెంలా ఉంది. ఆయన జీవితపు చివరి దశాబ్దంలో దానికి సంబంధించిన పని చాలా మందకొడిగా సాగింది. ఒక సందర్శకుడు ఆయనను తన రచనల గురించి ప్రశ్నించినపుడు ' ఏ రచనలు?' అని మార్క్స్‌ కొంచెం నిష్టూరంగా స్పందించాడు.

1848 విప్లవ వైఫల్యం తర్వాత 1864-73 మొదటి ఇంటర్నేషనల్‌ అనబడేదాని కోసం ఆయన ప్రధానంగా జరిపిన రాజకీయ కృషి ఫలించలేదు. ఆయన తన ప్రవాస జీవితంలో సగానికి పైగా బ్రిటన్‌లోనే గడిపాడు గాని అక్కడి రాజకీయ మేధాజీవితంలో ఎలాటి ప్రముఖ స్థానం పొందలేకపోయాడు.ఇవన్నీ నిజమే. కాని ఆయన మరణానంతరం సాధించిన విజయాలు ఎంత మహత్తరమైనవి! తన మరణం తర్వాత పాతికేళ్లలోనే యూరోపియన్‌ కార్మిక వర్గం ఆయన పేరిట రాజకీయ పార్టీలు స్థాపించుకుంది. పేరు మరొకటైనా సరే తాము మార్క్స్‌ నుంచి ఉత్తేజం పొందినట్లు ప్రకటించుకున్నవి ఉన్నాయి. ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగే దేశాలలో ఈ పార్టీలకు 15 నుంచి 47 శాతం వరకూ ఓట్లు వచ్చాయి. ఇందుకు బ్రిటన్‌ ఒక్కటే మినహాయింపు. 1918 తర్వాత ఈ పార్టీలలో అనేకం ప్రతిపక్షాలుగా ఉండటమే గాక అధికారంలోకి కూడా వచ్చాయి. ఫాసిజం తర్వాత కూడా వీటిలో అధిక భాగం అలాగే ఉన్నాయి. కాకుంటే తమకు మూల స్ఫూర్తి ఎవరనే విషయంలో అది వరకు చెప్పిందాన్ని వదులుకున్నాయి. ఆ పార్టీలన్నీ ఇప్పటికీ ఉనికిలో ఉన్నాయి. ఈ లోగా మార్క్స్‌ శిష్యులు తృతీయ ప్రపంచంలోని ప్రజాస్వా మ్యేతర దేశాలలో విప్లవ బృందాలను ఏర్పర చారు. మార్క్స్‌ మరణానంతరం 70 ఏళ్లకు కూడా మానవ జాతిలో మూడో వంతు ఆయన భావాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పే పార్టీల నాయకత్వంలోనే పాలించబడు తున్నాయి. ఆయన ఆకాంక్షలు నిజం చేస్తామని చెబుతున్నవి ఇప్పటికీ 20 శాతం ఉన్నాయి. కాకపోతేకొన్ని స్వల్ప మినహాయింపులున్నా ఆ దేశాల నాయకులు విధానాలను నాటకీయంగా మార్చేసుకున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే 20వ శతాబ్దంపై చెరిగిపోని ప్రధాన ముద్ర వేసిన ఒక ఆలోచనాపరుడు ఎవరైనా ఉన్నారంటే అది ఆయనే. ఇప్పుడు హై గేట్‌ శ్మశాన వాటికలోకి పదండి. అక్కడ పంధొమ్మిదవ శతాబ్దపు మార్క్స్‌నూ, హెర్బర్ట్‌ స్పెన్సర్‌నూ సమాధి చేశారు. చాలా విచిత్రంగా అవి దగ్గరదగ్గరగా ఉంటాయి. ఈ ఇద్దరూ బతికి వున్న కాలంలోకి వెళ్తే స్పెన్సర్‌ను తన కాలపు అరిస్టాటిల్‌ అన్నారు. కారల్‌ మార్క్స్‌ తన స్నేహితుడి డబ్బులతో హాంప్‌స్టెడ్‌ పల్లపు ప్రాంతాల్లో బతకాల్సి వచ్చింది. ఈ రోజున స్పెన్సర్‌ సమాధి ఎక్కడుందో కూడా ఎవరికీ తెలియదు. కాని జపాన్‌, ఇండియా వంటి దేశాల నుంచి వయోధికులైన పర్యాటకులు వచ్చి కారల్‌ మార్క్స్‌ సమాధిని సందర్శించి వెళుతుంటారు. బ్రిటన్‌లో ప్రవాస జీవితం గడిపి మరణించే ఇరాకీ, ఇరానీ కమ్యూనిస్టులు మరణానంతరం తమ దేహాలను మార్క్స్‌ సమాధి పక్కనే ఖననం చేయాలని గట్టిగా చెబుతుంటారు.
సోవియట్‌ యూనియన్‌ పతనంతో కమ ూ్యనిస్టు ప్రభుత్వాలూ, ప్రజా బాహుళ్య కమ్యూనిస్టుపార్టీల శకం అంతరించింది. చైనా, ఇండియా వంటి చోట్ల ఆ పార్టీలు మనుగడ సాగిస్తున్నా పాత లెనినిస్టు తరహా మార్క్సిజాన్ని వదలిపెట్టాయి. అది పతనమైనప్పుడు కారల్‌ మార్క్స్‌ మరోసారి నిర్జన ప్రదేశంలో మిగిలిపో యినట్టయింది. కమ్యూనిజం ఒక్కటే ఆయనకు నిజమైన వారసురాలుగా చెప్పబడింది. ఆయన భావాలు దానితోనే అధికాధికంగా గుర్తించబడ్డాయి. 1956లో కృశ్చెవ్‌ నాయకత్వం స్టాలిన్‌ను తెగనాడిన తర్వాత కూడా అక్కడా ఇక్కడా చోటు సంపాదించుకున్న అసమ్మతివాద మార్క్సిస్టులు లేదా మార్క్సిస్టు లెనినిస్టులు కూడా దాదాపుగా మాజీ కమ్యూనిస్టుల నుంచి విడిపోయినవారే. కాబట్టి ఆయన శతవర్థంతి తర్వాత మొదటి ఇరవయ్యేళ్లలోనూ ఆయన దాదాపుగా గత కాలపు వ్యక్తిగా మారి పోయాడు. తన గురించి పెద్దగా పట్టించుకో వలసిన అవసరం లేదనే భావం వచ్చింది. ఈ రోజు రాత్రి జరుగుతున్న ఈచర్చ మార్క్స్‌ను 'చరిత్ర చెత్తబుట్ట' నుంచి పైకి లేపే ప్రయత్నమని కూడా వ్యాఖ్యానించారు. అయినా సరే ఈ రోజున మార్క్స్‌ మరోసారి తన ప్రాధా న్యత నిలుపుకోగలిగాడు. 21వ శతాబ్దపు ఆలోచనా పరుడుగా ముందుకొచ్చాడు.
