ఇంటికే ఉద్యోగం మరో మోసం:DYFI

ప్రజల వద్దకే ఉద్యోగం అని సిఎం చంద్రబాబునాయుడు ప్రకటించడం మరో మోసమని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. సూర్యారావు విమర్శించారు. ఈ మేరకు ఇంటికే ఉద్యోగంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు డివైఎఫ్‌ఐ బహిరంగ లేఖ రాసింది. రాష్ట్రంలో వివిధ శాఖలో ఖాళీగా ఉన్న 1.42 లక్షల పోస్టులను ముందుగా భర్తీ చేయాలని సూర్యారావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క పైసా ఖర్చు లేకుండా తిరుమల తిరుపతి ఆలయంలో ఖాళీ పోస్టులను భర్తీ చేయవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ స్వాస్తియ అభియాన్‌ కింద మన రాష్ట్రానికి 752 ఉద్యోగాలు కేటాయించిందన్నారు. రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శి పోస్టులు 2600, పోలీసుశాఖలో 8800, యూనివర్సిటీల్లో 1560, వ్యవసాయ, ఉద్యానవనంశాఖలో 8000. నర్సింగ్‌లో 4500, పారా మెడికల్‌ 1650, డాక్టర్‌ 1500, ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో 8500, జూనియర్‌ డిగ్రీ కళాశాలల్లో 5500, గిరిజన గురుకులాల్లో 2000 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. సంవత్సరం కాలంలో ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదన్నారు. కేవలం హామీల సిఎం అని ముద్ర పడక ముందే అన్ని రకాల పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చి నిరుద్యోగులను ఆదుకోవాలని ఆయన కోరారు.