ఇదేనా జవాబుదారీతనం?

ప్రభుత్వ ప్రజావ్యతిరేక, నిరంకుశ చర్యలపై కాంగ్రెస్‌, వామపక్షాలు సంధించిన విమర్శనాస్త్రాలతో పూర్తిగా ఆత్మరక్షణలో పడిన ప్రధాని నరేంద్ర మోడీ ఎదురు దాడికి దిగడం దారుణం. పార్లమెంటు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని గురువారం లోక్‌సభలో ఇచ్చిన సమాధానం ప్రతిపక్షాలను కవ్వించే రీతిలో సాగింది. సాధారణంగా ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్షాలు లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేసేదిగా ప్రధాని సమాధానం వుంటుంది. కానీ, గురువారం నాటి మోడీ సమాధానం దీనికి పూర్తి భిన్నంగా వుంది. విమర్శకు ప్రతి విమర్శ ఎప్పుడూ సమాధానం కాదు. చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన వాటిలో అసంబద్ధమైనవి, నిర్హేతుకమై నవి ఏమైనా వుంటే అది వేరు. వాళ్లు లేవనెత్తిన హెచ్‌సియు, జెఎన్‌యు, జాట్ల ఆందోళన, నల్లధనం, అధిక ధరలు, నిరుద్యోగం వంటివన్నీ నేదు దేశంలో అత్యధిక సంఖ్యాకులను కలవరపరుస్తున్న కీలక సమస్యలు. పార్లమెంటుకు జవాబుదారీ వహించే ఏ ప్రభుత్వమైనా వీటికి సమాధానం చెప్పాలి. కానీ మోడీ సమాధానంలో వీటి ఊసే లేదు. ప్రతిపక్షాలు న్యూనతాభావంతో పార్లమెంటును అడ్డుకుంటున్నా యని ఆక్రోశం వెళ్లగక్కడం తప్ప, వీటికి సమాధానమిచ్చేందుకు కించిత్‌ కూడా ప్రయత్నించలేదు. ఇంకో వైపు వివాదాస్పద జిఎస్‌టి వంటి బిల్లులకు ప్రతిపక్షాలు సహకరించటం లేదని ధ్వజమెత్తారు. ఈ అంశంపై ప్రతిపక్షాలను ఆడిపోసుకునే ముందు తన వైఖరే మిటో చెబితే బాగుండేది. మొదట యుపిఏ ప్రభుత్వం ఈ బిల్లును తెస్తే అప్పుడు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వున్న మోడీ, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి ఎందుకు అడ్డుకున్నట్లు? నేడు అదే బిల్లును మళ్లీ ఎందుకు ప్రవేశపెట్టినట్లు? ఇది బిజెపి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం కాదా? దీనికి సమాధానం చెప్పకుండా ప్రతిపక్షాలపై నిందలు వేయడం తగునా? పార్లమెంటు ఎన్నికల ప్రచార సందర్భంగా నల్లధనం గురించి మోడీ ప్రస్తావిస్తూ, తాను అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెనక్కి రప్పించి ప్రతి ఒక్కరి అకౌంట్‌లో 15 లక్షలు జమ అయ్యేలా చూస్తానని డాంబికాలు పలికారు. అధికారంలోకి వచ్చాక నల్లధనులను కటకటాల వెనక్కి పంపాల్సింది పోయి వారికి క్షమాభిక్షను దశల దశలుగా పొడిగిస్తూ పోతున్నారు. నల్లధనులకు ఈ ప్రభుత్వం ఫెయిర్‌ అండ్‌ లవ్లీ యోజన పథకం ప్రకటించిందని ప్రతిపక్ష నేత విమర్శిస్తే దానికి ప్రధాని సమాధానమివ్వరు. దేశంలో పేట్రేగుతున్న సంఫ్‌ుపరివార్‌ మూకల ఆగడాలు, ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలపై దాడులను ఉదహరిస్తూ, ఈ ప్రభుత్వంపేదరికం కన్నా భయంకరమైన భావ దారిద్య్రంతో బాధపడుతోందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తే దాని గురించి కనీసం ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. పార్లమెంటు పట్ల ప్రభుత్వం వహించాల్సిన జవాబుదారీ ఇదేనా? మరో ముఖ్యమైన అంశం భారత విశిష్ట గుర్తింపు కార్డు (ఆధార్‌) వ్యవహారం. దీనిపై బిజెపి ఎన్ని పిల్లిమొగ్గలు వేసున్నదీ దేశ ప్రజలు గమనిస్తున్నారు. నాడు ప్రతిపక్షంలో వుండగా ఆధార్‌ను వ్యతిరేకించింది. ఇప్పుడు ఆధార్‌ అమలుకు నిరంకుశంగా ముందుకు సాగుతున్నది. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ, గురువారం లోక్‌సభలో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టింది. అధికార పక్షానికి రాజ్యసభలో తగినంత బలం లేదు కనుక అక్కడ తన పప్పులుడకవని, లోక్‌సభ నుంచి నేరుగా రాష్ట్రపతి ఆమోదానికి పంపేలా దీనిని ద్రవ్య బిల్లు కేటగిరీకింద చేర్చింది. ఆధార్‌ బిల్లును ద్రవ్య బిల్లుగా ఎలా ప్రవేశపెడతారని అడిగితే దానికీ సమాధానం లేదు. ఇది మోడీ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి తాజా నిదర్శనం. ఆధార్‌ కార్డును ఉపయోగించి పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలన్న దుర్బుద్ధితోనే బిజెపి ఈ ఆధార్‌ను ఇంత ఆదరాబాదరాగా తీసుకొస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కారణంతోనే సుప్రీం కోర్టు కూడా ఆధార్‌ తప్పనిసరి కాదని ప్రభుత్వం నోటిఫై చేయాలని గట్టిగా ఆదేశించింది. దానిని గౌరవించకుండా ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ తన బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు ఆధార్‌కు ముడిపెట్టారు. ఆ వెనువెంటనే ఈ బిల్లును తీసుకొచ్చారు. దేశంలో ఎక్కడ ఏ పౌరునికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్నైనా ఇట్టే తెలుసుకుని, వారి స్వేచ్ఛను హరించడానికి దీనిని దుర్వినియోగపరిచే ప్రమాదం లేకపోలేదు. తన కేబినెట్‌ మంత్రులు మైనార్టీలపై విద్వేషాలను రెచ్చగొడుతూ నోటికొచ్చినట్టల్లా మాట్లాడుతుంటే దాని గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. అసలు మోడీ కేబినెట్టే ఈ కరడుగట్టిన ఆరెస్సెస్‌ వాదులతో నిండిపోయింది. దీనికి ముసుగువేసి ప్రతిపక్షాలకు పార్లమెంటరీ సంప్రదాయాల గురించి ప్రధాని హితబోధలు చేయడం విడ్డూరంగా వుంది. మీడియా సాక్షిగా జెఎన్‌యు విద్యార్థులపైన, ప్రోఫెసర్ల పైన పటియాల కోర్టులో బిజెపి, ఆరెస్సెస్‌ గూండాలు దాడి చేశారు. ఇలా చేయమని మీకు ఏ మత గ్రంధం బోధించిందని ప్రతిపక్షాలు నిలదీస్తే దానిపై మౌనం వహించారు. పాకిస్తాన్‌ పట్ల భారత్‌ వైఖరి విషయంలో ప్రధాని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని, నాగాలాండ్‌ ఒప్పందం గురించి కేంద్ర హోమ్‌ మంత్రి రాజ్‌నాథ్‌కు ఎరుకే లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తే వాటిపైనా మూగనోము పాటించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాందీ, స్టాలిన్‌లను సందర్భరహితంగా ఉటంకిస్తూ ప్రతిపక్షాలపై విరుచుకుపడేందుకు ఎక్కడలేని ఉత్సుకత ప్రదర్శించారు. ప్రతిపక్షాల విమర్శను పరిగణనలోకి తీసుకోకుండా, వాటి నుంచి సహకారాన్ని ప్రభుత్వం ఏ విధంగా ఆశించగలదు? ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం తన ధోరణిని మార్చుకోవాలి. ప్రజాస్వామ్యంలో కీలకమైన జవాబుదారీ తనాన్ని పాటించాలి.