బిబిసి పోలింగులో బ్రిటిష్‌ రేడియో శ్రోతలు ఆయనను చరిత్రలోనే అతి గొప్ప తత్వవేత్తగా ఎన్నుకున్నారనే వార్తలకు ఏమంత గొప్ప ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదని నేననుకుం టాను. కాని మీరు గనక గూగుల్‌లో ఆయన పేరు కొడితే ఆయన మహత్తర మేధావంతుల కోవలో ఉంటాడు. డార్విన్‌, ఐన్‌స్టీన్‌ మాత్రమే ఆయన కన్నా ముందుంటారు. కాని మార్క్స్‌ ఆడం స్మిత్‌, ఫ్రాయిడ్‌ల కన్నా పైనే ఉంటాడు.
నా ఉద్దేశంలో ఇందుకు రెండు కారణాలు న్నాయి. మొదటిది సోవియట్‌ యూనియన్‌లో అధికార మార్క్సిజం ముగిసిపోవడం వల్ల మార్క్స్‌ను లెనినిజంతో కలిపి చూడవలసిన అవసరం లేకుండా పోయింది. లెనినిస్టు ప్రభుత్వాల ఆచరణ విధానంగా చూసే అవకాశమూ లేదు. ప్రపంచం గురించి మార్క్స్‌ చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకోవ డానికి ఇంకా అనేకానేక కారణాలున్నా యనేది బాగా స్పష్టమై పోయింది. మరొక కారణం కూడా ఉంది. బహుశా రెండవ కారణం ఇదే. 1990లలో ప్రపంచీ కరణ తర్వాత రూపుదాల్చిన పెట్టుబడిదారీ ప్రపంచం అనేక కీలకమైన విషయాలలో మార్క్స్‌ కమ్యూనిస్టు ప్రణాళికలో చెప్పిన దాన్ని పోలివుంది. 1998లో ఆ చిన్న కరపత్రం 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచమంతటా వ్యక్తమైన ప్రతిస్పందన ఈ విషయాన్ని తేటతెల్లం చేసింది. యాదృచ్ఛికంగా ఆ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నాటకీయమైన కుదుపునకు గురైంది. చాలా విచిత్రమేమంటే ఈ సారి మార్క్స్‌ను గురించి కనుగొన్నది సోషలిస్టులు కాదు- క్యాపిటలిస్టులే! ఈ వార్షికోత్సవం జరపడానికి సోషలిస్టులు చాలా నిరుత్సాహంలో మునిగివున్నారు. యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమాన పత్రిక సంపాదకుడు నా వ్యాసం కావాలని అడిగినప్పుడు చాలా ఆశ్చర్యపోయిన సంగతి నాకు గుర్తుకు వస్తుంది. బహుశా ఆ విమాన ప్రయాణీకులలో నూటికి 80 మంది అమెరికన్లయి ఉంటారు. ఆ పాఠకులకు కమ్యూనిస్టు ప్రణాళిక గురించిన చర్చ ఆసక్తి కలిగిస్తుందని ఆయన భావించి ఉంటాడు. నా వ్యాసంలో ఏదైనా ఉపయోగించుకోవచ్చని భావించాడేమో. ఈ శతాబ్ది ముగింపు సమయంలో ఎప్పుడో ఒక విందులో మార్క్స్‌ గురించి నేను ఏమనుకుంటు న్నానని జార్జిసోరెస్‌ అడగడం మరింత ఆశ్చర్యపోయేలా చేసింది. మా ఇద్దరి అభిప్రాయాల మధ్య ఎంత తేడా ఉంటుందో నాకు బాగా తెలుసు గనక అస్పష్టమైన సమాధానం ఇచ్చాను.' ఈ మనిషి పెట్టుబడిదారీ విధానం ఎలాటిదో నూట యాభై ఏళ్ల కిందటే కనిపెట్టాడని మనం గమనంలో ఉంచుకోవాలి' అని సోరెస్‌ అన్నాడు. నిజంగానే ఆయన ఆ పని చేశాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే చాలా మంది రచయితలు కనీసం నాకు తెలిసినంతవరకూ వారెవరూ కమ్యూనిస్టులు కాదు- మార్క్స్‌ను మరోసారి నిశితంగా చదవడం మొదలుపెట్టారు. జేక్స్‌ అతాలీ మార్క్స్‌ జీవితంపైన, రచనలపైన కొత్తగా వెలువరించిన పుస్తకం అలాంటిదే. ఈ ప్రపంచం ఇప్పుడున్న దానికంటే మెరుగ్గా ఉండాలని కోరుకునేవారందరికీ మార్క్స్‌ చాలానే వదలివెళ్లాడని అట్టాలీ కూడా అభిప్రాయపడ్డాడు. ఈ కోణం నుంచి చూసినా ఈ రోజున మనం మార్క్స్‌ను పరిగణనలోకి తీసుకోకతప్పదు.
2008 అక్టోబరులో లండన్‌ ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ' 'కంపిస్తున్నపెట్టుబడిదారీ విధానం' అనే పతాక శీర్షికనిచ్చింది. ప్రజా రంగంలో మార్క్స్‌ పునరాగమనం గురించి ఇంకా ఏమైనా సందేహాలుంటే దాంతో పటాపంచలై పోయి నట్టే. ప్రపంచ పెట్టుబడిదారీ విధానం 1930ల తర్వాత ఎన్నడూ లేనంత ఘోరమైన విచ్ఛిన్నాన్ని ఎదుర్కొంటుంటే ఆయన దాన్నుంచి నిష్క్రమించ డమనే ప్రసక్తి ఉండదు. మరో వైపున చూస్తే 21వ శతాబ్డి మార్క్స్‌ 20 వ శతాబ్ది నాటి మార్క్స్‌ కన్నా చాలా భిన్నంగా ఉండటం తథ్యం.
