
ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లో శాంతిస్థాపన దిశగా తీవ్రవాదులతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ ఒప్పందంతోనైనా దశాబ్దాల తరబడి సాగిన హింసాకాండ అంతమవుతుందని ఆశించవచ్చు. అయితే, ఆశలు, ఆకాంక్షలు వేరు. క్షేత్రస్థాయిలో ఉండే వాస్తవ పరిస్థితులు వేరు. ఇది సూత్రప్రాయ అంగీకారం మాత్రమేనని ఒప్పందం కుదుర్చుకున్న నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఇసాక్-ముయివా) -ఎన్‌ఎస్‌సిఎన్(ఐఎం) వర్గాలు చెబుతుండగా ప్రభుత్వం మాత్రం ఘన విజయంగా ప్రకటించుకుంటోంది. ఒప్పందంలోని అంశాలను బహిర్గతం చేయకపోవడం కూడా సందేహాలకు కారణమౌతోంది. ఏమైనప్పటికీ ఇరు పక్షాలూ పరస్పర విశ్వాసంతో, చిత్తశుద్ధితో కృషి చేస్తే శాంతి సాధించడం అసాధ్యమేమీ కాదు. దీనిలో భాగంగా ఒప్పందానికి దూరంగా ఉన్న వివిధ తీవ్రవాద గ్రూపులను కూడా కలుపుకుపోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా తరతరాలుగా అభద్రతా భావంతో ఉన్న స్థానిక ప్రజల్లో నమ్మకాన్ని నెలకొల్పాల్సి ఉంది. ఈ దిశలో అడుగులు పడితేనే శాంతి ఫలాలు ప్రజలకు అందుతాయి. అస్తిత్వ ఆకాంక్షలు ఆలంబనగా సాగిన నాగాలాండ్ హింసాకాండకు సుదీర్ఘ చరిత్ర ఉంది. విభజించి పాలించే దమననీతితో పాటు, స్వాతంత్య్రానంతరం పాలకవర్గాల స్వార్థ రాజకీయ ఎత్తుగడలు ఇక్కడి సమస్యను జటిలం చేశాయి.
ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పి వంటి మతోన్మాద సంస్థలూ హింసాకాండను రెచ్చగొట్టడంలో తమ వంతు పాత్రను పోషించాయి. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే భిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు నాగాలాండ్ ప్రత్యేకత.. ఈ కారణంగానే స్వతంత్ర భారతదేశంలో భాగస్వాములు కావడానికి అక్కడి ప్రజలు విముఖత చూపారు. 1947 ఆగస్టు 15కు ఒక్క రోజు ముందే నాగా నేషనల్ కౌన్సిల్ (ఎన్‌ఎన్‌సి) స్వతంత్ర నాగాలాండ్‌ను ప్రకటించుకుంది. అప్పుడు ప్రారంభమైన చిచ్చు ఇప్పటిదాకా కొనసాగడంలో భారత పాలక వర్గాలూ తమ వంతు పాత్ర పోషించాయి. ప్రజల నమ్మకాన్ని గెలవడానికి బదులుగా వారిని భయోత్పాతానికి గురి చేయడానికి, వారి మనస్సుల్లో సందేహాలను మరింత పెంచడానికి ఉపయోగపడే విధానాలనే అమలు చేశాయి. ఒకవైపు చర్చల ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు కనిపిస్తూనే మరోవైపు దానికి భిన్నమైన చర్యలను చేపట్టాయి. గత ఎన్‌డిఎ ప్రభుత్వ హయంలో వాజ్‌పేయి సర్కారు ఒక వైపు చర్చల ప్రక్రియ కొనసాగిస్తుండగా మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పిలు స్థానిక గిరిజనులను హిందూ మతంలోకి మార్చడానికి ప్రయత్నించడం బిజెపి ద్వంద విధానానికి నిదర్శనం. తాజా ఒప్పదం తరువాతైనా ఆ తరహా సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ఎన్‌ఎస్‌సిఎఎన్(ఐఎం) కీలక డిమాండ్ అయిన నాగా భాష మాట్లాడే ప్రాంతాలన్నింటినీ సంఘటితం చేయాలన్న డిమాండ్ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటన్నది ఇంతవరకు స్పష్టం కాలేదు. ఒప్పదంలోని అంశాలను గోప్యంగా ఉంచడమే దీనికి కారణం. అస్సాం, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాల్లో నాగా భాష మాట్లాడే ప్రాంతాలు గణనీయంగా ఉన్నాయి. ఆ డిమాండ్‌కు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉంటే ఆ రాష్ట్రాల సరిహద్దులను మార్చాల్సి ఉంటుంది. దీనికి ఆ రాష్ట్రాలను ఒప్పించాల్సి ఉంది.
మరో ప్రధాన డిమాండైన సార్వభౌమాధికారం అంశాన్ని ఎలా పరిష్కరించనున్నారన్న అంశంపైనా సందిగ్ధతే నెలకొంది. కీలకమైన ఈ చిక్కుముడులను ఎలా పరిష్కరించాలన్న విషయమై స్పష్టత లేకుండా సంతకాలు పెట్టగానే పండుగ చేసుకోవడం, అంతా తమ ఘనతే అన్నట్లుగా గోబెల్స్ ప్రచారానికి తెరతీయడం అత్యుత్సాహమే అవుతుంది. ఇటువంటి ఒప్పందాలు, ఉల్లంఘనలు గతంలో చాలానే జరిగాయన్న చారిత్రక వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో 1997లో మొట్టమొదటిసారిగా ఎన్‌ఎస్‌సిఎన్ కాల్పుల విరమణకు అంగీకరించింది. ఆ ప్రభుత్వ హయాంలోనే చర్చల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు వీటిని కొనసాగించాయి. దశాబ్దాల తరబడి సాగిన ఈ కృషి ఫలితంగా సాకారమైన ప్రస్తుత ఒప్పందాన్ని సొంత ప్రచార ఆర్భాటానికి కాకుండా శాంతి సాధనకు చిత్తశుద్ధితో ఉపయోగించాలి. అప్పుడే ఆరు దశాబ్దాల హింసాకాండకు నిజమైన చరమగీతం పాడటం సాధ్యమవుతుంది.