ఇక భూసేక'రణమే'!

విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయం కోసం బలవంతపు భూసేకరణకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఆరునూరైనా సర్వే చేయాలని అధికారులను ఉసుగొలిపింది. దీంతో, సోమవారం నుంచి సర్వేకు అధికారులు సిద్ధమవుతున్నారు. విమానాశ్రయ ప్రతిపాదిత గ్రామాల్లో సర్వేలు చేస్తామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. భూములిచ్చేదిలేదని రైతులు చెప్తున్నా, ప్రభుత్వం మొండిగా ముందుకు సాగుతుండటంతో ఎయిర్‌పోర్టు బాధిత గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.సన్‌రైజ్‌ ఎపిలో భాగంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు విశాఖలో మూడు రోజుల పాటు జరిగే సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. దీనికి హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ మూడు రోజులపాటు విశాఖలోనే ఉంటున్నందున భోగాపురం ఎయిర్‌పోర్టుకు భూసేకరణపై కీలక నిర్ణయం చేస్తారని సమాచారం. రైతులను భయపెట్టి తీసుకున్న 80 ఎకరాల డీ-పట్టా భూముల్లో ఈ నెల 16, 17 తేదీల్లో సిఎం శంకుస్థాపన చేస్తా రని విశ్వసనీయ వర్గాల కథనం.