గత శతాబ్డిలో ప్రజలు మార్క్స్‌ గురించి ఆలోచించడానికి మూడు వాస్తవాలు ప్రాతిపదిక అయ్యాయి. మొదటిది - విప్లవం ఎజెండాలోకి వచ్చిన దేశాలకు, రాని దేశాలకు మధ్యన ఒక తేడా. స్థూలంగా చెప్పాలంటే పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందిన ఉత్తర అట్లాంటిక్‌, పసిఫిక్‌ ప్రాంతాలు, తక్కినవీ. ఇక రెండవ వాస్తవం మొదటి దాన్నుంచే ఉత్పన్నం అవుతుంది: మార్క్స్‌ వారసత్వం సహజంగానే సోషల్‌ డెమొక్రటిక్‌ సంస్కరణ వాద వారసత్వం గానూ, విప్లవ వారసత్వంగానూ విడి పోయింది. ఈ రెండవ తరహాలో రష్యా విప్లవం అత్యధిక ప్రాబల్యం వహిం చింది.1917 తర్వాత ఇది మరింత స్పష్టం కావడానికి ఇప్పుడు చెప్పే మూడవ కారణం దారితీసింది: పందోమ్మిదవ శతాబ్ది పెట్టుబడి దారీ విధానం, బూర్జువా సమాజం కుప్ప కూలాయి. దీన్నే నేను ' ప్రళయాంతక యుగం' అని పిలిచాను. ఇది 1914-1940ల మధ్య దశ. ఈ సంక్షోభం ఎంత తీవ్రమైనదంటే అనేక మంది అసలు పెట్టుబడిదారీ విధానం మళ్లీ కోలుకుంటుందా అని సందేహంలో పడ్డారు. ఎంత మాత్రం మార్క్సిస్టు కాని జోసెఫ్‌ ష్కింప్టర్‌ కూడా 1940లలో ఈ వ్యవస్థ స్థానంలో సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ వచ్చేస్తుందని జోస్యం చెప్పలేదా? వాస్తవంలో పెట్టుబడిదారీ విధానం తిరిగికోలుకున్నది. కాని పాతరూపంలో కాదు. అదే సమయంలో సోవియట్‌ యూనియన్‌లో ఒక సోషలిస్టు ప్రత్యామ్నాయం ప్రత్యక్షమై దుర్భేద్యంగా గోచరించింది.1929-1960 మధ్య కాలంలో అలా భావించడం నిర్హేతుకంగా కనిపించలేదు. ఆ ప్రభుత్వాల రాజకీయాలతో ఏకీభవించని అనేక మంది సోషలిస్టేతరులకు కూడా పెట్టుబడిదారీ విధానపు సరుకు అయిపోతున్నదనీ సోవియట్‌ యూనియన్‌ అంతకన్నా అధిక ఉత్పత్తి సాధించవచ్చునని అనిపించింది. స్పుత్నిక్‌ను ప్రయోగించే సంవత్స రంలో ఇదేమీ అర్థరహితంగా కనిపించలేదు. 1960 తర్వాత అందులోని అసంబద్ధత బాగా తెలిసిపోయింది.
ఈ సంఘటనలు, వాటి పర్యవసానాలు చాలా ప్రభావం చూపించాయి. మార్క్స్‌ ఎంగెల్సుల మరణానంతర కాలపు సిద్ధాంతం ఆచరణలకు సంబంధించి ఆ ప్రభావం చూడవలసి ఉంటుంది. మార్క్స్‌ స్వీయాను భవాలు అంచనాల పరిధిని దాటి ఉండే విషయాలవి. 20వ శతాబ్దపు మార్క్సిజంపై మన తీర్పు మార్క్స్‌ తనుగా ఏమనుకున్నాడనే దానిపై ఆధారపడి ఉండదు. ఆయన రచనలకు మరణానంతర భాష్యాలు ఏమిటనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒక విషయం మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. 1890లలో మొదటి సారి మార్క్సిజం మేధోపరమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. వారు మొదటి తరం మార్క్సిస్టులు. ఆయనతో, అంతకంటే కూడా ఫ్రెడరిక్‌ ఎంగెల్సుతో వ్యక్తిగత సంబంధం గలవారు. ఇరవయ్యవ శతాబ్డంలో ముందుకు వచ్చిన కొన్ని సమస్యలను గురించి మరీ ముఖ్యంగా రివిజనిజం, సామ్రాజ్యవాదం, జాతీయవాదం వంటి వాటి గురించి చర్చిం చడం మొదలు పెట్టారు. తర్వాతి కాలంలో జరిగిన మార్క్సిస్టు చర్చలో చాలా భాగం ఇరవయ్యవ శతాబ్దికి నిర్దిష్టంగా వర్తించేది. కారల్‌ మార్క్స్‌లో అది కనిపించదు. ముఖ్యంగా సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది ఎలా ఉండాలి అనే సంవాదం. అది 1914-18 యుద్ధ ఆర్థిక వ్యవస్థల అనుభవం నుంచి, యుద్ధానంతర కాలంలో ముందుకొచ్చిన విప్లవ తరహా లేక విప్లవ సంక్షోభాల నుంచి ప్రధానంగా రూపు దాల్చింది.
ఆ విధంగా చూస్తే సోషలిజం ఒక వ్యవస్థగా పెట్టుబడిదారీ విధానం కన్నా శ్రేష్టమైందనీ, ఉత్పత్తి శక్తుల అభివృద్ధిని అత్యంత వేగవంతం చేస్తుందని చెప్పుకోవడం మార్క్స్‌ నుంచి ఎంత మాత్రం జరిగివుండేది కాదు. యుద్ధాల మధ్యకాలంలో వచ్చిన పెట్టుబడిదారీ సంక్షోభం సోవియట్‌ యూనియన్‌ పంచవర్ష ప్రణాళికలను తాకినప్పుడు వచ్చిన అభిప్రాయమది. వాస్తవానికి మార్క్స్‌ చెప్పింది ఉత్పత్తిని పెంచడంలో పెట్టుబడిదారీ విధాన సామర్థ్యం దాని చివరి అంచులకు చేరుకున్నదని కాదు. పెట్టుబడిదారీ విధానపు గజిబిజి అధిక ఉత్పత్తికి సంబంధించి నిర్ణీత కాలంలో సంక్షోభాలు తీసుకొస్తుందని ఆయన చెప్పాడు. ఇవి కాస్త ముందో వెనకో ఇక పెట్టుబడిదారీ విధానంలో ఆర్థిక వ్యవస్థను నడపలేని స్థితిని తీసుకువస్తాయనీ, అది పరిష్కరించలేని సామాజిక ఘర్షణలు తలెత్తడానికి కారణమవు తాయని పేర్కొన్నాడు. తర్వాతి దశలో రావలసిన సామాజిక ఉత్పత్తి అనే విధానాన్ని తీసుకురాగల శక్తి స్వతస్సిద్ధంగానే పెట్టుబడిదారీ వ్యవస్థకు ఉండదు. కనుక అది సోషలిస్టు వ్యవస్థగా ఉండటం అనివార్యం.
