ఇసుకను భోంచేస్తున్న తెలుగుతమ్ముళ్ళు

రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ సుమారు 400 రీచ్‌లలో రూ.1.70 కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుక అందుబాటులో ఉంది. దీని ద్వారా సుమారు రూ.1000 కోట్లు ఆదాయం రావచ్చనేది ప్రభుత్వ అంచనా. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని రీచ్‌ల కోసం తమ్ముళ్లు తమ అధినాయకుల వద్ద క్యూ కడుతున్నారు. 2014 ఆగస్టు నుంచి ఇసుక రీచ్‌లను ప్రభుత్వమే నిర్వహించింది. ఏడాదిన్నరలో ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ.894 కోట్ల రాబడి వచ్చింది.
ఇందులో రూ.580 కోట్లు ఆ నాలుగు జిల్లాల నుంచే కావటం గమనార్హం. రీచ్‌ల నిర్వహణ, సిసి కెమేరాల ఏర్పాటు, డ్వాక్రా సంఘాల ఛార్జీలకే రూ.369 కోట్లు ఖర్చయినట్లు అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. పేరుకు ఇసుకపై రూ.894 కోట్ల ఆదాయం వచ్చినా, నికరాదాయం రూ.525 కోట్లేనని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ నిర్వహణలో ఉన్నపుడే బినామీ పేర్లతో తెలుగు తమ్ముళ్లు, పలువురు ప్రజా ప్రతినిధులు ఇసుక అమ్మకాలపై పెత్తనం చెలాయించారనే ఆరోపణలు వచ్చాయి. పలు చోట్ల ఆన్‌లైన్‌ ఇసుక అమ్మకాలలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. డ్వాక్రా సంఘాలు, టిడిపి నాయకులే రీచ్‌లలో తిష్ట వేసి మరీ అమ్మకాలు సాగించారు. క్యూబిక్‌ మీటర్‌కు రూ.450 నుంచి రూ.550 ధరే ఉన్నప్పటికీ, రీచ్‌లలో రూ.600 నుంచి రూ.650 వరకు వసూలు చేశారు. అదనపు వసూళ్లపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా ఎక్కడా పూర్తిస్థాయిలో విచారణ చేసిన దాఖలాలే లేవు. దీంతో మరింతగా రెచ్చి పోయిన తెలుగుతమ్ముళ్ళు వేలం పాట ద్వారా అధికంగా ఆర్జించవచ్చునని చూస్తున్నారు.