ఇరకాటంలో మోడీ ప్రభుత్వం

వివాదాస్పద భూ బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు నీతి ఆయోగ్‌ పాలనా నిర్వాహక మండలి సమావేశాన్ని ఒక వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ ఉపయోగించుకున్నారు. ఈ విష యాన్ని ముందే గ్రహించిన తొమ్మిది మంది కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు బుధవారం నాటి సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు రెండు రోజుల క్రితమే ప్రకటిం చారు. ఈ తొమ్మిది మంది కాంగ్రెస్‌ సిఎంలతో సహా 12 మంది ముఖ్యమంత్రులు ఈ సమావే శానికి గైర్హాజరయ్యారు. గైర్హాజరైన కాంగ్రెసేతర ముఖ్యమంత్రుల్లో తమిళనాడు, బెంగాల్‌, ఒడిషా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పని ఒత్తిడి మూలంగా రాలేనంటూ తన లిఖిత పూర్వక ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి పన్నీర్‌ సెల్వం ద్వారా పంపించారు. భూ సేకరణ చట్ట సవరణ బిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఈ బిల్లుకు తాము పూర్తి వ్యతిరేకమని ప్రకటించారు. దీంతో మోడీ ప్రభుత్వం తీవ్ర ఇరకాటంలో పడింది. భూ సేకరణపై రాజకీయ ప్రతిష్టంభన వల్ల గ్రామీణాభివృద్ధి తీవ్రంగా ప్రభావితమవుతోందని, ఫలితంగా స్కూళ్ళు, ఆస్పత్రులు, రహదారులు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు అన్నీ కూడా దెబ్బ తింటున్నాయని ప్రధాని చెప్పిన మాటలకు బిజెపి ముఖ్యమంత్రులు తప్ప ఎవరూ సానుకూలంగా స్పందించలేదు.