ఇలా చెప్పాడు గనక ఇరవయ్యవ శతాబ్దంలో కారల్‌ మార్క్స్‌ గురించిన చర్చలలో, అంచనా లలో సోషలిజం కీలకాంశంగా ఉండటం ఆశ్చర్యకరం కాదు. సోషలిజం గురించి చెప్పింది మార్క్స్‌ ఒక్కరే కావడం వల్ల కాదు ఇలా జరిగింది. అది నిజం కాదుకూడా. మార్క్స్‌ వల్ల ఉత్తేజం పొందిన పార్టీలు అలాటి కార్యక్రమాన్ని తమదిగా స్వీకరించాయి. కమ్యూనిస్టులైతే తాము సోషలిజాన్ని స్థాపించామని కూడా ప్రకటిం చారు. 20 వ శతాబ్దపు ఈ రూపంలోనైతే సోషలిజం మరణించింది. సోవియట్‌ యూని యన్‌లో గానీ, ఇతర కేంద్ర ప్రణాళికాయుత ఆర్థిక వ్యవస్థలలో గానీ వర్తింప చేసిన సోషలిజం- సైద్ధాంతికంగా చెప్పాలంటే మార్కెట్‌ రహిత, ప్రభుత్వ యాజమాన్య నియంత్రిత ఆదేశిత ఆర్థిక వ్యవస్థలు అంతరించాయి. అవి మళ్లీ పునరుద్ధరించ బడవు. సోషలిస్టు ఆర్థిక వ్యవస్థలను నిర్మించాలనే సోషల్‌ డెమోక్రటిక్‌ ఆకాంక్షలు ఎప్పుడూ భవిష్యత్తుకు సంబంధించినవే. అయితే శుద్ధ ఆకాంక్షలుగా చూసినా అవి ఈ శతాబ్దాంతానికి వదలివేయబడ్డాయి.
సోషల్‌ డెమోక్రాట్ల మనసుల్లో ఉన్న లేదా కమ్యూనిస్టు ప్రభుత్వాలు స్థాపించిన సోషలిజం నమూనాలు ఎంత వరకూ మార్క్సు నమూనాలుగా చెప్పొచ్చు? ఇక్కడ ముఖ్యమైన విషయమేమంటే సోషలిజంలో ఆర్థిక వ్యవస్థల గురించి సంస్థలు ఎలా ఉండాలో చెప్పేపని మార్క్స్‌ ఉద్దేశపూర్వకంగానే మానుకున్నాడు. ఇక కమ్యూనిస్టు సమాజ రూపు రేఖల గురించి అసలేమీ చెప్పలేదు. అది ఏదో ఒక పథకం ప్రకారం నిర్మించదగిన లేదా ముందుగా నిర్దేశించదగినది కాదని మాత్రం చెప్పాడు. అది సోషలిస్టు సమాజం నుంచి ఉద్భవిస్తుందని చెప్పి ఊరుకున్నాడు. జర్మన్‌ సోషల్‌ డెమొక్రాట్ల గోథా కార్యక్రమ విమర్శన వంటి రచనల్లో పేర్కొన్న ఇలాటి సాధారణ వ్యాఖ్యానాల ద్వారా మార్క్స్‌ తన వారసులకు నిర్దిష్ట నిర్దేశకత్వం ఇచ్చింది లేదు. ఈ విషయాలపై లోతుగా ఆలోచించే పని పెట్టుకోలేదు. ఎందుకంటే విప్లవం జయప్రదమయ్యేలోగా వీటిని గురించి ఆలోచించడం కేవలం పండిత తతంగమో, ఊహాజనిత కసరత్తో అవుతుందని భావించారు. లేబర్‌ పార్టీ నిబంధనావళిలో చాలా ప్రసిద్ధమైన నాల్గవ అధికరణం ఇక్కడ ఉటంకించవచ్చు.' ఉత్పత్తి సాధనాలపై సమిష్టి యాజమాన్యం' పై ఇది ఆధారపడి ఉంటుందని మాత్రం చెప్పారు. అంటే దేశంలో పరిశ్రమలను జాతీయం చేయడం ద్వారా ఈ లక్ష్యం సాధించవచ్చునని సాధారణంగా అర్థం చేసుకున్నారు.
కేంద్రీకృత సోషలిస్టు నమూనాకు సంబంధించిన తొలి సిద్ధాంతం రూపొందించిన వారు సోషలిస్టులు కాక, సోషలిస్టేతరులు కావడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇటాలియన్‌ ఆర్థిక వేత్త ఎన్రికో బరోన్‌ 1908లో దాన్ని రూపొందిచారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రైవేటు పరిశ్రమలను జాతీయం చేయడం అనే ప్రశ్న మొదటి సారిగా రాజకీయ పార్టీల ఎజెండాలోకి వచ్చే వరకూ ఎవరూ దాన్ని గురించి ఆలోచించివుండలేదు. ఆ సమయంలో సోషలిస్టులు గతం నుంచి ఎలాంటి నిర్దేశకత్వం లేకుండానే తమ ముందుకు వచ్చిన సమస్యలను ఎదుర్కోవలసిన స్థితిలో పడ్డారు.
సామాజిక నిర్వహణలో సాగే ఏ విధమైన ఆర్థిక వ్యవస్థలోనైనా 'ప్రణాళిక' అనేది భాగంగా ఉంటుంది. అయితే మార్క్స్‌ దాని గురించి నిర్దిష్టంగా ఏమీ చెప్పలేదు. విప్లవానంతర రష్యాలో దాని అమలు ప్రారంభించినపుడు అది చాలా మెరుగుపర్చాల్సిన స్థితిలో ఉంది. సైద్ధాంతిక సాధనాలైన దృక్పథాల ద్వారా (లియాంటివ్‌ ఇన్‌పుట్‌ ఔట్‌పుట్‌ విశ్లేషణ వంటివి), అలాగే తగు గణాంకాలు అందించడం ద్వారా ఇది జరిగింది. ఈ పరికరాలను తర్వాత సోషలిస్టేతర దేశాలలో కూడా విస్తారంగా ఉపయోగించారు. మొదటి ప్రపంచ యుద్ధానంతరం అదే స్థాయిలో దెబ్బతిన్న యుద్ధ ఆర్థిక వ్యవస్థలను అనుసరిం చడం ద్వారా ఇది జరిగింది. ముఖ్యంగా జర్మనీని, ప్రత్యేకంగా అక్కడున్న విద్యుత్‌ పరిశ్రమను అనుసరించారు. జర్మన్‌ అమెరికన్‌ విద్యుత్‌ సంస్థల నిర్వాహణాధికారులలోని రాజకీయ సానుభూతిపరులు లెనిన్‌కు వాటి గురించిన సమాచారం ఇచ్చారు. సోవియట్‌లో ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థకు ప్రాథమిక నమూనాగా నిలిచింది యుద్ధ ఆర్థిక వ్యవస్థే. అంటే దీని అర్థం అలాటి దానిలో ముందుగానే కొన్ని లక్ష్యాలు నిర్ణయించబడతాయి. కృత్రిమ వేగంతో పారిశ్రామికీకరణ, యుద్ధంలో గెలవడం, అణుబాంబు తయారీ లేదా మనిషిని చంద్రునిపైకి పంపడం వంటి లక్ష్యాలు పెట్టుకుని వాటి సాధన కోసం ప్రణాళికలు వేసి వనరులు కేటాయించడం జరుగుతుంది. దీనివల్ల తాత్కాలికంగా కలిగే నష్టం ఏమైనా కావచ్చు. ఇందులో ప్రత్యేకించి సోషలిస్టు తరహాగా చెప్పదగిందేమీ లేదు. ముందే నిర్ణయించుకున్న లక్ష్యాల సాధన కోసం కాస్త ఎక్కువ తక్కువ ఆధునీకరణతో కృషి చేయవచ్చు. అయితే సోవియట్‌ ఆర్థిక వ్యవస్థ ఈ దశను దాటి ముందుకు పోయింది లేదు. 1960ల తర్వాత అలాటి ప్రయత్నం జరిగింది గాని అదో విధమైన సంకట పరిస్థితి (క్యాచ్‌22 స్థితి) మార్కెట్లను నిరంకుశాధికార ఆదేశిత చట్రంలో ఇమిడ్చే పద్ధతి అమలైంది.
కనుక సోషల్‌ డెమోక్రసీ అనేది మార్క్సిజాన్ని భిన్నమైన పద్ధతిలోకి మార్చింది. సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని వాయిదా వేయడమో లేక సానుకూల పద్ధతిలో చెప్పాలంటే భిన్న తరహాల మిశ్రమ ఆర్థిక వ్యవస్థలను ప్రయోగించడమో జరిగింది. పూర్తిగా సోషలిస్టు తరహా ఆర్థిక వ్యవస్థ నిర్మించాలని కోరుకున్న సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీలకు సంబంధించినంతవరకూ అవి ఒక విధంగా ఆలోచించుకోవలసిన అవసరాన్నిది కల్పించింది. చాలా ఆసక్తికరమైన అలాటి ఆలోచనలు చేసిన వారిని చెప్పుకోవాలంటే మార్క్సిస్టేతర చింతనాపరులైన ఫెబియన్‌ సిడ్నీ, బియాట్రిస్‌ వెబ్‌ వంటి వారు. పెట్టుబడిదారీ విధానం నుంచి సోషలిజానికి క్రమానుగత మార్పును వారు సూచించారు. దీనికోసం వారు తిరుగులేనివైన, పరస్పర సహాయకమైన అనేక సంస్కరణల పరంపర ప్రతిపాదించారు. అందువల్లనే సోషలిజంకు సంబంధించిన యంత్రాంగాల కల్పనపై కొన్ని రాజకీయ ఆలోచనలు చేశారు. అయితే ఇందులో ఆర్థిక సంబంధమైనవేమీ లేవు. ఇక ప్రధాన మార్క్సిస్టు 'రివిజనిస్టు' అయిన ఎడ్వర్డ్‌ బెర్న్‌స్టీన్‌ విషయానికి వస్తే ఆయన సంస్కరణ వాద ఉద్యమమే సర్వస్వమనీ, అంతిమ లక్ష్యం అనేదానికి వాస్తవికత లేదని ప్రకటించాడు. వాస్తవానికి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత చాలా దేశాలలో ప్రభుత్వాధికారంలోకి వచ్చిన అనేక సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీలు రివిజనిస్టు విధానాన్నే చేపట్టాయి. అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను దాని మానానికి దాన్ని వదలివేసి కార్మికులకు సంబంధించిన ఏవో కొన్ని కోర్కెలు నెరవేర్చడానికే పరిమితమైనారు. ఆంటోనీ క్రాస్‌లాండ్‌ రాసిన సోషలిజం భవిష్యత్తు (1956) అనే గ్రంధం ఇలాటి ధోరణులకు ప్రామాణిక ఉదాహరణగా చెప్పవచ్చు. 1945 తర్వాత పెట్టుబడిదారీ విధానం దేనికీ లోటు లేని సమాజాన్ని సృష్టించిందని ప్రకటించారు. కనుక ప్రభుత్వరంగ సంస్థలు(జాతీయకరణ తరహాలో గాని లేక మరో విధంగా గాని) అవసరమే లేదన్నారు. జాతీయ సంపద న్యాయంగా పంపిణీ అయ్యేట్టుచూడటమే సోషలిస్టుల బాధ్యత అని ఆయన భావించాడు. ఇది మార్క్స్‌ నుంచి బాగా దూరమైన భావన. సంప్రదాయ సోషలిజం భావించినట్టుగా మార్కెట్‌ రహిత సోషలిజం గురించిన ఆలోచనలకు కూడా ఇది చాలా భిన్నం. బహుశా ఈ సంప్రదాయభావననే మార్క్స్‌ కూడా భాగం పంచుకుని ఉండేవాడు.
దీనికి నేను ఇటీవలి మరొక వివాదాన్ని కూడా తోడు చేస్తాను. ఆర్థిక రంగంలో నయా ఉదార వాదులకూ వారి విమర్శకులకూ మధ్య ప్రభుత్వ రంగ సంస్థల పాత్రపై వివాదం నడుస్తున్నది. ఇది నిజానికి మార్క్సిస్టులకే పరిమితమైన చర్చ కాదు, అసలు సూత్రరీత్యా ఇది సోషలిస్టు చర్చ కానే కాదు.1970ల నుంచి సమాన వాణిజ్యావకాశం అనే సూత్రం దారుణంగా దిగజారిపోయిన ఫలితంగానే ఈ చర్చ ముందుకు వచ్చింది. ఒక ఆర్థిక వాస్తవంగా మారిన ఈ సూత్రం చివరకు లాభార్జనా దాహం గల సంస్థలపై ఎలాంటి నియంత్రణలు లేదా అదుపు లేకుండా పోవడానికి కారణమైంది. మానవ సమాజాన్ని ఏదో స్వయం నియంత్రణ (గలదని చెప్పబడుతున్న), అంతులేని సంపద సృష్టించే మార్కెట్లకు అప్పగించడానికి ఇది దారి తీసింది. సంపదతో పాటు సంక్షేమం కూడా గరిష్టంగా ఉంటుందనే వాదనలు వచ్చాయి. తమ ప్రయోజనాల కోసం సంబంధిత పాత్రధారులు హేతుబద్దంగా దీన్ని నడిపిస్తారని చెప్పబడుతున్నది. నిజానికి పెట్టుబడిదారీ విధానపు ఏ దశలో కూడా ఏ దేశంలో కూడా ఇలాటిది లేనేలేదు. ఆఖరుకు అమెరికాలో కూడా లేదు. ఇది అర్థం లేని వ్యవహారం. ఆడంస్మిత్‌కు సిద్ధాంత కారులు చెప్పిన విపరీత భాష్యం ఇది. అలాగే బోల్షివిక్కులు ఏ విధంగా మార్క్స్‌ అంటే నూరు శాతం ప్రభుత్వ ప్రణాళికాయుత ఆదేశిత ఆర్థిక వ్యవస్థ అని చెప్పారో ఇదీ అంతే. ఈ మార్కెట్‌ ఛాందసం ఆర్థిక వాస్తవం కన్నా అంధవిశ్వాసంగానే ఉంది గనక అదీ విఫలమైంది.
ఈ విధంగా కేంద్ర ప్రణాళికాబద్ధ, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలు అదృశ్యమై పోయాయి. నిరుత్సాహానికి గురైన సోషల్‌ డెమొక్రాట్ల ఆకాంక్షల నుంచి సమాజాన్ని మౌలికంగా పరివర్తన చేయడమనే లక్ష్యం మటుమాయమైంది. దీనివల్లనే 20వ శతాబ్దపు సోషలిజం వాదనలు చాలా వరకూ నిర్మూలనైపోయాయి. ఇవన్నీ మార్క్సు పేరిట జరిగినా, ఆయన ఉత్తేజం వీటి వెనక ఉన్నా వాటి సారాంశం మాత్రం ఆయనకు కొంచెం దూరంగా ఉంటుంది. అయితే మార్క్స్‌ మూడు విధాలుగా మహత్తర శక్తిగా మిగిలిపోయాడు: ఒక ఆర్థిక ఆలోచనాపరుడుగా, ఒక చారిత్రిక ఆలోచనాపరుడు, విశ్లేషకుడుగా, సమాజం గురించిన నూతన ఆలోచనా ధోరణికి ఒక వ్యవస్థాపక పితామహుడుగా (డర్క్‌హీం మాక్స్‌ వెబర్‌లతో పాటు) నిలిచిపోయాడు. ఒక తత్వవేత్తగా ఆయన కొనసాగుతున్నతీరుపైన, దాని ప్రాధాన్యతపైన అభిప్రాయం వ్యక్తం చేసే అర్హత నాకులేదు. ఎప్పటికీ సమకాలీన ప్రాధాన్యత కోల్పోని అంశం మార్క్స్‌ దార్శనికత. మానవ ఆర్థిక వ్యవస్థ చరిత్రలో పెట్టుబడిదారీ విధానం ఒక తాత్కాలిక ఘట్టం మాత్రమేనని ఆయన చెప్పిన మాట యధార్థమైంది. అది ఏ విధంగా ఎప్పటికప్పుడు విస్తరిసూ, ్త కేంద్రీకరిస్తూ, సంక్షోభాలు సృష్టిస్తూ, తనను తాను మార్పు చేసుకునే ప్రక్రియలపై ఆయన విశ్లేషణ నిలిచేవుంటుంది.
××
21వ శతాబ్దంలో మార్క్స్‌ ప్రాధాన్యత ఏమిటి? ఇప్పటి వరకూ సోషలిస్టు ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు జరిగిన ఒకే ఒక ప్రయత్నం సోవియట్‌ తరహాకు చెందిందే. అది ఇప్పుడు ఎంత మాత్రం ఉనికిలో లేదు. మరో వైపున ప్రపంచీకరణ అనేదాని ప్రగతి అపారంగా అమిత వేగంతో ముందుకు పోతున్నది. మానవుల సంపద సృష్టి సామర్థ్యం చెలరేగి పోతున్నది. జాతి రాజ్యాల ఆర్థిక, సామాజిక అధికార పరిధిని ఇది కుదించివేసింది. ఈ కారణంగా సోషల్‌ డెమోక్రాట్ల సంప్రదాయ విధానాలు కూడా దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఆ పార్టీలు ప్రధానంగా తమ ప్రభుత్వాలపై సంస్కరణల కోసం ఒత్తిడి తేవడం ఆధారంగా పనిచేస్తాయి. మార్కెట్‌ ఛాందసం బాగా ప్రాబల్యం పొందింది గనక దేశాల మధ్య, ప్రాంతాల మధ్య విపరీతమైన ఆర్థిక వ్యత్యాసాలను సృష్టించింది. పెట్టుబడిదారీ వ్యవస్థలో పాతకాలపు వినాశకర ప్రళయ పరంపరకు మళ్లీ తెర తీసింది. ఇందులో భాగంగా 1930లలో వచ్చిన ప్రపంచపు అతి పెద్ద సంక్షోభ లక్షణాలు కూడా ఇందులో కనిపిస్తున్నాయి.
మన ఉత్పత్తి సామర్థ్యం వల్లనే ఈ పరిస్థితి సాధ్యమైంది. కనీసం అలాటి అవకాశాలు కనిపిస్తున్నాయనైనా చెప్పొచ్చు. మనుషులలో అత్యధికులు అవసరాల పరిధి నుంచి సంపద, చదువు, ఊహాతీతమైన జీవితపు ఎంపిక అవకాశాలు చూస్తున్నారు. ప్రపంచ జనాభాలో చాలా మంది ఇంకా ఈ స్థితిలోకి రావలసే ఉందన్న మాట కూడా నిజమే. అయినా ఇరవయ్యవ శతాబ్దిలో అత్యధిక కాలం సోషలిస్టు ఉద్యమాలూ, ప్రభుత్వాలూ అవసరాల పరిధిలోనే ప్రధానంగా పనిచేయవలసి వచ్చింది. పాశ్చాత్య ప్రపంచంలోని సంపన్నదేశాలు కూడా 1945 తర్వాతి ఇరవై ఏళ్లలో గాని సంపద్వంతమైన స్థితికి చేరుకోలేదు. ఏమైనా ఇప్పుడు సంపద సమృద్ధి కాలం గనక తగు తిండి, గుడ్డ, గృహం, ఆదాయం, ఉద్యోగం కోసం, ప్రజలను ఈతిబాధల నుంచి కాపాడే సంక్షేమ కార్యక్రమాలు వంటివి అవసరమే గాని అవే సోషలిస్టుల కార్యక్రమంగా సరిపోవు.
ఇక మూడో పరిణామం ప్రతికూలమైనది. బ్రహ్మాండమైన ప్రపంచీకరణ ఆర్థిక వ్యవస్థ పర్యావరణాన్ని దెబ్బతీసింది. ఈ హద్దూపద్దూలేని ఆర్థికాభివృద్ధికి పగ్గాలువేయడం తక్షణావసరంగా ముందుకొస్తున్నది. జీవావరణంపైన మన ఆర్థిక వ్యవస్థ ప్రభావాన్ని అదుపు చేసేందుకోసం ఈ వేగాన్ని నియంత్రించవలసిన అవసరం ఒకవైపు కనిపిస్తుంది. పెట్టుబడిదారీ మార్కెట్‌ అవసరాల కోసం ఈ పెరుగుదలను గరిష్ట స్థాయికి చేర్చవలసిన అవసరం మరో వైపు కనిపిస్తున్నది. ఈ రెంటి మధ్యనా ఘర్షణ వస్తుంది. ఇది పెట్టుబడిదారీ విధానపు ఆయువు పట్టు. దీన్ని ఏ బాణం కొడుతుందో మనకు ఇంకా తెలియదు.
అందువల్ల మనం ఈ రోజున కారల్‌ మార్క్స్‌ను ఎలా చూడాలి? మానవాళిలో ఒక భాగానికి గాక మొత్తం తరపున ఆలోచించిన వ్యక్తిగా చూడొద్దా? తప్పక అలాగే చూడాలి. ఒక తత్వవేత్తగానా? ఒక ఆర్థిక విశ్లేషకుడుగానా? ఒక ఆధునిక సామాజిక శాస్త్ర వ్యవస్థాపక పితామహుడుగా మానవ చరిత్రను అర్థం చేసుకోవడానికి మార్గం చూపిన వ్యక్తిగానా? నిజం. అయితే అట్టాలీ చెప్పినట్టుగా ఆయన ఆలోచనలకు విశ్వజనీన అన్వయం ఉంటుంది. మామూలుగా చెప్పేట్టు అది భిన్న శాఖల మధ్య సంధానం చేయడం కాదు, అన్ని విభాగాల సమాహారంగా పనిచేస్తుంది. 'ఆయనకు ముందు తత్వవేత్తలు మనిషిని మొత్తంగా చూశారు. అయితే ప్రపంచమంటే రాజకీయ, ఆర్థిక, సామాజిక, తాత్విక అంశాలన్ని కలిగివున్నదని మొదటి సారి కనుగొన్న వ్యక్తి ఆయనే' అని అట్టాలి వివరిస్తారు.
ఆయన రాసిన దానిలో చాలా భాగం ఈ కాలానికి వర్తించదన్న మాట ఖచ్చితంగా నిజం. అందులో కొంతభాగం ఇప్పుడు ఆమోదయోగ్యం కాదు కూడా. పైగా ఆయన రచనలు సర్వ సంపూర్ణ రూపం తీసుకోలేదన్న మాట కూడా నిజం. కాని ఆయన పేరిట గల అలోచనలన్నీ కూడా అనంతమైన అభివృద్ధి వైపు సాగిపోతుంటాయి. వ్యవస్థాగతంగా పెంచిన ఛాందసాలను అలా ఉంచి మరెవరూ కూడా దాన్ని ఒక పిడివాదంగా మార్చడం కుదిరేపని కాదు. ఈ పరిస్థితి తప్పక మార్క్స్‌కే దిగ్భ్రాంతి కలిగించి ఉండేది. అయితే 'సరైన', 'సరైనది కాని' మార్క్సిజం ఉంటుందనే భావనను కూడా మనం తిరస్కరించాలి. ఆయన చెప్పిన విచారణ తరహా పద్ధతి భిన్నమైన ఫలితాలకు భిన్నమైన పద్ధతులకు అవకాశమిస్తుంది. అసలు మార్క్స్‌కే ఈ పరిస్థితి ఎదురైంది. బ్రిటన్‌లో, నెదర్లాండ్స్‌లో సోషలిజానికి శాంతియుత పరివర్తన జరగవచ్చని ఆయన అనుకున్నాడు. రష్యాలోనైతే గ్రామీణ సమాజం నుంచి సోషలిజంలోకి పరివర్తన జరగవచ్చని భావించాడు. కనుక ప్లెఖనోవ్‌, లెనిన్‌ ఆయన ఆలోచనలకు ఎంత వారసులో కాట్‌స్కీ, బెర్న్‌స్టీన్‌ కూడా అంతే ఎక్కువ (లేదా మీకు నచ్చకపోతే అంత తక్కువ) వారసులుగా ఉంటారు. కనుకనే అట్టాలీ నిజమైన మార్క్స్‌కూ తర్వాత ఆయన ఆలోచనలను సులభతరం చేసిన లేదా వక్రమార్గం పట్టించిన వారి జాబితాలో పేర్కొన్న ఎంగెల్సు, కాట్‌స్కీ ,లెనిన్‌ తదితరులకూ మధ్యన పెద్ద తేడా చూపించడం పట్ల నాకు సందేహాలున్నాయి. పెట్టుబడిని మొదటి సారి తీవ్రంగా చదివి పశ్చిమ దేశాల తరహాలో తమ వెనుకబడిన తనం నుంచి ఆధునీకరణ వైపు వెళ్లవచ్చని రష్యన్లు కోరుకున్నారు. అది వారికి న్యాయం. అదే సమయంలో సాక్షాత్తూ మార్క్స్‌ రష్యా గ్రామీణ సమాజం నుంచి పెట్టుబడిదారీ విధానానికి నేరుగా వెళ్లిపోవడం సాధ్యమేనేమో అని భావించాడు. అది కూడా అంతే న్యాయం. నిజంగా ఏదైనా ఉందంటే అది సాధారణ మార్క్స్‌ ఆలోచనా ధోరణిలోనే ఉంది. ప్రపంచమంతా సోషలిజం వచ్చాకే రష్యాలో సోషలిజం నిర్మాణం చేపట్టివుండాల్సిందని ఆ విప్లవంపై విమర్శ చేయడం కుదరదు. మార్క్స్‌ అలా చెప్పలేదు. ఆయన అలా గట్టిగా నమ్మాడని కూడా అనుకోవడానికి ఆధారాలు లేవు. అది కేవలం ఉజ్జాయింపుగా చెప్పే అనుభవవాదం. రష్యా అప్పటికి చాలా వెనకబడిన దేశం గనక సోషలిస్టు తరహాను పోలిన వ్యంగ్యచిత్రం మాత్రమే అందించగల స్థితి. ప్లెఖనోవ్‌ అదే హెచ్చరిక చేశాడని చెబుతుంటారు. 1917లో రష్యన్‌ మార్క్సిస్టులలో అత్యధికులతో సహా మొత్తం మార్క్సిస్టుల ఏకాభిప్రాయం అలాగే ఉండేది. మరో వైపున 1890ల నాటి లిబరల్‌ మార్క్సిస్టులు అట్టాలీ అభిప్రాయం తీసుకున్నారు. అంటే మార్క్సిస్టులు రష్యాలో ప్రధానంగా చేయవలసింది గొప్ప పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానాన్ని నిర్మించడమనే వైఖరి వారిది. అది కూడా ఆధారరహితమే. జారిజం హయాంలో ఉదారవాద పెట్టుబడిదారీ రష్యా ఏర్పడ్డం అసంభవం.
ఇవన్నీ చెప్పుకున్నప్పటికీ మార్క్స్‌ విశ్లేషణలో అనేక ప్రధానాంశాలు ఇప్పటికి విలువైనవిగానే ఉంటాయి.
మొట్టమొదటిది పెట్టుబడిదారీ అభివృద్ధి విధానపు అంతర్జాతీయ చలన సూత్రాలకు సంబంధించిన తిరుగులేని విశ్లేషణ. ఈ విధానం తన ఎదురుగా వచ్చే ప్రతిదాన్నీ నాశనం చేస్తుంది. కుటుంబ వ్యవస్థలవంటివి ఏవైతే మానవ చరిత్రలో పెట్టుబడిదారీ విధానం పెరుగుదలకు కారణమైనాయో ఆ వారసత్వాలను కూడా వదలకుండా ధ్వంసం చేస్తుంది.
రెండవది: పెట్టుబడిదారీ విధానపు పెరుగుదల క్రమంలో ఏర్పడే యంత్రాంగపు అంతర్గత వైరుధ్యాలు. నిరంతరాయమైన ఉద్రిక్తతలు, తాత్కాలిక పరిష్కారాలు. అభివృద్ధి సంక్షోభానికి మార్పునకూ దారితీయడం. ఇవన్నీ కలిసి ఒక ఆర్థిక కేంద్రీకరణకు దారి తీయడం. అది ఒక ప్రపంచీకరించబడిన ఆర్థిక వ్యవస్థగా మారడం. 
నిర్విరామ విప్లవంతో నిరంతరం తనను తాను పునరుజ్జీవింపచేసుకునే ఒక సమాజం గురించి మావో కలలు కన్నాడు. పెట్టుబడిదారీ విధానం ఈ పథకాన్ని నిజం చేసింది. ష్కంప్టర్‌ (మార్క్స్‌ను అనుసరించి) సృజనాత్మక విధ్వంసం అని పిలిచింది దీన్నే. ఈ క్రమం అంతిమంగా అపారమైన కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ స్థాపనకు దారి తీస్తుందని మార్క్స్‌ భావించాడు. అలా కావలసిందే. ఈ రోజున ప్రపంచంలో ఏం జరగాలన్నది వెయ్యి మంది లేదా పదివేల మంది ఆదేశం ప్రకారం జరుగుతుందని అట్టాలీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పింది దీని గురించే. ఇది పెట్టుబడిదారీ విధానం అంతా నికి దారి తీస్తుందని మార్క్స్‌ చెప్పిన మాట. ఈ అంచనా నాకు ఇప్పటికీ సాధ్యమయ్యేదిగా కనిపిస్తుంది. కాకపోతే ఆయన ఊహించినట ు్టగాక వేరే విధంగా జరగొచ్చు.
మరో వైపున ఆయన చెప్పిన జోస్యం మరొకటి ఉంది. దోపిడీ చేసే వారిని దోచుకోవటం అంటూ విస్తార శ్రామిక వర్గం సోషలిజానికి దారి తీస్తుందని ఆయన రాశారు. అయితే ఈ అంచనా చెప్పింది పెట్టుబడిదారీ విధాన యంత్రాంగంపై విశ్లేషణలో భాగంగా గాక మరో ప్రత్యేక అంచనాతో ఆ మాట చెప్పారు. పారిశ్రామికీకరణ కనీస వేతనాలపై ఆధారపడి కాయకష్టం చేసే కార్మికులను తయారు చేస్తుందనీ అప్పుడు ఇంగ్లాండులో జరుగుతున్న దాన్నిచూసి ఆయన చెప్పి ఉండొచ్చు. మధ్య తరహా ఉత్పత్తికి సంబంధించి నంత వరకూ ఇది వాస్తవమే. కాని దీర్ఘ కాలంలో ఇది సరికాదని మనం ఇప్పుడు చూస్తున్నదాన్నిబట్టి చెప్పవచ్చు. అలాగే 1840ల తర్వాత మార్క్స్‌ ఎంగెల్సులు కూడా పారిశ్రామికీరణ వల్ల జనాలు దివాళా తీసి తాము కోరుకున్న విప్లవకర వాతావరణం వస్తుందని ఆశించలేదు. కార్మిక వర్గంలో విస్తార భాగాలు ఖచ్చితమైన లెక్కల ప్రకారం మరింత పేదలు కావడం లేదని వారు స్పష్టంగానే చూడగలిగారు. నిజంగానే నికరమైన కార్మిక వర్గం గల జర్మన్‌ సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ మహాసభకు 1900 లలో హాజరైన అమెరికన్‌ పరిశీలకుడు అక్కడ కామ్రేడ్స్‌ దారిద్య్రానికి ఒకటి రెండు మెట్లు పైనే ఉన్నారని రాశాడు. మరోవైపున ప్రపంచం వివిధ ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య ఆర్థిక అసమానత పెరగడం కూడా మార్క్స్‌ చెప్పిన ప్రకారం దోచుకొనే వాడిని దోచుకోవటం అన్నది అనివార్యమయ్యే పరిస్థితిని నివారించింది. క్లుప్తంగా చెప్పాలంటే ఆయన రచనలలో భవిష్యత్తుకు సంబంధించిన ఆశలు కనిపిస్తాయి గాని దాన్నుంచే అవి జరగవు.మూడవది- అర్థశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం పొందిన కీశే సర్‌ జాన్‌ హిక్స్‌ మాటల్లో చెప్పుకోవడం అత్యుత్తమంగా ఉంటుంది.' చరిత్ర సాధారణ గమనంలో ఏదో ఒక చోట ఉండాలని కోరుకునే వారంతా మార్క్సిస్టు వర్గీకరణను లేదా దాని మరో రూపాన్ని ఆశ్రయించవలసిందే. ఎందుకంటే అవి గాక అందుబాటులో ఉన్న ఇతర ప్రత్యామ్నాయాలేవీ నిజంగా అక్కరకు వచ్చేవి కావు' 21వ శతాబ్దంలో ప్రపంచాన్ని ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాలేమిటో మనం జోస్యం చెప్పలేము. కాని వాటిని ఎదుర్కోవడంలో విజయం సాధించే అవకాశం ఉండాలంటే మాత్రం అవి తప్పక మార్క్స్‌ లేవనెత్తిన ప్రశ్నలను ముందుకు తీసుకురాకుండా జరగదు. ఒక వేళ ఇష్టం లేకపోతే ఆయన రకరకాల శిష్యులు ఇచ్చిన జవాబులను అమోదించకుండా తోసివేయొచ్చునేమో గాని ఆయన ముందుకు తెచ్చిన ప్రశ్నలు మాత్రం నిలిచే ఉంటాయి.
- ఎరిక్‌ హాబ్స్‌బామ్‌
రచయిత ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు